కాలం కదిలి వెళ్ళిపోయింది..

డిసెంబర్ 27, 2023

ఓటు వేయడానికి ఆఫీస్ లో సెలవు ప్రకటిస్తారా లేరా అని లంచ్ లో డిస్కషన్స్, నాయకులు ఎవరిని ఎవరు బాగా తిట్టుకున్నారో సోషల్ మీడియా రీల్స్ మీద చర్చలు – ఇవన్నీ దాటేసి, ఓట్లు వేసేసి, కొత్త ప్రభుత్వం రావడం, కొత్తాయన ముఖ్య మంత్రి అయిపోవడం జరిగిపోయాయి.
చూపుడు వేలి మీద పెట్టిన ఇంకు మరక మాత్రం వదిలి – కాలం కదిలి వెళ్ళిపోయింది

వెకేషన్ కోసం పడిన ఆత్రం, అన్ని అమర్చుకున్న ప్రయత్నం, కొత్త ప్రాంతాలను చూసిన ఆశ్చర్యం, ఏవేవో రుచులు చూడటానికి పడ్డ తాపత్రయం – అన్ని అయిపోయి
ఓ వంద ఫోటోలను గూగుల్ ఆల్బమ్ లో వదిలి – కాలం కదిలి వెళ్ళిపోయింది

దగ్గరి వ్యక్తి అకాల మరణం – కుటుంబ సభ్యుల శోకం, ఆచారాలు – కార్యక్రమాలు, నిష్క్రమణలు
నిరాశ నిండిన ఆలోచనలు, పోయిన వారి జ్ఞాపకాలను వదిలి – కాలం కదిలి వెళ్ళిపోయింది

అబ్బాయి కాలేజీ సీటు కి పడిన పాట్లు, ఇంటిని వదిలి దూరం గా ఉంటూ వాడు చేసిన ఫీట్లు
బెరుకుగా వాడు – బెంగతో మేము క్రమంగా దూరంగా ఉండటం అలవాటు చేసి
వాడి ఇంటికి వాడే గెస్ట్ లా మార్చి – కాలం కదిలి వెళ్ళిపోయింది

కరువులు,యుద్దాలు, ప్రకృతి వైపరీత్యాలు –
ఒకరి దైన్యం, వేరొకరి ఆధిపత్యం – ఇవి నిజాలు అయినా వార్తలు గా చూడటం అలవాటయి
ఈ సంఘటనలు క్విజ్ లో అడిగే ప్రశ్నలుగా మార్చి – కాలం కదిలి వెళ్ళిపోయింది

పెళ్లిళ్లు, పండుగలు, ఉత్సవాలు-
బోరు కొట్టేసిన ఫుడ్ మెనూలు, అలవాటైపోయిన పలకరింపులు
ఆర్భాటాల మోజులు – సెల్ఫీ ఫోజులు
ఎపుడు జరిగాయో కూడా గుర్తు లేని రోజుల్లా మారి – కాలం కదిలి వెళ్ళిపోయింది

ఇవే, ఇలాంటి సంఘటనలే- ఇంకో పేరుతోనో, ఇంకో రూపంతోనో వచ్చి మనల్ని పలకరిస్తాయి
అది వచ్చే వారం అయినా- నెల అయినా – పోనీ ఇంకొంచెం ఘనం గా… ఇంకో సంవత్సరం అయినా…అందులో కొత్తగా ఏముంది?
ఏమి మారుతోంది?
కాలం ప్రవాహం లో కొట్టుకుపోయే గడ్డి పరకలే ఈ అనుభవాలన్నీ
వచ్చే పోయే అతిథులే మన ప్రయాణం లో పరిచయాలన్నీ

బాధ, ఆనందం, ఆత్రం, ఆశ్చర్యం, అవమానం…ఇవేమి కొత్త కాదు- శాశ్వతమూ కాదు

ఎదో చేసేయాలన్న ఉత్సాహం, ఎదో తెలుసుకోవాలన్న కుతుహులం…ఇవే మనలని నడిపించేవి – ఇవన్నీ మనతో చేయించేవి.

ఏది తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవక్కర్లేదో – అది దొరికే వరకు ఈ కుతూహలం ఆగదు
ఏమి చేస్తే ఇంకేమి చేయాల్సిన అవసరం ఉండదో – అది చేసే వరకు ఈ ఉత్సాహం ఆగదు
ఆ అన్వేషణ లో భాగమే – మన జీవన ప్రయాణం – మరో కొత్త సంవత్సరానికి ఆహ్వానం!

బంధాల వారధి

ఏప్రిల్ 16, 2023

షాపింగ్ చేసిన బ్రాండెడ్ బట్టలు డాబు కవరులో తెచ్చుకుని ఆ కవర్ల పైన బ్రాండ్ లను చూసి మురిసిపోయారు పిల్లలు. రెండో రోజుకే చెత్త బుట్టను చేరిపోయిన ఆ అట్ట కవర్లలో ని దళసరితనం విలువ తెలిసిన అత్తయ్య – వాటిని వంటింటి అరలలో నూనె మరకలు పడకుండా ఉండటానికి వాడుకున్నారు. అసలు పిల్లలు కొన్న బట్టలు ఎన్నాళ్ళు వాడతారో తెలీదు కానీ, వాళ్లు పారేసిన అట్ట కవర్లు మాత్రం మాకు కొన్ని నెలలు సేవ చేసి పెట్టాయి. కవర్ల పైన పేర్లలో విలువ చూసే పిల్లలకి – మనకి నిజంగా పనికి వచ్చేది అట్ట ముక్క తప్ప దాని పైన అక్షరాలు కాదు అని వాళ్లకు ఆశ్చర్య పరిచే పాఠం ఆమెకి తెలియకుండానే నేర్పించారు అత్తయ్య.

అభిరుచి కోసమో, కాలక్షేపం కోసమో షాపింగ్ చేసే పిల్లల తరం
కొనాల్సిన అవసరాన్ని అనేకసార్లు మదించి, కొన్న ప్రతి వస్తువు కి దీర్ఘ కాలం ఆయువునిచ్చి, దాని వాడకాన్ని సాధ్యమైనంతా పొడిగించే అత్తయ్య తరం
వాళ్ళిద్దరి మధ్య వారధిని నేను – పాత తరం ఆలోచనలు విలువలుగా పిల్లలకి చేరాలని ఆశపడే అమ్మని నేను

కాలేజీ లో ఒక గంట ఈవెంట్ కోసం మూడు గంటలు తిరిగి మరీ కొనుకున్న చొక్కా – పని కాస్తా అవగానే, మరునాటికి ఉండ చుట్టుకుని పెద్దోడి బట్టల బీరువాలో బేలగా చూస్తోంది.
అత్తయ్య బీరువాలో ఏభై ఏళ్ల నాటి చీర కూడా ఒక్క పోగు ఊడిపోకుండా – అంతే కళతో దర్పంగా తలెత్తుకుని చూస్తోంది.
కొత్త క్లాస్ లు మొదలయ్యాయని తెచ్చుకున్న చిన్నోడి పుస్తకాలూ పెన్నులూ నాలుగు రోజులు కాకుండానే చెల్లా చెదురుగా కనిపిస్తే
అత్తయ్య గదిలోని అన్ని వస్తువులు – మావయ్యకి ఆవిడ అన్నం వడ్డిస్తున్నపుడు పెట్టినంత శ్రధ్ధగా సద్దినట్టు అనిపిస్తాయి,

ఇద్దరి గదుల మధ్య అయిదు అడుగుల దూరం కూడా ఉండదు కానీ అరవై ఏళ్ల అనుభవం అంత లోతు ఉంటుంది. వాళ్ళ
మధ్య బంధాల వారధిని కట్టి అనుభవం యొక్క గాఢతను తెలియచేయడమే నా బాధ్యత అనిపిస్తుంది.

