బంధాల వారధి

షాపింగ్ చేసిన బ్రాండెడ్ బట్టలు డాబు కవరులో తెచ్చుకుని ఆ కవర్ల పైన బ్రాండ్ లను చూసి మురిసిపోయారు పిల్లలు. రెండో రోజుకే చెత్త బుట్టను చేరిపోయిన ఆ అట్ట కవర్లలో ని దళసరితనం విలువ తెలిసిన అత్తయ్య – వాటిని వంటింటి అరలలో నూనె మరకలు పడకుండా ఉండటానికి వాడుకున్నారు. అసలు పిల్లలు కొన్న బట్టలు ఎన్నాళ్ళు వాడతారో తెలీదు కానీ, వాళ్లు పారేసిన అట్ట కవర్లు మాత్రం మాకు కొన్ని నెలలు సేవ చేసి పెట్టాయి. కవర్ల పైన పేర్లలో విలువ చూసే పిల్లలకి – మనకి నిజంగా పనికి వచ్చేది అట్ట ముక్క తప్ప దాని పైన అక్షరాలు కాదు అని వాళ్లకు ఆశ్చర్య పరిచే పాఠం ఆమెకి తెలియకుండానే నేర్పించారు అత్తయ్య.

అభిరుచి కోసమో, కాలక్షేపం కోసమో షాపింగ్ చేసే పిల్లల తరం
కొనాల్సిన అవసరాన్ని అనేకసార్లు మదించి, కొన్న ప్రతి వస్తువు కి దీర్ఘ కాలం ఆయువునిచ్చి, దాని వాడకాన్ని సాధ్యమైనంతా పొడిగించే అత్తయ్య తరం
వాళ్ళిద్దరి మధ్య వారధిని నేను – పాత తరం ఆలోచనలు విలువలుగా పిల్లలకి చేరాలని ఆశపడే అమ్మని నేను

కాలేజీ లో ఒక గంట ఈవెంట్ కోసం మూడు గంటలు తిరిగి మరీ కొనుకున్న చొక్కా – పని కాస్తా అవగానే, మరునాటికి ఉండ చుట్టుకుని పెద్దోడి బట్టల బీరువాలో బేలగా చూస్తోంది.
అత్తయ్య బీరువాలో ఏభై ఏళ్ల నాటి చీర కూడా ఒక్క పోగు ఊడిపోకుండా – అంతే కళతో దర్పంగా తలెత్తుకుని చూస్తోంది.
కొత్త క్లాస్ లు మొదలయ్యాయని తెచ్చుకున్న చిన్నోడి పుస్తకాలూ పెన్నులూ నాలుగు రోజులు కాకుండానే చెల్లా చెదురుగా కనిపిస్తే
అత్తయ్య గదిలోని అన్ని వస్తువులు – మావయ్యకి ఆవిడ అన్నం వడ్డిస్తున్నపుడు పెట్టినంత శ్రధ్ధగా సద్దినట్టు అనిపిస్తాయి,

ఇద్దరి గదుల మధ్య అయిదు అడుగుల దూరం కూడా ఉండదు కానీ అరవై ఏళ్ల అనుభవం అంత లోతు ఉంటుంది. వాళ్ళ
మధ్య బంధాల వారధిని కట్టి అనుభవం యొక్క గాఢతను తెలియచేయడమే నా బాధ్యత అనిపిస్తుంది.

వేసవి అంటేనే ఆపసోపాలు పడిపోయి ఏ.సి రూమ్ లలో దాక్కునే పిల్లలు – చల్ల మిరప కాయలో, వడియాలో పెడుతూ డాబా మీద ఎండబెట్టి రమ్మని నానమ్మ పంపినప్పుడు – ఎండ ఒక అవకాశం అని కూడా వాళ్లకు అర్ధం అవుతుంది.
వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ రిలీజ్ డేట్, కొత్త గాడ్జెట్ లాంచ్ డేట్, ఐపీయల్ సీజన్ డేట్స్ లాంటివి తప్ప మిగిలిన ఏ కాలానికి తేడా తెలియని వాళ్ళకి..
రథ సప్తమి రోజు పొంగించే పాలు, శ్రావణ మాసపు వ్రతాలు, అమ్మ వారి నోములు, కార్తీకం లో క్రమం తప్పకుండా పెట్టే దీపాలు, సంక్రాతి కి చేసే పిండి వంటలు – ఏదీ క్రమం తప్పకుండా అత్తయ్య చేస్తూ, మాతో చేయిస్తూ బలవంతం గా అయినా సరే కాల క్రమాన్ని వాళ్ళకి వివరిస్తుంది.

