ఇపుడే బాగుంది..

బాల్యం బాగుంటుంది. కాని బాల్యం మాత్రమే బాగోదు. చాలా మంది చిన్నపుడు ఎంత బాగుండేదో, ఆ రోజులు రావు…హాయిగా చీకూ చింతా లేకుండా గడిపేసే వాళ్ళం అంటూ ఉంటారు. నిజమే ఆ రోజులు రావు. ..కానీ ఆ రోజులు మాత్రమే బాగున్నాయి అంటే మాత్రం ఒప్పుకోబుద్ధి కాదు.

నాకైతే పెద్దయ్యాకా ఇప్పుడు-ఈ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. మా పిల్లలని చూస్తే ఇది చాలా సార్లే అనిపించినా..ఎందుకూ అనేది ఇప్పుడే తోస్తోంది. బాల్యం,చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు…ఇలా బిజీగా సాగిపోయి..ఈ గమనంలో నేనేంటి అని తరచి చూసే వీలే దొరకదు. 10 రోజులుగా పిల్లలు వేసవి సెలవలకు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడంతో..మొదట్లో ఒంటరితనంగా తోచింది- కాని అది ఏకంతంగా మారిన తర్వాత ఆలోచిస్తే వర్తమానాన్ని పిల్లల కోణంలో కాకుండా నా కోణంలో చూసే అవకాశం దొరికింది.

చిన్నపుడు అంతా అమాయకత్వం, ఉత్సాహం, భయం, బేలతనం, అమ్మా నాన్నల మీద ఆధారం. రోజులు ఎందుకు గడుస్తున్నాయో, ఎలా గడుస్తున్నాయో దేని గురించీ చింత లేదు. అంటే నా ప్రమేయం లేకుండా బస్ లో ప్రయాణం చేస్తూ ప్రకృతిని చూస్తూ గడిపేస్తినట్టు ఉండేది బాల్యం. కాని వర్తమానం బస్ లో డ్రైవర్ సీట్ లాంటిది. ఏ క్షణం నా ప్రమేయం లేకుండా గడవదు. నేను ఎందుకు చేస్తున్నానో, ఏమి చేస్తున్నానో ఎరుకలో ఉన్నాను. నా జీవితం అనే బస్ లో పట్టేంత మందికి సౌఖ్యాన్ని ఇస్తూ నడిపిస్తున్నాను.
మా పిల్లాడు కావల్సిన బొమ్మో, వస్తువో కొనేదాక ఏడ్చో, బతిమాలో అడిగేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చక్కగా పెద్ద అయ్యాను కాబట్టి ఈ పాట్లు నాకు లేవు. కావల్సింది కొనుక్కునే స్వేచ్చ, డబ్బులు ఉన్నాయి. ఒక వేళ, కోరిక కొనలేని వస్తువు కోసం అయితే..ఆ కోరికను ఏమార్చుకునే జ్ఞానం ఉంది. ఇంకా ప్రయత్నిస్తే ఆ కోరికే లేకుండా చేసుకోగలిగే దృక్పధం ఉంది ఇప్పుడు.చిన్నపుడు ఇస్టమైన సినిమాకి టికెట్లు దొరకలేదని 2 రోజులు బాధ పడ్డాను, అలిగాను మా అమ్మ మీదా-అన్నం మీదా. కానీ ఈ రోజు బుక్ చేసిన టికెట్లు కూడా కాన్సిల్ చేసేసాను..మా అత్తగారితో కబుర్లు చెబుతూ రసాలూరే మామిడి పండును ఆస్వాదించడం కోసం. ఎదిగే కొద్దీ జ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది..అవి రాకపోతేనే ఎదగడం బాగోదు.

బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. తల్లిదండ్రుల రక్షణలో దాగిన ఒక ముగ్ధ మనోహరమైన పుష్పం. కానీ వర్తమానం- నేనేంటో తెలుసుకుని, నాకేం కావాలో అణ్వేషిస్తూ స్వేచ్చగా సాగే పయనం. చిన్నపుడు మనం చేసేవన్ని బాగున్నట్టు కాదు. మనం బాగా చెయ్యట్లేదని అప్పుడు మనకి తెలీదు అంతే. అందుకే అపుడు చింత, చింతన లేదు. ఇపుడు మనం చేసేది, చెయ్యాల్సింది తెలుసు. అందుకే ఆలోచన, ఆందోళన. అంతమాత్రాన ఇప్పుడు బాగోనట్టు కాదు కదా..
బాల్యం అంటే ‘ముగ్ధత్వం’. బానే ఉంది. కానీ ఆ ముసుగు తీసి చూస్తే-పరాధీనం, ఏమీ తెలియనితనం,అజ్ఞానం, అబలత్వం.
వర్తమానం ఒక ‘భాద్యత ‘ కానీ లోతులకి వెళితే -ఆలోచన, పని, కర్తవ్యం, ఎరుక, అన్వేషణ.
అందుకే ఎవరైనా చిన్నపుడు ఎంత బావుండేదో అంటే..నాకు ఇప్పుడు ఇంకా బాగుంది, అసలు ఇప్పుడే బాగుంది అనాలనిపిస్తుంది.

2 వ్యాఖ్యలు to “ఇపుడే బాగుంది..”

  1. Deepthi Says:

    Superb article!!

  2. kiran Says:

    wow nice article
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

వ్యాఖ్యానించండి