వేసవి అంటేనే ఆపసోపాలు పడిపోయి ఏ.సి రూమ్ లలో దాక్కునే పిల్లలు – చల్ల మిరప కాయలో, వడియాలో పెడుతూ డాబా మీద ఎండబెట్టి రమ్మని నానమ్మ పంపినప్పుడు – ఎండ ఒక అవకాశం అని కూడా వాళ్లకు అర్ధం అవుతుంది.
వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ రిలీజ్ డేట్, కొత్త గాడ్జెట్ లాంచ్ డేట్, ఐపీయల్ సీజన్ డేట్స్ లాంటివి తప్ప మిగిలిన ఏ కాలానికి తేడా తెలియని వాళ్ళకి..
రథ సప్తమి రోజు పొంగించే పాలు, శ్రావణ మాసపు వ్రతాలు, అమ్మ వారి నోములు, కార్తీకం లో క్రమం తప్పకుండా పెట్టే దీపాలు, సంక్రాతి కి చేసే పిండి వంటలు – ఏదీ క్రమం తప్పకుండా అత్తయ్య చేస్తూ, మాతో చేయిస్తూ బలవంతం గా అయినా సరే కాల క్రమాన్ని వాళ్ళకి వివరిస్తుంది.

అమ్మా-నాన్న కోప్పడితే తాత-నానమ్మల గది వాళ్లకి కంచు కోటలా అనిపిస్తుంది
దెబ్బ తగిలిందని అమ్మ దగ్గరికి వెళితే, చూసుకోలేవా అని తిడుతుంది – అదే నానమ్మ అయితే నూనె రాసి బుజ్జగిస్తుంది
ఎగ్జామ్ కి సరిగ్గా చదివావా లేదా అని నాన్న గదమాయిస్తే – రాత్రి అంత సేపు మేలుకుంటే ఆరోగ్యం పాడవుతుంది నాన్నా అని నానమ్మ నొచ్చుకుంటుంది

మిగిలిపోయిన పిండితో వేసుకున్న అట్టో, నమలలేక నానబెట్టుకుని తినే అటుకులో, వేడిని తట్టుకోడానికి చేసుకునే నిమ్మ మజ్జిగో – మొత్తానికి నానమ్మ తినే ప్లేట్ లో ఏమున్నా – అదే అరుదైన రుచిగా వాళ్ళకి అనిపిస్తుంది.

తలుపులు తీసి పోతారేంట్రా అని తిట్టినా, మంచాలు తొక్కేస్తారని మందలించినా, వస్తువులు వృధా చేస్తారని విసుక్కున్నా..
నానమ్మ గాజుల చప్పుడు వాళ్లకి ఓ భరోసా
గంజి పెట్టి ఆరేసి మరీ కట్టుకున్న చీర కొంగుకి చేతులు తుడిచేసుకునేంత చనువు
ఆమె నుదుటికి నిండుతనం తెచ్చే బొట్టు పెట్టె – వాళ్ళకి చిరు తిళ్ళు కొనిపెట్ట గల నిధుల పెట్టె

పిల్లల అలవాట్లు చూసి ఆందోళన కలిగినా – వీళ్ళేమి నేర్చుకోరా ముందు తరం నుండి అని ఆలోచిస్తున్నా..పిల్లలు వాళ్ళ నానమ్మ గురించి నాకు చెప్పే మాటలు ఒక భరోసా కలిగిస్తాయి…

హాల్లో ఎక్కడో దివాన్ మీద పడుకున్న నానమ్మకి కిచెన్ లో కంచం చప్పుడు బట్టీ నేను పెరుగన్నం స్కిప్ చేసేశానని ఎలా తెలుస్తుంది అసలు?
బయటకి వెళ్ళినపుడు నేను పట్టుకోకపోతే నాలుగు అడుగులు కూడా కష్టం గా వేసే నానమ్మ – పండుగలకు నాలుగు గంటలు నిలబడి మరీ ఇన్ని రకాలు చేసే ఓపిక ఎలా వస్తుంది?
స్కూల్ కి హడావిడిగా వెళ్తున్న నేను ఏమి మర్చిపోతానో ముందే ఊహించేసే విజన్ ఎక్కడిది?
ఇంక అయిపోయింది అని నేను పడేసిన వస్తువు జీవిత కాలం ఇంకో వారం అయినా పొడిగించి చూపించ గలిగే మ్యాజిక్ ఎక్కడిది?
ఫ్రిడ్జ్ లో కూరగాయలు, డబ్బాల్లో సరుకులు అయిపోయాయి అని నాకు కనిపిస్తున్నా సరే – అన్నం పెట్టేసాను వచ్చేయి అన్న పిలుపు ఎలా వస్తుంది?
జీడీ పప్పు కోసం అరగంట వెతికినా కనపడని నాకు – వంటింట్లో మూడో అరలో, ఐదో డబ్బాలో పెట్టాను అని అంత ఖచ్చితం గా తనకి ఎలా గుర్తు ఉంటుంది?
చుట్టాలు చేతిలో పెట్టిన డబ్బులన్నీ -ఎవరు ఎపుడు ఎంత ఇచ్చారో నానమ్మ దాచి పెట్టి మరీ ఎలా లెక్కలు చెబుతుంది?

అసలు ఎలా అమ్మా?
అని అపుడపుడు పిల్లలు పడే ఆశ్చర్యం చూస్తే – ఈ ఆశ్చర్యమే వాళ్ళకి క్రమంగా ఆలోచనగా మారి, జాగర్త పడాలనే పాఠం నేర్పిస్తుంది అని నమ్మకం కలుగుతుంది.
తాత-నానమ్మల మధ్య చేరి కబుర్లు చెబుతూ, వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్న పిల్లలను చూస్తే ముచ్చట అనిపిస్తుంది. వీళ్ళకి మేము ఇవ్వగలిగిన బహుమతి ఇంత కంటే ఏముంది అనిపిస్తుంది.

ఫ్రీజింగ్ మూమెంట్స్

మార్చి 26, 2023

తెల్లారుతూనే తలుపులు తెరచి బాల్కనీలోకి వెళ్ళగానే పలకరిస్తాడు ఆ భానుడు. నిన్నా ఇలాగే వచ్చావు, మొన్నా ఇలాగే వచ్చావు – ప్రతీ రోజు ఇలాగే పలకరిస్తావు – నా మూడ్ తో నీకసలేమి పట్టదా ఓ భాను మూర్తీ?
టంచన్ గా వచ్చేస్తావ్ – పని పూర్తి చేసుకుని హుందాగా వెళ్ళిపోతావు. నీలో ఏమీ తేడా లేదు. కానీ నాకే ఒకో సారి చాలా స్ట్రిక్ట్ మాస్టారిలా అనిపిస్తావు, ఇంకోసారి ఓ సన్నిహితుడిలా అనిపిస్తావు, మరో సారి నా గోడు ఏమీ పట్టించుకోని ఓ మాయగాడిలా అనిపిస్తావు.

అసలు గడిస్తే చాలు.. అనుకునే ఓ గడ్డు రోజైనా, సంబరాల అంబారీ ఎక్కి ఊరేగుతూ ఉఫ్ మన్పించేసే ఓ అరుదైన రోజైనా, బద్దకపు ముసుగులో దాక్కుని బలవంతాన నెట్టుకెళ్లిన ఓ రోజైనా, దిక్కు తోచని నిరాశతో నైరాశ్యం నిండిన ఓ రోజైనా..
ఏది ఏమైనా మళ్ళీ తెల్లారి తీరుతుంది. అంతే వేగంగా సాయంత్రమూ అయి, చీకట్లు అలుముకుని ఆ రోజు ఓ గతంగా మారి కాల గర్భం లో తలదాచుకుంటుంది.

