వేసవి మధ్యహ్నం…ఓ వేప చెట్టు కింద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను – నెత్తి మీద ఓ వేప పండు పడటంతో ఈ లోకంలోకి వచ్చాను. ఇంతకూ నేను ఆలోచిస్తున్న విషయం – అమెరికా ఎపుడు వెళ్ళినా ఎంత త్వరగా ఇంటికి వచ్చేద్దామా అని ఎందుకు అనిపుస్తుందా అని.
అక్కడ అన్ని సుఖాలు, సౌకర్యాలు, చక్కని ప్రకృతి, రొదలు, కాలుష్యం లేని రోడ్లు, పుష్కలంగా నీళ్ళూ…ఇలా ఎన్నో ఉన్నాయి. అయినా ఆ దేశం నాకెందుకు కనెక్ట్ అవదా అని ఆలోచిస్తే- వేప పండు నెత్తిన పడటంతో తట్టిన సమాధానం – ‘నేటివిటీ’
అక్కడ నాకు నేటివిటీ అనిపించదు.
నేటివిటీ అంటే – స్వస్థలమా? కాదు – నా ఉనికి..
నేను- నా ఆలోచనలు..నాకు ముచ్చట గొలిపేవి, విసిగించేవి, విస్మయ పరిచేవి..ఇలా మొత్తానికి నా మనసుకి కనెక్ట్ అయ్యేవి..ఇవన్నీ ఎక్కడ పుష్కలంగా దొరికినట్టు అనిపిస్తుందో అదే మన నేటివిటీ.
అక్కడ ఎన్నో చెట్లు, పచ్చని ప్రకృతి ఉంది. కాని ఒక్క దాని పేరు తెలీదు, పరిచయం లేదు.
ఇక్కడ ఉన్న ఒకో చెట్టుకి ఒకో రకమైన కథో, అనుభవమో ఉంటుంది. ఉదాహరణకి – వేప చెట్టు అంటే ఉగాది పచ్చడో, పోచమ్మ గుడిలో కట్టే వేప మండలో గుర్తొస్తాయి. మర్రి చెట్టు అనగా ఓ రచ్చ బండో, ఊడల మర్రికి వేలాడే దెయ్యాల కథలో గుర్తొచ్చి దడ పుట్టిస్తాయి. తులసి చెట్టు కి చేసే నమస్కారాలో, చింత చెట్టు కి ఉండే పులుపో, నేరేడు చెట్టుకి తగిలిన రాళ్ళో…ఇలా ఏ చెట్టు చూసినా ఏదో ఒక విషయం కనెక్ట్ అవుతుంది.
తిండి విషయానికి వస్తే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. నోరు తిరగని పేర్లు, నోటికి తగలని రుచులు, నాలుగు వేళ్ళు నోట్లో పెట్టుకోనివ్వని పదార్ధాలు, పరిస్థితులు..
అక్కడ ఉన్నన్ని రోజులూ పెరుగన్నం మీద ప్రేమ పదింతలయిపోతుంది.
ఆవ కూరలు, పప్పులు, పులుసులు,పచ్చళ్ళు, పొడులు…ఎన్నెన్ని రకాల రుచులు?ఇవేమి లేని ఆ ప్రాంతంలో- పదే పదే గుప్పుమనే చీజ్ వాసన మరింత వెగటు పుట్టిస్తుంది.
అక్కడ మనుషులందరూ తెలియకపోయినా నవ్వుతారు. బిగ్గరగా హాయ్ చెబుతారు, హగ్ లు కూడా ఇస్తారు. కాని కనెక్ట్ కావడం కస్టంగా ఉంటుంది. పిల్లలు ఉన్నారా అంటే – 2 కుక్కలున్నాయి / ఒక పిల్లి ఉంది లాంటి సమాధానాలు వస్తే- సంభాషణలు ఎలా కొనసాగించాలో అర్ధం కాక తటపటాయిస్తాను.
ఇక్కడ ఎవరూ నాతో నేరుగా మాట్లడకపోయినా సరే, కూరగాయల షాపులో బేరాలాడే పెద్దాయన, గోడ పై నుండి గుస గుసలాడే అమ్మలక్కలు, వేసవి ఎండలకు చిర్రుబుర్రులాడుతున్న ఓ అసామి, టీ కొట్టు దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకునే అబ్బాయిలు…ఇలా ఎవరు ఏమి మాట్లాడినా, అరుచుకున్నా..ఎందుకో అర్ధవంతంగానే ఉంటుంది, చెవులకు ఇంపుగానే అనిపిస్తుంది.
అమెరికా ఒక టెంప్లెట్ లా అనిపిస్తుంది. ఓ కాఫీ కప్పు, కోక్ టిన్..పిజా- ఓవెన్, దాదాపు ఒకే రంగు రూపులతో ఉండే ఇళ్ళు, వైన్ బోటిల్సు, వెదర్ రిపోర్ట్ లు, మాల్సు, రూల్స్..వీటిలో దేనికీ నాతో బంధం- బాంధవ్యం ఉన్నట్లు అనిపించదు. నేను అంటే – నా బాల్యం, బంధువులు, నా ఆహారం, వ్యవహారం, పరిసరాలు, ఆవాసాలు, సామాజిక పరిస్థితులు…వీటన్నిటి చుట్టూ తిరిగే నా ఆలోచనలు. ఇవన్నీ ఉంటేనే నాకు చైతన్యం ఉన్నట్లు అనిపిస్తుంది. వీటికి దూరంగా వెళ్ళినపుడే తెలిసొచ్చింది – అసలు నేనేంటో, నా నేటివిటీ ఏంటో!
పేరు చెబితే – ఇంటి పేరో, అసలు పేరో తెలియని అయోమయం నుండి – పేరు చెప్పగానే పుట్టు పూర్వోత్తరాలు చెప్పేసే చోటుకి వెళ్ళిపోవాలనిపించదూ?
బొట్టుని విచిత్రంగా చూసే వ్యక్తుల నుండి – భయం పోవాలంటే విభూతో, సింధూరమో పెట్టుకోమని సలహా ఇచ్చే చోటుకి చేరాలనిపించదూ?
10 డాలర్లు తీసుకునీ, ఇంత పొడుగున్న మగ్ లో వేడి లేని కాఫీ ఇచ్చినపుడు – 10 రూపాయిలకే పొగలుగక్కే టీ కప్పు దొరికే ప్రదేశానికి రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించదూ?
ఇలా అనిపించే చోటు, అనుభవమే మన ‘నేటివిటీ’ !