వామన మూర్తి త్రివిక్రముడై ఎదిగి, తన రెండు కాళ్ళతో భూమ్యాకాశాలను నింపేసి – మూడో కాలితో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసాడట!
అలా..ఇంటర్నెట్, టీవీలు – మన బంధాల పై ఒక కాలు, అభిరుచుల పై రెండో కాలు వేసేసి, మూడో కాలు ఎక్కడ పెట్టనూ? అంటే – మనిషి తన ‘నిద్ర ‘ పై పెట్టు అన్నట్టున్నాడు. రాను రాను మన నిద్ర పొట్టిగా కుదించబడి, ఏ అర్ధ రాత్రికో జారిపోతోంది.
లేట్ నైట్ పార్టీలకు, వీకెండ్ సినిమాలకు, ఆన్ లైన్ చాటింగ్ లకు, ఫేస్ బుక్ అప్డేట్ లకు, వాట్సప్ వినోదానికి…అన్నిటికీ నిద్రేనా అంత లోకువ?
“అమ్మా, నాకు కలలో కొత్త పోకేమాన్ కనబడింది”.. అని మా చిన్నాడు అంటే – టీవీ చూడటం ఆపేసి, హాయిగా పడుకుని, నిద్రలో నీకు కావాల్సిన పోకేమాన్ లు చూసుకోరా కన్నా! అని చెప్పాను. అప్పటి నుండి పడుకోటానికి కాస్త మారాం తగ్గినట్టే ఉంది.
నిద్ర..
అది ముగించడం ఎంత భారంగా, కస్టంగా ఉంటుంది.. మరి మొదలు పెట్టడానికెందుకూ అంత మొరాయిస్తాం?
అంత గాఢంగా ఆలింగనం చేసుకునే నెచ్చెలిని అహ్వానిచడానికెందుకూ అంత ఆలోచన చేస్తాం?
కలల రూపంలో కొత్త లోకాలకి తీసుకెళుతుంది, భాదల భారాన్ని దూదిపింజలా తేల్చేస్తుంది, మనసు గాయాలకు ఎన్ని లేపనాలు పూయిస్తుంది..అయినా ఎందుకో ఆ చమత్కారి పై ఆ చిన్న చూపు?
బస్ కిటికీ దగ్గర చల్ల గాలికి తీసిన కునుకైనా, ఇంటి పని ముగిసాకా నడుం వాల్చినపుడు పట్టేసిన మాగన్నైనా, అలసి పోయినపుడు అక్కున చేర్చుకునే గాఢ నిద్రైనా…అది ఏ రూపంలో వచ్చి వెళ్ళినా ఎంత విశ్రాంతినిస్తుంది!
సోలిపోయే కను రెప్పల్లో అసలు నిద్ర ఎప్పుడు సరిగ్గా వచ్చి వాలుతుందో..ఆ క్షణాలని ఒడిసిపట్టేయాలని ప్రయత్నిస్తూ నిద్రలోకి జారిపోవడం ఎంత గమ్మత్తుగా ఉంటుంది.
6-8 గంటల పాటు మన ప్రమేయం లేకుండా దేహాన్ని వదిలేసినా, నిర్భయంగా కాపాడే ప్రపంచంలో ఉన్నామని చూపించే భరోసా.. నిద్ర
మరణానికి ఒక ట్రైలర్ లాంటిది నిద్ర
అంతు చిక్కని ఆధ్యాత్మికతకు నాందీ ద్వారం నిద్ర
‘నేనేవరు ‘ అనే ప్రశ్నను పదునెక్కించే ప్రోసెస్ నిద్ర
చుక్కల లోకాలను చుట్టేసి తీసుకొచ్చే టైం మెషీన్ నిద్ర
మైమరిచిపోవడాన్ని మేగ్నిఫై చేసి చూపించే మాయాజాలం నిద్ర
‘నిద్ర పోతే’ హాయిగా ఉంటుంది
అదే నిద్రే ‘పోతే’ భారంగా ఉంటుంది
నిద్ర పుచ్చాలంటే..పసి పాపలకు జోల పాటలు పాడాలి, చిన్నారులకు కదలెన్నో చెప్పాలి
మరి పెద్దయ్యాకా – నిద్ర పుచ్చే వాళ్ళుండరు కాబట్టి, మనమే నిద్రను పిలవాలి
కాదు – కాదు – నిద్రకి తెలుసు మన దగ్గరకి ఎప్పుడు వచ్చి చేరాలో!
మొబైల్ ని మూడామడల దూరంలో పెట్టేసినపుడు, కనుల కవాటాలను మూసేసినపుడు, ఆలోచనా ప్రవాహన్ని ఆపేసినపుడూ…
బెత్తం పుచ్చుకుని మరీ వచ్చే భానుడి బండిలో బద్ధకం లేకుండా కూర్చోవాలంటే –
ఏడెనిమిది గంటలు నిదురమ్మ ఒడిలో వాలిపోవాల్సిందే – అలసత్వాన్ని ఆమె చేతికిచ్చి పంపేయాల్సిందే!
స్పందించండి