ఆ ఆదిత్యునికి ఏ రోజైనా తన కర్తవ్యం కంటే అతీతమైంది ఏమీ కాదు. అలాగే వస్తాడు- పలకరిస్తాడు- తన పని చేసుకుంటాడు – అసలు తనకేమీ పట్టనట్టు నిష్క్రమిస్తాడు. ఒకోసారి అపుడే వెళ్ళిపోతావేం అని నిలదీయాలనిపిస్తుంది. మరో సారి ఇంకా బయలుదేరవేం నాయనా అని బతిమాలాలనిపిస్తుంది, ఇంకోసారి ఎప్పుడెళ్ళిపోయాడబ్బా అని ఆశ్చర్యపోవలసి వస్తుంది. అలాంటి గందరగోళ గమనం లో మనకి నచ్చినట్టు అనిపించిన క్షణాలు నిలిచిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది – అవి మన పాలిట ‘ఫ్రీజింగ్ మూమెంట్స్’

‘ప్రతి రోజూ’ అనేది ఆ ప్రభాకరుడు కాలాన్ని ఓ పొట్లం కట్టి, ప్రత్యూష వేళ ఆకాశం అనే అందమైన కాన్వాస్ పైన నారింజ రంగు నేపథ్యం లో, పక్షుల సవ్వడి సంగీతంగా,చల్లని గాలి వింజామరలు వీచి మరీ, మన బాల్కనీ లోనే మన చేతులో పెట్టే ఓ బహుమతి. దాన్ని అంతే అందంగా చిరునవ్వుతో అందుకుని ప్రతి క్షణం అపురూపంగా చూసుకోవాలి – వాటిని అనుభవాలుగా-అనుభూతులుగా మార్చుకోవాలి. అంతే గాని, చైతన్యమే స్వరూపం గా ప్రవహించే కాలం లో కొంత సమయాన్ని ఫ్రీజ్ చేసేసుకోవాలి అనుకోవడం పిచ్చితనమే!

అసలు రోజులు గడిచి వెళ్లిపోయే క్రమం చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే – మనం ఎంత నిమిత్త మాత్రులమో కదా అని అంగీకరించి తీరాల్సిందే.

ప్రతీ రోజూ మనం చేయాల్సిన పనులు బాధ్యతగా చేస్తుకుని వెళ్ళిపోతూ ఉంటే పశ్చాత్తాపం ఉండదు.
మనం చేస్తున్న ప్రతి పనిని ప్రేమించ గలిగితే – ఇదే కావాలి అనిపించే పని అంటూ ఏమీ ఉండదు. అపుడు రేపటి కోసం ఎదురుచూపు ఉండదు. ఎదురు చూపు లేనపుడు ఏ రోజులోనూ తేడా ఉండదు. అసలు రోజులు అంటే లెక్కే ఉండదు.
ఇక ఫ్రీజింగ్ మూమెంట్స్ తో పనేమీ ఉండదు.

ఒక రోజులో ఏమైనా కానీ – ఏదైనా జరగనీ…దానిలో మనకి ఛాయస్ ఉండదు. కానీ ఖచ్చితం గా ప్రతి రోజూ ఒక ఛాన్స్!
ఆ దినకరుడు ఇచ్చిన ‘రోజులు’ అనే పేజీలను మన ప్రయత్నం తో మనకి నచ్చిన అనుభవాలుగా మార్చి మన డైరీ లోని పేజీలుగా పదిలం చేసుకుని సాగిపోతూ ఉంటే సాధ్యమైనన్ని విలువైన క్షణాలు మిగులుతాయి – ప్రతీది మధుర క్షణం కావాల్సిన పని లేదు – ఫ్రీజింగ్ మూమెంట్స్ ని ఏరుకుని మరీ దాచుకోవాల్సిన అవసరమూ ఉండదు.

వెయిటింగ్ వరమైన వేళ!

మార్చి 14, 2023

ఈ మధ్య శ్రీశైలం వెళ్ళాం. అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుని శర వేగంగా క్యూ లైన్ లో దూసుకుని వెళ్లిపోతున్న మా లాంటి భక్తులకి బ్రేక్ లు వేసి – ఇలా రండి నాయనా అని ఒక పెద్ద గది లో కూర్చోబెట్టారు స్టాఫ్. ఆ పెద్ద గది ని వెయిటింగ్ హాల్ అంటారు అని కనీసం ఇంకో గంటన్నర అక్కడే వెయిట్ చేయాలి అని విన్నవించి వెళ్లిపోయారు ఆ స్టాఫ్. VIP లాంటి భక్తులం – మాకు కూడా వైటింగా అనుకుంటూ ఒకొక్కరు ఆ హాల్ లో చేరుతున్నారు. గంటన్నర కనీస వెయిటింగ్ అని వినగానే గతుక్కుమన్నారు అందరూ. ఇక మొదలైంది సందడి ఆ హాల్ లో..

అందరి సెల్ ఫోన్ లు లాగేసుకుని కుదురుగా కాసేపు కూర్చోండిరా అంటే మనుషులు ఎంత కొట్టుకు పోతారో కళ్ళకు కట్టినట్టు కనపడింది ఆ కాసేపట్లో!

ఎక్కడ ఫ్యాన్ గాలి బాగా వస్తుందో సర్వే చేసి, ఎటు వైపు తలుపులు ముందుగా తెరుస్తారో తర్జన భర్జన లతో కాలు నిలవనియ్యక తిరుగుతూనే ఉన్నారు కొందరు.
ఇలా ఇరుక్కున్నామెంటా, ఈ ఇక్కట్లు ఏంటో – బొత్తిగా మేనేజ్ చేయడం రాదు అంటూ గ్రూప్ డిస్కషన్ పెట్టిన పెద్ద మనుషులు కొందరు
నిమిషానికి 70 సార్లు వాచీ వంక చూస్తూ, సెకనుకు ఒకసారి ‘ప్చ్’ అంటూ నిట్టూరుస్తున్న నిరాశావాదులు కొందరు.
అసలు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నామంటే – లోపల కొంత మంది ఎలా లబ్ది పొందుతున్నారో అని కుళ్ళుకుంటున్న వాళ్ళు కొందరు..

హాలు మొత్తం రణ గోన ధ్వనులు, చిరాకులు, నిట్టూర్పులు..ఇవి ఎక్కడైనా ఎపుడైనా కనపడేవే! ఈ గుంపులో ప్రశాంతం గా ఎలా గడపాలా అని నిశితంగా పరిశీలిస్తే అపుడు కనపడ్డాయి కొన్ని మంచి దృశ్యాలు.

కింద కూర్చోవాలో లేదో అని కుర్రాళ్ళు కూడా జంకుతున్న చోట కొందరు ముసలి జంటలు మటం వేసుకుని మరీ కూర్చుని – కుర్చీల కోసం కొట్టుకుంటున్న కొందరికి కింద కూర్చోవడం లో ఉన్న ఆనందం చూపించారు.


5 -6 ఏళ్ల లోపు పిల్లలు నలుగురు రౌండ్ గా కూర్చుని వాళ్ళ చేతులతోనే చమ్మ చక్క లాంటి రక రకాల ఆటలు ఆడటం మొదలెట్టి వాళ్ళ ముఖం లోని కాంతితో చాలా మందిని ఆకట్టుకున్నారు.


ఫోన్ చేతిలో లేదు కాబట్టి పాపకి పాలిస్తున్న ఓ తల్లి తన బిడ్డ వంక తృప్తిగా చూసుకుని మురిసిపోతోంది.


చక్కటి కట్టు బొట్టు తో వచ్చిన యువ జంటలు సెల్ఫీలు దిగే ఛాన్స్ లేదు కాబట్టి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.