అమ్మా-నాన్న కోప్పడితే తాత-నానమ్మల గది వాళ్లకి కంచు కోటలా అనిపిస్తుంది
దెబ్బ తగిలిందని అమ్మ దగ్గరికి వెళితే, చూసుకోలేవా అని తిడుతుంది – అదే నానమ్మ అయితే నూనె రాసి బుజ్జగిస్తుంది
ఎగ్జామ్ కి సరిగ్గా చదివావా లేదా అని నాన్న గదమాయిస్తే – రాత్రి అంత సేపు మేలుకుంటే ఆరోగ్యం పాడవుతుంది నాన్నా అని నానమ్మ నొచ్చుకుంటుంది

మిగిలిపోయిన పిండితో వేసుకున్న అట్టో, నమలలేక నానబెట్టుకుని తినే అటుకులో, వేడిని తట్టుకోడానికి చేసుకునే నిమ్మ మజ్జిగో – మొత్తానికి నానమ్మ తినే ప్లేట్ లో ఏమున్నా – అదే అరుదైన రుచిగా వాళ్ళకి అనిపిస్తుంది.

తలుపులు తీసి పోతారేంట్రా అని తిట్టినా, మంచాలు తొక్కేస్తారని మందలించినా, వస్తువులు వృధా చేస్తారని విసుక్కున్నా..
నానమ్మ గాజుల చప్పుడు వాళ్లకి ఓ భరోసా
గంజి పెట్టి ఆరేసి మరీ కట్టుకున్న చీర కొంగుకి చేతులు తుడిచేసుకునేంత చనువు
ఆమె నుదుటికి నిండుతనం తెచ్చే బొట్టు పెట్టె – వాళ్ళకి చిరు తిళ్ళు కొనిపెట్ట గల నిధుల పెట్టె

పిల్లల అలవాట్లు చూసి ఆందోళన కలిగినా – వీళ్ళేమి నేర్చుకోరా ముందు తరం నుండి అని ఆలోచిస్తున్నా..పిల్లలు వాళ్ళ నానమ్మ గురించి నాకు చెప్పే మాటలు ఒక భరోసా కలిగిస్తాయి…

హాల్లో ఎక్కడో దివాన్ మీద పడుకున్న నానమ్మకి కిచెన్ లో కంచం చప్పుడు బట్టీ నేను పెరుగన్నం స్కిప్ చేసేశానని ఎలా తెలుస్తుంది అసలు?
బయటకి వెళ్ళినపుడు నేను పట్టుకోకపోతే నాలుగు అడుగులు కూడా కష్టం గా వేసే నానమ్మ – పండుగలకు నాలుగు గంటలు నిలబడి మరీ ఇన్ని రకాలు చేసే ఓపిక ఎలా వస్తుంది?
స్కూల్ కి హడావిడిగా వెళ్తున్న నేను ఏమి మర్చిపోతానో ముందే ఊహించేసే విజన్ ఎక్కడిది?
ఇంక అయిపోయింది అని నేను పడేసిన వస్తువు జీవిత కాలం ఇంకో వారం అయినా పొడిగించి చూపించ గలిగే మ్యాజిక్ ఎక్కడిది?
ఫ్రిడ్జ్ లో కూరగాయలు, డబ్బాల్లో సరుకులు అయిపోయాయి అని నాకు కనిపిస్తున్నా సరే – అన్నం పెట్టేసాను వచ్చేయి అన్న పిలుపు ఎలా వస్తుంది?
జీడీ పప్పు కోసం అరగంట వెతికినా కనపడని నాకు – వంటింట్లో మూడో అరలో, ఐదో డబ్బాలో పెట్టాను అని అంత ఖచ్చితం గా తనకి ఎలా గుర్తు ఉంటుంది?
చుట్టాలు చేతిలో పెట్టిన డబ్బులన్నీ -ఎవరు ఎపుడు ఎంత ఇచ్చారో నానమ్మ దాచి పెట్టి మరీ ఎలా లెక్కలు చెబుతుంది?

అసలు ఎలా అమ్మా?
అని అపుడపుడు పిల్లలు పడే ఆశ్చర్యం చూస్తే – ఈ ఆశ్చర్యమే వాళ్ళకి క్రమంగా ఆలోచనగా మారి, జాగర్త పడాలనే పాఠం నేర్పిస్తుంది అని నమ్మకం కలుగుతుంది.
తాత-నానమ్మల మధ్య చేరి కబుర్లు చెబుతూ, వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్న పిల్లలను చూస్తే ముచ్చట అనిపిస్తుంది. వీళ్ళకి మేము ఇవ్వగలిగిన బహుమతి ఇంత కంటే ఏముంది అనిపిస్తుంది.

వ్యాఖ్యానించండి