మధ్య వయస్కులు కొందరు ఇది వరకు తాము చుసిన పుణ్య క్షేత్రాలు, అసలు జ్యోతిర్లంగాలు ఏంటో, ఎన్ని ఉన్నాయో అని వాళ్ళ పిల్లలకి కధలుగా చెప్పడం మొదలెట్టారు.


శుభ్రం పేరు తో అప్పటి వరకు కన్నెత్తి చూడని శనగలు, పల్లీల బుట్టలు – హైజీన్ పొరలు ప్రతి పది నిమిషాలకు కరుగుతుండటం తో పొట్లాలుగా మారి ఒక్కొక్కరి చేతిలో చేరిపోతున్నాయి.


విసిరేసిన బాటిల్స్ బంతులుగా, పారేసిన కాగితాలు ఆట బొమ్మలుగా మారి చిన్నారులకి అలరిస్తున్నాయి.


చిరు నవ్వుతో మొదలైన కొన్ని చిట్టి పొట్టి మాటలు – పలువురు చేరి పగలబడి నవ్వే స్థాయికి చేరుకున్నాయి.


అలాంటి హాలులో జన సమూహం మధ్య “ఇరుక్కున్నాం” అనుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాలం కదలడానికి మొరాయిస్తుంది.
ఇంతమంది, ఇన్ని రకాల మనుషులను ప్రత్యక్షం గా వీక్షించడం ఒక “అనుభూతి” గా భావిస్తే – ప్రతి దృశ్యం ఇంపుగా అనిపిస్తుంది.
ఎన్ని ఇన్స్టాలు, ఫేస్ బుక్ రీల్స్ కి సరిపోతాయి ఈ అనుభవాలు!
ఒక్కో వ్యక్తిని, కుటుంబాన్ని గమనిస్తే ఒక సంభాషణ వినిపిస్తుంది – అదే ఒక గుంపు గా భావిస్తే గోలగానే అనిపిస్తుంది.
శ్రీశైల మల్లన్న ఓ గంటన్నర సేపు సైకాలజీ క్లాస్ లో కూర్చోబెట్టినట్టు అనిపించింది.

  • నిన్ను నియంత్రిస్తున్న ఆ బుల్లి యంత్రాన్ని కాసేపు పక్కన పెట్టి నీ చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తూ ఉండు.
  • నన్ను చూసే ముందు నీ సాటి మనిషిని చూసి, విని, మాట్లాడి ఆనందించడం నేర్చుకో
  • పరుగులు ఆపి నిదానంగా ఉండు
  • చిర్రు బుర్రులు తగ్గించి కాస్త చిరు నవ్వులు చిందించు

అని పాఠాలు చెప్పినట్టు అనిపించింది.

దర్శనం క్యూలు తెరిచాక తోపులాటలు, కేకలు దాటి స్వామి వారిని చూసిన ఆ కొన్ని క్షణాలు అనిపించింది కాలం ఆగిపోయిందా అని!
కాలం నత్త నడకా నడవదు – ఎవరి కోసమూ పరుగులూ పెట్టదు.

నీ ఆలోచనా విధానం లోనే ఆనందం అంతా ఉంది అని ఆ కాలాతీతుడు ఇచ్చిన సందేశం తో – మనసు నిండా ఆయన రూపంతో తృప్తిగా బయటకి వచ్చాను.

వెకేషన్

జనవరి 3, 2021
వెకేషన్ అంటే – ఒక హడావిడి నుండి ఇంకో సందడికి పరుగులు పెట్టడం కాదు
మన మూలాలను గుర్తు చేసే అనుభవాలను చవి చూసి – మన లోతుల్లోకి వెళ్లే అవకాశాలను కల్పించుకోవడం – 
మన వారితో గడిపి రావడం. అందుకే నాకెపుడూ మా ఊరులో గడపడం  కంటే మంచి వెకేషన్ ఇంకేదీ లేదనిపిస్తుంది!

పెరట్లో వాల్చిన మడత మంచం, అరుగుల మీద అమ్మలక్కల కబుర్లు, అలుపెరగకుండా ఆడుకొంటున్న పిల్లలు
అల్లుకున్న పాదులు, వంగ పువ్వులు, విరిసిన ముద్ద బంతులు
స్వచ్ఛమైన ఈ పరిసరాల ముందు సోషల్ మీడియా చిన్న బోక ఏం చేస్తుంది ? 

ధనుర్మాసాన్ని దర్పణం లో చూపించే రంగవల్లులు
చలికి ముసుగేసిన  దుప్పట్లోంచి బద్ధకం వదిలించుకుని లేచేసరికే సిద్ధంగా ఉన్న తిరుప్పావై ప్రసాదాలు
అర్ధ రాత్రి వినోదాల కంటే ఉషోదయపు సొగసులు ఎంత బాగుంటాయో హరిదాసు ఎలుగెత్తి మరీ చెప్పినట్లు అనిపిస్తుంది

 అరిసెల పాకం తీయడం లోని నేర్పు, తిరగలితో పిండి విసరండాలోని ఓర్పు
ఎన్ని పనులైనా అలవోకగా చేసుకోవడంలోని కూర్పు
అమ్మల కమిట్మెంట్  కావాల్సినంత స్ఫూర్తి ని ఇచ్చి తీరుతుంది 

రాముల వారి గుడిలో ముద్ద మందారాల మాల వేసుకున్న సీతమ్మ
దుర్గమ్మ గుడిలోని కుంకుమ
అన్నవరం ఆకు ప్రసాదం లోని మధురిమ
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంత తను నింపుతుంది 

అన్నయ్య – వదిన ల ఆప్యాయత ల తీరు
ఆదరణతో నిండిన అక్క బంగారు
అర్ధ రాత్రి దాకా చెల్లితో చెప్పుకున్న కబుర్లు
మనసున మోసే భారాలన్నీ  దించేసి తీరుతుంది 

పిన్ని బోళాతనం బాల్యాన్ని గుర్తు చేస్తే – బాబయ్య మాటలు భవితను ఆలోచింప చేస్తాయి
వండి ఆప్యాయంగా పెట్టడం లోనే తృప్తిని వెతుకున్నే అక్క
కొత్త వంటలతో పిల్లలని – కొత్త ఆలోచనలతో నన్ను ఆశ్చర్య పరిచే చెల్లి
మన వాళ్ళు మనకెపుడు బలాన్ని ఇస్తూనే ఉంటారు అనిపిస్తుంది 

రోటి పచ్చళ్ళు , పొడులు, పులుసులు, గుత్తి వంకాయ లాంటి కూరలు..
అమ్మ వండి వడ్డించాలనుకున్న పదార్ధాల లిస్ట్ కి ఎన్ని పూటలైతే సరిపోతుంది?నా ఉనికి కి కారణం అయిన పరిసరాలు – నా ఆత్మీయులతో గడిపే అనుభవాలు
ఎన్ని రోజులు ఉంటే తనివి తీరుతుంది?

ఓ ఆదివారం

ఫిబ్రవరి 10, 2020

వారం రోజులుగా ఎదురు చూసిన ఆ ఒక్క రోజు..

వచ్చే వరకూ ఏంతో ఊరించిన ఆ ఒక్క రోజు..

హుర్రే! ఇంకేముంది..వచ్చేసింది!

రాక రాక వచ్చిన ‘నా’ రోజు కదా- అపురూపంగా వాడుకోవాలి సుమా!!

నా రోజు – నా ఇష్టం కదా…బారెడు పొద్దెక్కే వరకూ బద్దకంగా పడుకోవడం చాలా ముఖ్యమైన ప్రాధాన్యం

ఇంక పడుకో వడం బోర్ కొట్టడం తో పక్క దిగిన మరుక్షణం మొదలవుతుంది ఆ ఫీలింగ్ ..వారాంతపు నిధిలో అపుడే 9 గంటలు ఖర్చయిపోయాయా అని

ఇక అప్పటి నుండి మొదలవుతుంది తర్జన భర్జన..

భానువారం బరువైనదా? తేలికైనదా తేల్చుకోలేని అయోమయ భావన.

వారపు రోజుల పరుగులతో ఇంటి పట్టున ఉండటం కూసింతే కాబట్టి – పట్టెడు ఇంటి తిండి తినడం సుఖమా? ఊరించే రుచులతో స్వాగతం పలికే బయటి విందులు సౌక్యమా?

బడి ఫీజుల అప్డేట్స్ తప్ప- బుద్ధులు ఏమి నేర్పుతున్నారో తెలియదు కాబట్టి ..

పిల్లలకి క్లాసులు తీసుకోవాలో – లేక క్లాసులు పీకాలో- కధలు, కబుర్లు చెప్పాలో తేల్చుకోలేక అరుపులు, కేకలు, చివరికి నిట్టూర్పులు

కమ్మని నిద్ర కరువైపోతుంది కాబట్టి – ఆదమరిచి పడుకుందామా అంటే ..ఆమ్మో, కరిగిపోదూ నా అపురూప కాలం?

షాపింగు- సినిమానో అయితే గంప గుత్తగా సగం రోజు హుష్ కాకీ అయిపోదూ?

సోఫా లో కూలబడి రిలాక్స్ గా టీవీ చూద్దామంటే- ఏ ఇరవై సారో వచ్చే ఈ బొమ్మ కోసమా నా బంగారు తల్లిని బలి పెట్టేసేది?

కప్పున వేలాడుతున్న బూజు – బల్లల మీద కులాసాగా వాలిపోయిన దుమ్మో – ఆ రోజే కనపడాలా? నా విశ్రాన్తి మీద కక్ష కాకపోతే?

వెబ్ సిరీస్ నాలుగు ఎపిసోడ్ లు చూసాక- ఆరు నెలలు క్రితం కొన్నా ఆరు పేజీలు కూడా కదలని పుస్తకం వెక్కిరిస్తుంది

వీనుల విందైన సంగీతం విని ఉర్రుతలూగుతుంటే – వెళదామని మానేసిన ఓ ఫంక్షనో, బంధువుల ఇళ్లో గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తుంది

చెట్లు – పిట్టలు చూద్దామని పార్కుకి వెళితే..కమ్ముతున్న చీకట్లు- కరిగిపోతున్న రోజుకి వీడ్కోలు చెప్పే వేళ అయిందని గుర్తు చేస్తుంది

ఆదివారమా- ఏమి చేయాలి నిన్ను?

పట్టుకునే శక్తి లేదు – వదిలేద్దామంటే మనసు రాదు

దోచుకుందాం అంటే పరుగు పెట్టాలి – దాచుకుందాం అంటే నీకు దాసోహం అవ్వాలి

అన్నీ చేసేద్దాం అంటే – అసలు నువ్వు ‘ఆదివారం ‘ ఎందుకు అవుతావు?

పోనీ ఏమీ చేయకుండా ఉందాం అంటే – నువ్వొచ్చి ఏమి ఉపయోగం?

అందుకే – నీ కోసం తపిస్తే ఎదురు చూపులే తప్ప ఏమీ మిగలవు

నువ్వెప్పుడు వచ్చి వెళ్ళావో తెలియని స్థితి కి చేరగలిగితే..

వారాలన్నీ నావే – అన్ని రోజులూ అనుభవాలే- నిత్యం అనుభూతులే!!

చింత- చింతన

నవంబర్ 23, 2019

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేదు అని బాధ పడుతూ కూర్చున్న అమ్మాయి ని చూసి – పోతే పోయిందిలే దాని గురించి వదిలేయమ్మా… అని నాన్న నచ్చ చెప్పారు. రెండు రోజులు చింతిస్తూ కూర్చున్న అమ్మాయి మాములుగా తిరగడం మొదలెట్టింది. అలా ఒక నెల పైనే గడిచాక …అమ్మాయికి ఉద్యోగం రావట్లేదు అన్న చింత నాన్న కి మొదలైంది.
అపుడు నాన్నకి తట్టిన ఆలోచన.. అమ్మాయిని ఉద్యోగం రాలేదు అని చింత పడకమ్మా అన్నానే కానీ – దాని గురించి చింతన చేయొద్దని కాదు కదా అని.

రేపటి రోజు పరీక్షో లేక ఇంటర్వ్యూ నో లేక మీటింగో, …ఏదైనా సరే..
ఎలా జరుగుతుందో అని ఆందోళన చెందడం చింత
ఎలా జరగాలో సావధానం గా ఆలోచించడం చింతన

రేపటి గురించి ఆలోచించొద్దు- ఈ రోజు, ఈ క్షణం మీద మనసు లగ్నం చెయ్యి అన్నది బాగా ఎరిగిన ఫిలాసఫీ వాక్యం. ఈ క్షణాలు కరిగి పోయి – రేపటి క్షణాలు ‘ఇప్పుడు’ గా మారడం ఎంత సేపు? మన ‘ఇప్పుడు’ బాగుండాలి అంటే – ఎప్పుడూ గాఢం గా ఆలోచించాల్సిందే కదా..
ఉదాహరణకి – వారం తర్వాత రాబోతున్న ఒక ముఖ్యమైన మీటింగ్ ఎలా నిర్వహించాలి అని లోతుగా ఆలోచించాల్సిందే. నెల తర్వాత వెళ్లాల్సిన టూర్ గురించి విస్తారంగా అలోచించి ప్రణాళిక వెయ్యాల్సిందే. సంవత్సరం తర్వాత పిల్లాడిని ఏ కాలేజీలో చేర్చాలో చక్కగా విచారణ చేయవల్సిందే. ఇలాంటి ఆలోచనలు చెయ్యడానికే కదా భగవంతుండు మనకి బుర్ర ఇచ్చింది. కానీ, అదే బుర్ర.. వైరస్ చేరిన సాఫ్ట్ వేర్ లాగా ఒక రకమైన ఆలోచన చేయాల్సింది పోయి వేరే రకమైన ఆలోచనలతో మస్తిష్కాన్ని నింపేస్తుంది. అలాంటప్పుడే మనం – చింతాకంత కారణాలకి కూడా చింతాక్రాంతులమయ్యేది.

అమ్మో రేపటి మీటింగ్ ఎలా అవుతుందో ఏంటో? కావాల్సిన ఫ్లయిట్ కి టికెట్స్ దొరుకుతాయో లేదో, టూర్ కి వెళ్లి బీచ్ దగ్గర సేద దీరే రోజు రావడానికి ఇంకా 29 రోజులే ఉన్నాయి, మా అబ్బాయికి నేను అనుకుంటున్న కాలేజీ లో సీట్ వస్తుందా – రాకపోతే వాడి భవిష్యత్తు ఏమిటి?….ఇక ఈ ఆలోచనల ప్రవాహానికి అడ్డు ఏమి ఉంది. అడ్డ దారులు తొక్కిన ఈ ఆలోచనల అంతిమ లక్ష్యం ఆందోళన, అయోమయం …ఇదే చింత!

చింతన ఒక చక్కటి విన్యాసం. ప్రణాళిక, జిజ్ఞాస, ఆశ, విశ్వాసం దాని లక్షణాలు. రేపటి రోజు కి మనల్ని చక్కగా ప్రిపేర్ చేసే ఒక పని ముట్టు. సరైన విషయాల గురించి ఎంత లోతుగా అయినా ఆలోచించాల్సిందే…అసలు ఆలోచించక పోవడం ఒక బద్దకపు లక్షణం. ఉవ్వెత్తున దూకే ఉత్తుంగ ప్రవాహం లా సాగే ఆలోచనలు ఎన్నో సమస్యల కి పరిష్కారాలను చూపుతాయి. మన మస్తిష్కానికి ఉన్న శక్తి ని మనకి పరిచయం చేస్తాయి.
ఇంత చిన్న బుర్రలో బ్రహ్మాండాలని ప్రభావం చేసే ఆలోచనలు చేయొచ్చు. స్టుపిడిటీ సునామీలనూ సృష్టించవచ్చు.
చింత – మనల్ని దహించివేసే కార్చిచ్చు అయితే
చింతన- మనల్ని ఏదైనా సాధింప చేయ గలిగే ఒక చిత్రం

చింతించడానికి పెద్ద కారణం ఏమి కావాలి? నల్లని కురులలోంచి తొంగి చూస్తున్న ఒక చిన్న
తెల్ల వెంట్రుక చాలు. ఆడుకుని వచ్చిన చంటాడి చొక్కా పైన మరక చాలు, సగం కోసిన వంకాయ లో బయట పడిన పుచ్చు చాలు.
కానీ.. తలలు బోడులైనా ఆగిపోని జ్ఞాన పరంపర కి మాత్రం చింతన కావాలి. ప్రపంచాన్ని మార్చగలిగిన సౌకర్యాలైన, గ్రహాంతరాలకి వెళ్లగలిగిన సాధనాలైనా, పరమాత్మ ని చేర్చగలిగే సాధకాలైనా…ఎందరో మనలాంటి మనుషులు చింతన ద్వారా సాకారం చేసినవే కదా!

చింత అనేది – చంద మామ కధలో చదివిన చింత చెట్టు మీద దయ్యం లాంటిది అయితే
చింతన అనేది – బోధి వృక్షము కింద జ్ఞాన ముద్ర లో ఉన్న గౌతముడి లాంటిది
అందుకే…మన చింతలకు చెల్లు చీటీ పాడేసి – చింతన తో చైతన్యం పొందుదాం

దైనందిన డిటాచ్మెంట్

జూన్ 8, 2019

మా కాలనీలో గుడి కట్టిస్తున్న పెద్దాయన 10 రోజుల తర్వాత కనిపించి పలకరించగానే – హమ్మయ్య ఈయన క్షేమంగానే ఉన్నారు కదా అన్న ఫీలింగ్ హాయిగా అనిపించింది. 3 నెలల క్రితం వరకు ఆయన ఎవరో కూడా తెలియని నాకు నా ఎమోషన్స్ ను ప్రభావితం చేసే ఒక కారకంగా అయ్యారా? ఏమి చిత్రమో కదా!
15 ఏళ్ల క్రితం లేని పిల్లలు ఇపుడు నా జీవితంలో ప్రధానాంశం అయి కూర్చోవడం, నాన్న లేకుండా ఒక్క రోజు కూడా గడవని కాలం- ఆయన కాలం చేసాక 10 ఏళ్ళు ఇట్టే తిరిగిపోవడం..బంధాల మాయాజాలం కాక ఏమిటి?
ఈ ప్రపంచ పటంలో ఉన్నారని కూడా తెలియని ఓ కొత్త జంట మా పక్కింట్లో చేరగానే వారి పోకడలు మా టీ టైం టాపిక్స్ గా మారడం, ఎవరో కూడా తెలియని వేలు విడిచిన చుట్టాల పెళ్ళికి ఏమి చీర కట్టుకోవాలో అని ఆతృత పడటం, తాటికాయంత ర్యాన్క్ ల పోస్టర్ పై విజయ చిహ్నం మాటున దాగిన ఓ బాల మేధావితో – మా అబ్బాయిని పోల్చుకుని ఆందోళన చెందడం..
ఏంటి ఇవన్నీ? ఎవరు వీళ్లంతా? నా భావాల పై వీళ్ళ ప్రమేయం ఏమిటి?
ఓ మనసా..నీకు మరీ బొత్తిగా పని లేదా? మైనం ముద్దకి నల్ల పూసలు అతుక్కున్నట్టు- ఎంత మందికి నీ భావాల పరిధిలో చోటిచ్చేస్తావ్ ?
డిటాచ్మెంట్ అంటే మనసుకి సంబంధం పెట్టుకోకపోవడం.
మనిషికి లక్ష రకాల లింక్స్ ఉండొచ్చు. కానీ అవి మనసులో అతుక్కోనంత వరకు పర్లేదు.లేదంటే బంధాలు- భావాలకు పరిధి ఎక్కడ ఉంటుంది?

కాలనీ పెద్దాయనకు ఓ ఏడాది క్రితం ఏదైనా అయి ఉంటే నాకు తెలిసేది కూడా కాదు. ఇపుడు తెలుసు కాబట్టి ఈ ఆందోళన. ఇది సహజమే..యాంత్రిక జీవితంలో ఓ అపరిచితుడు పైన ఈ మాత్రం సహానుభూతి ఉండటం ఒక రకంగా రిలీఫ్ కూడా. కానీ వచ్చే స్టేషన్ లో దిగి పోయే ఓ అమ్మాయి పొట్టి నిక్కరు నాకు చికాకు పెడుతున్నా, బస్సులో ఈ కిటికీ దగ్గర కాక వేరే చోట కూర్చుంటే అసలు తారస పడే అవకాశమే లేని ఓ దృశ్యం నాకు ఆందోళన కలిగిస్తున్నా —-ఏంటిరా మనిషీ నీకు ఈ విడవని బంధాలు, భావాల బరువులు? అని నిలదీయాల్సిందే కదా!
పుణ్యక్షేత్రానికి వెళ్లి ఓ గంట ఎక్కువగా క్యూ లో నిలబడాల్సి వస్తే వచ్చే లెక్కలేనన్ని ‘ప్చ్ ‘ లు మనకి సౌకర్యాల పైన ఉన్న బంధాలకు గుర్తులు.
పరీక్షలు రాసేది పిల్లాడైతే- మన చేతుల్లో పట్టే ముచ్చెమటలు ‘మమకారం’ అనే బంధానికి గుర్తులు
పెళ్లి జరిగేది చూట్టానికి ఐతే- మనం తీసుకుని మురిసిపోయే సెల్ఫీ లు ‘నేను’ అనే బంధానికి గుర్తులు
వసుధైక కుటుంబం అంటే అందరూ నా లాంటి వాళ్ళే అనుకోవడం..అంతే కానీ అన్ని గోలలు నాకే అనుకోవడం కాదు. వ్యక్తిగా మన పరిధిని పెంచుకుంటూ పోవాలి. కానీ మనసుకి మాత్రం ఎలాంటి భావాల ధూళినీ చేరనీయని నైజం అలవాటు చేసుకోవడమే దైనందిన డిటాచ్మెంట్ అంటే!

చిన్నప్పటి కథలు- ఊహా లోకాలు

మార్చి 10, 2019

ఆఫీసు పనితో బాగా బిజీ అయిపోయి, పిల్లలతో గడిపే సమయం బొత్తిగా తగ్గిపోతున్న నాకు ఈ మధ్య కాలంలో అక్కరకొస్తున్న చిట్కా – చిన్నప్పటి కథలు చెప్పడం.

కథలు చెప్పడం కొత్తేమీ కాకపోయినా బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ తో బోర్ కొడుతోంది అంటున్న మా చిన్నాడికి – నా చిన్నప్పటి కధలు అదరహో! అనిపిస్తున్నాయి. ‘అనగనగా’ కధలు యాంత్రికంగా అనిపిస్తున్నాయని యధాలాపంగా ఓసారి నా చిన్నప్పటి కథ.. అంటూ మొదలెట్టాను. ఆ పరంపర – ఓ నెల రోజులుగా సాగుతూనే ఉంది. చెబుతున్న నాకు ఆపాత మధురాలలో ఓలలాడి వచ్చేసినట్లు అనిపించి పని ఒత్తిడి నుండి రిలాక్సింగ్ గా కూడా అనిపిస్తుంది.
ట్యాబ్ లో తల దూర్చేసి తన్మయత్వం లో ఉన్న పెద్దవాడు కూడా – పది అడుగుల నల్లత్రాచు, ఇంటింటికి ఎలుగుబంటిని తిప్పే అబ్బాయి, ఓ సారి వరదలో కొట్టుకొచ్చిన కుక్క పిల్ల లాంటి వర్ణనలు ఆసక్తి రేకెత్తించి …నాకూ చెప్పూ- అంటూ పక్కన చేరడం మొదలెట్టాడు.
సెలవలు పెట్టి పిల్లలను ఊర్లు తిప్పే తీరిక లేని నేను – ఈ కధలలోనే..రైళ్లు, ఎర్ర బస్సులు, ఒంటెద్దు బల్లు, పడవలు ఎక్కించేసాను. అమ్మమ్మ గారిల్లు, రేలంగి మావయ్య గారిల్లు, పుష్కారాలకి ఆతిధ్యం ఇచ్చిన పుల్లయ్య పెద నాన్న గారిల్లు, తోటలోని తాతయ్య గారి ఇల్లు…అన్నీ తిప్పేసాను- నా బాల్యం తో పాటు!

నా చిన్నపుడు ఇరుగుపొరుగున ఉండే పెద్ద మీసాల వీర్రాజు గారు, గయ్యాళి నాగమ్మ గారు, చుట్ట పొగ మేఘాలలోనే కనిపించే గవర్రాజు గారు, అర్ధ రూపాయంత బొట్టు పెట్టుకునే అమ్మాజీ గారు, గొడుగు ఎప్పుడూ వదిలి పెట్టని భద్రం తాతయ్య, చాడీలు చెప్పే కనక వల్లీ, చింత నిప్పుల్లాంటి కళ్ళున్న కల్లు దుఖానం దానయ్య, బిస్కెట్ల బండి నడిపే మస్తాన్ బాషా బాబయ్య…లాంటి రకరకాల పాత్రలు – శ్రద్ధగా వింటున్న మా పిల్లల చారడేసి కళ్ళలోనూ కనిపిస్తున్నారు

పొట్లాలు కట్టిన తిరుపతి ప్రసాదాలు ఒక్కో ఇంటికి పంచిపెట్టడానికి వెళ్ళినపుడు – అనసూయమ్మ గారి పెరట్లో కాసిన ఆనప కాయ, రత్నం అక్కయ్య వాళ్ళింట్లో పూసిన ముద్ద మందారాలు, ఎత్తరుగుల అత్తయ్య గారింట్లో అప్పుడే చేసిన కోవా బిళ్ళలు, రామాచారి గారింట్లో ఇచ్చిన కొబ్బరి కాయలతో తిరిగొస్తున్న మా చేతుల్లోని తాయిలాలు, బరువులను సాయం పడుతూ…. మా పిలల్లు!

అబద్ధం చెప్పినపుడు చెంపలు అదరగొట్టిన అమ్మ అరచేతి గుర్తులు, కుంటి అమ్మాయి పద్మావతి కర్ర సాయంతో పరుగు పెట్టిన వైనం, నత్తి రంగడిని గేలి చేసినపుడు వాడి కళ్ళలో జారిన కన్నీళ్లు, దొంగా-పోలీసు ఆటలో దొరక్కుండా ఉండటానికాని చీకటి కొట్లో దాక్కున్నపుడు తేలు కరిచినపుడు పెట్టిన కేకలు, నాన్న కళ్లద్దాలు విరక్కొట్టేసి, వీపు విమానం మోత మోగుతుందని – మంచం కింద దాక్కుని ఊపిరి బిగబెట్టిన భయం, కొయిటా నుండి వచ్చిన – వాళ్ళ పిన్ని తెచ్చిన పూవుల ఫ్రాక్ వేసుకుని వయ్యారాలు పోతున్న రాణి ని చూసినపుడు కలిగిన అసూయ, అతి దగ్గరగా ఎగురుతున్న హెలికాఫ్టర్ లో నుండి చెయ్యి ఊపుతున్న మంత్రి గారిని చూసినపుడు కలిగిన అతిశయం, కొండంత ఓడని వైజాగ్ సముద్రం లో చూసినపుడు కలిగిన ఆశ్చర్యం, నన్నొదిలేసి – మా అన్నయ్యను, అక్కను కొత్త సినిమా కి తీసుకెళ్లినప్పుడు కలిగిన ఉక్రోషం…రకరకాల అనుభూతుల ప్రవాహం లో మా పిల్లలు కొట్టుకు పోతున్నారు – నాతో సహా..

నా చిన్నప్పటి కధల్లోని ఇళ్లల్లో ఏ.సి లు లేవని, అన్నవరం కొండా- అమ్మ వారి జాతరా వెకేషన్ గా వెళ్లడం ఏంటీ అని, ప్రయాణాల్లో పులిహోరా- దద్దోజనం పోట్లాలేంటీ అని, అయిదు రూపాయల బొమ్మ కోసం అమ్మని ఆరు నెలలు బతిమాలడం ఏంటీ అని మొదట్లో నా పైన జాలి ఒలకపోసిన వాళ్ళే ..
వేసవి మధ్యాహ్నాలలో పిల్లలంతా చేసిన అల్లరి, మల్లి గాడు మాతో చేయించిన సాహసాలు, ప్రకృతిలో దొరికే వస్తువులతో బాదం ఆకుల్లో ఫ్రీ గా చేసుకునే పార్టీలు, వెయ్యి గుడి మెట్లు ఎక్కి దిగేసే పందెంలో గెలిచిన గర్వం, కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడుకునే పిల్ల సైన్యం, రాంకుల ఊసే లేని బడులు, పెద్దల ప్రమేయమే లేని స్వేచ్చా ప్రపంచం …పరిచయం అయే కొద్దీ..చిన్నప్పటి నా అదృష్టానికి ఆశ్చర్యపోతున్నారు.

ఇలా చిన్నప్పటి కధల ఊహల్లో విహరించి, చింత లేకుండా నిద్రలోకి జారుకున్న పిల్లలను ఓ సారి ముద్దాడి తృప్తిగా ఆ రోజుకు వీడ్కోలు పలుకుతున్నాను.

సూచన-
చిన్నప్పటి కధలను చెప్పదల్చుకుంటే – ఆయా కధలలో వచ్చే వ్యక్తులను మారు పేర్లు వాడుకుంటే మంచిది. లేకపోతె, పొరపాటున ఆ వ్యక్తి తారస పడితే – పిల్లల ఉత్సాహం ఎక్కువ అయ్యి దొర్లే పలుకులు- వారికి ములుకులై గుచ్చుకోవచ్చు సుమీ!

ఈ కధల్లో కథ కంటే – కథనం ముఖ్యం అని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు – అమ్మమ్మ ఇంట్లో వారం రోజులు ఉన్నాం, ఈ పనులు చేసాం అంటే వాళ్లకి ఆసక్తి రాదు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినపుడు ఎక్కిన బస్సు లో ఏ సీట్ లో కూర్చున్నాం, ఎన్ని ఊర్లలో ఆగాం, రద్దీ అయినపుడు కలిగిన భావాలేంటి, అపుడు అన్నయ్య ఏమి చేస్తున్నాడు లాంటి వివరాలతో కథ నడిపించాలి. ఇలా చెప్పాలంటే – మనకి బోలెడు కథలు ఉంటాయి కదా!
వర్ణనలు బాగా చెయ్యాలి. అర అడుగు పాము చూసి ఉంటే- దాన్ని పది అడుగులకి పెంచేయాలి. నా వంతుగా చిన్న లడ్డు దొరికింది అని చెప్పడానికి ఏ ఉసిరి గింజనో ఉపమానం గా వాడేయాలి.
చిన్నప్పటి కథలను నీతులు బోధించే పని కోసం వాడుకోకూడదు. పిల్ల వెధవలు ఇట్టే పసిగట్టేస్తారు. కల్తీ లేని కథలను చెప్తూ ఉంటే- నీతులు వాళ్ళకే దొరుకుతాయి.

హ్యాపీ..వీకెండేనా??

మార్చి 24, 2018

ఆఫీసుల్లో శుక్రవారం సాయంత్రం జరిగే మీటింగ్ లు సాధారణంగా ‘హ్యాపీ వీకెండ్’ అని విష్ చేయడంతో ముగుస్తాయి. శుక్రవారం సాయంత్రం పని మూటలు కట్టేసి ఇంటికి బయలుదేరుతున్న వారి ముఖాల్లో కొండంత భారం దింపేసుకుని వెళ్తున్న వెలుగు కనిపిస్తుంటుంది. ఇలాంటివి చూస్తే – జీవితం అంటే ‘రెండు వీకెండ్ ల మధ్య వచ్చి పోయే కాలం’ లా చుస్తున్నామా అని ఆశ్చర్యం వేస్తుంది.

ఉరుకులు, పరుగులు లాంటి దినచర్యతో అలసిపోయిన వారికి శనివారం రోజు ఓ గంట ఎక్కువ పడుకోవచ్చనో, ఆదివారం రోజు కుటుంబంతో తనివితీరా గడపవచ్చనో ఉత్సాహం ఉరకలేస్తూ ఉండొచ్చు గాక..
కానీ వీకెండ్ కోసం చకోర పక్షుల లాగా కాచుకు కుర్చునేది- అది రాగానే హమ్మయ్య పని చెయ్యక్కర్లేదనో, రోజంతా టీవీ చూస్తూ కూర్చోవచ్చనో , సుష్టుగా విందులు ఆరగించవచ్చనో, సాయంత్రం దాక స్నానం చేయక్కర్లేదనో లాంటి కారణాల వలన అయితే మాత్రం, వీకెండ్ ల వేటుకి మన జీవితాలు గురి అవుతున్నట్టే లెక్క!

వారం లో 5 రోజులు కస్ట పడేది – 2 రోజులు ఎంజాయ్ చేయడానికా??

సరే ఆ రెండు రోజులు ‘ఎంజాయ్’ చేస్తున్నాము అనుకున్నా సరే- మిగిలిన ఐదు రోజులు ‘కస్టపడుతున్నాం’ అనే భావనను మోస్తూ బతికితే జీవితం ఏం బాగుంటుంది?

చేసే పనిని ఇస్టపడి చేస్తే ప్రతీ రోజు మనకి ఏదో ఒక తృప్తి ని మిగులుస్తుంది. నగర జీవితాల్లో ట్రాఫిక్ జాం లు, పని ఒత్తిడులు, డెడ్ లైన్స్ , దూరాలు (మనుషుల మధ్య కూడా) అనివార్యమైనవి. అవి లేకుండా ఉండటం బాగుంటుంది. అవి లేకుండా ఉండే చోటూ బాగుంటుంది. కానీ ఇక్కడే బతకాలన్న ఒక నిర్ణయం ఏదో ఒక కారణం వలన చేసేసుకున్నాం కదా..కాబట్టి మన నిర్ణయాన్ని మనం గౌరవించుకోవాలి కదా!

వీకెండ్ ల కోసం ఎదురుచూస్తున్నాం అంటే, ఏదో ఒక కారణం వలన మిగిలిన వారపు రోజులలో మన దైనందిన జీవితం మనకి నచ్చట్లేదనే కదా
దానికి వారంలో ఏ రోజైనా ఏం చేస్తుంది పాపం? మౌనంగా వచ్చి వెళ్ళిపోవడం తప్ప!
మన రొటీన్ మన చేతుల్లో ఉంటుంది, మన ఆలోచనలకి మన ప్రమేయం ఉంటుంది. రోజు ఎలా గడవాలో మన ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఒక రోజుని ఎలా ఆస్వాదించాలో పూర్తిగా మన నిర్ణయమే కదా.

ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా వీకెండ్ ల లో జుర్రేసుకుని, మిగిలిన వారం అంతా ఆ కిక్కుతో బండి లాగించేద్దాం అనుకుంటే జీవితం చాలా చప్పగా ఉంటుంది.
వారంలో ప్రతి రోజుని మనదిగా చేసుకుని ‘మన ‘ తాలూకు పరిమళాన్ని ఎంతో కొంత రోజుకి అద్ది సాగనంపితే మన మనుగడ మధురంగా ఉంటుంది.

అసలు హ్యాపినెస్ వీకెండ్ కి మాత్రమే పరిమితం కాకూడదంటే..మనకి ఆనందాన్ని ఇచ్చే అంశాలు వారంతాలలో మాత్రమే జరిగేలా ఉండకూడదు. వాటి కోసం అప్పటి వరకు ఆగక్కర్లేనివి అయి ఉండాలి.
రెస్టారెంట్, మూవీ, షాపింగ్, బార్ లాంటి వాటిలో సమయం గడపడంలో ఆనందం వస్తూంటే – మిగిలిన రోజుల్లో ఇవి చేయడం కస్టం కాబట్టి- వీకెండ్ కి ఆనందం వాయిదా పడుతూ ఉంటుంది.
అదే మనకి నచ్చేవి, ఆనందం ఇచ్చేవి – సంగీతం వినడమో, పుస్తక పఠనమో , వ్యాయామం చేయడమో, పిల్లలతో గడపడమో, చక్కగా వండటం, ఉద్యోగమో- వ్యాపరమో..ఏది అయినా ఆ రోజు పని అనుకున్నట్టుగా మనసు పెట్టి పూర్తి చేయడం లాంటివి అయితే – ప్రతీ రోజూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది.

వీకెండ్స్ మిగిలిన రోజుల కంటే కాస్త భిన్నంగా ఉండొచ్చు, మనం చేసే పనుల క్రమం మారుతుంది కాబట్టి. కానీ వీకెండ్ ని ఉత్సాహం నింపుకున్న నిధులుగా చూడక్కర్లేదు. వీకెండ్లు, లాంగ్ వీకెండ్ లు వస్తాయి,పోతాయి. వాటిని కేవలం ఎక్కువ సమయం పట్టే పనులు పూర్తి చేసుకునే ఒక ఉపకరణాలుగా మాత్రమే చూడాలి.

ప్రతీ రోజుని ఆస్వాదించడం అంటే – వేడి వేడి అట్లు పెనం నుండి నేరుగా ప్లేట్ లో వేసుకుని తినడం లాంటిది. వీకెండ్ కోసం వెంపర్లాడుతున్నాం అంటే – చల్లారిపోయిన పిజ్జా ని ఓవెన్ లో పెట్టుకుని మరల మరల వేడి చేసుకుని తినడం లాంటిది.

అందుకే ఈ సారీ ఎవరైనా ‘హ్యాపీ వీకెండ్ ‘ అంటే..ఓ చిరు నవ్వు చిందించి దాన్ని ‘హ్యాపీ వీక్’ అని వినిపించుకుంటే సరి! అపుడు శుక్రవారం సాయంత్రం మాత్రమే సుకుమారిగా కాక- సోమవారం ఉదయం కూడా సొగసుగా అనిపిస్తుంది.