అప్పుడేవీ ఈ ఏక్టివిటీలు?

ఆగస్ట్ 5, 2015

ఏమి చోద్యమో గాని పిల్లల స్కూల్ డైరీ లొ ఉండే క్యాలండర్ మన రోజు వారీ కార్యక్రమాలకు మార్గదర్శకాలు అవుతున్నాయి. ఏలాగూ చదువుల కొసం భారీ ఫీజులు చెల్లిస్తాం కాబట్టి స్కూల్లకి మనం కస్టమర్ లాంటి వాళ్ళం. కస్టమర్ డిలైట్ ప్రొగ్రాం లాగా, ఒకో వారం ఒకో ఏక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. మా అబ్బాయి డైరీ ప్రకారం వచ్చే వారం వేస్ట్ మేనేజ్మెంట్ వారం. ఫాత వస్తువులతో బొమ్మలు చేయడం, క్విజ్ ప్రోగ్రామో, లేక ఉపన్యాసాలో….ఇలా ఉంటాయి. పిల్లాడి చేత ఇవన్నీ చేయించి ఎవో ఒక ప్రైజ్ లు సాదించే వరకు వాడికి ప్రశాంతత – మనకు నిద్ర ఉండవు. వారాంతంలో ఒక్క సారి దొరికే ‘బద్దకంగా పడుకోవడం’ అనే బంగారు అవకాశాన్ని దూరం చేస్తున్న ఈ ఏక్టివిటీస్ గురించి ఆలొచించడం మొదలు పెట్టాను.  ఇవన్నీ అసలు నా చిన్నప్పుడు ఎందుకు లేవా అని.

ఈ వేస్ట్ మేనేజ్మెంట్ నే తీసుకుంటే…స్కూల్ లో వీల్లు చేసే హడావిడి వల్ల  మా వాడికి బొమ్మలు చేయడమో, బాగా మాట్లడటమో, టీం వర్కొ ఇలాంటివి వస్తాయి. ఈ జ్ఞానం తో పెద్దయ్యకా మహా అయితే వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ కి ఒక మేనేజరు అవుతాడెమో కాని…దైనందిన జీవితంలో వ్యర్ధాలని ఎలా తగ్గించాలో నేర్పే జ్ఞానం ఎలా వస్తుంది?

అసలు చిన్నప్పటి జీవన శైలి వలన మాకు సహజంగానే…వ్యర్ధాలను అరికట్టడం..ఒక వస్తువును పలు రకాలుగా-పలు సార్లు వాడటం లాంటివి అబ్బాయి.

చిన్నపుడు అమ్మ – ఉల్లిపాయ తొక్కలను, బియ్యం కడిగిన నీళ్ళను గులాబి మొక్కలకి వేస్తే బాగా ఎదుగుతాయి అని చెప్పేది. తొక్కలను శ్రద్దగా వేసి మొక్కలను పెంచగా – విరబూసిన గులాబి పువ్వుల రూపంలో వ్యర్ధాల విలువ అర్ధం అయేది.  పాత దుప్పట్లు కాల్లు తుడుచుకునే పట్టాలుగా – తాత గారి పాత తెల్లటి పంచెలు తుడుచుకునే తువ్వాలుగా మారిపోయేవి.

కొబ్బరి చెక్కలు, అరటి దొన్నెల్లో కార్తిక దీపాలు వదులుతూ, ఏడాదంతా పోగు చేసిన కొబ్బరి చెక్కలు, చెక్క ముక్కలతో శీతాకాలం లో వేన్నీళ్ళు కాచుకుంటూ, రాలి పోయిన కొబ్బరి ఆకుల నుండి ఈనెలు తీసి చీపుల్లు చేసుకుంటూ…ఇలా ప్రతి వస్తువును బహు విధాలా ఎలా వాడుకోవచ్చో అనుభవ పాఠాలు నేర్చుకున్నాం.

రాత్రి అన్నం మరనాటికి చద్దన్నం గానో, కాదంటే పోపన్నం గానో, ఇంకా కాదంటే అన్నం వడియాలగానో మారిపోయేది. మద్యహ్నం మిగిలిన చారు రాత్రికి రసంగా కంచంలో ప్రత్యక్షం అయేది. బీర కాయ, ఆనప కాయ తొక్కలతో చేసిన పచ్చడులు వ్యర్ధాలకు ఉపయోగమే కాదు – రుచీ ఉంటుంది అని నిరూపించేది.

తాటి కాయల నుండి అమృతంలా ఉండే ముంజులు రావడం మాత్రమే కాకుండా..మిగిలిన తాటి కాయలను బండి చక్రాలుగా చేసి తోపుడు బల్లు చేసుకుని పోటీలు పెట్టుకోవడం, ఏరి పారేసిన చింత పిక్కలనే ఆట వస్తువులుగా దాదాపు వేసవి కాలం అంతా కాలక్షేపం చేసేసే వాళ్ళం.

ఇప్పటి పిల్లలు అసహ్యించుకునే ఆవు పేడ కూడా మా బాల్యంలో – సంక్రాంతికి గొబ్బెమ్మలుగా, రధ సప్తమికి పాలు పొంగించేందుకు వాడే పిడకలుగా, ముత్యాల ముగ్గులకు బ్యాక్ గ్రౌండ్ గా వేసే కల్లాపు నీళ్ళుగా అందంగా అమరిపోయేది.

క్లాసు లీడరు బాధ్యతల్లో భాగంగా- మాస్టారి కోసం పొదల్లో వెతికి పొడుగ్గా, లావుగా ఉండే తూటు కర్ర ఏరుకుని రావడం, ఇంట్లోని పాత గుడ్డలతో బోర్డ్ చెరిపే డస్టర్లు కుట్టడం, జండా పండగకి మైదా పిండి ఉడకబెట్టి జిగురు చేయడం ద్వారా..ఒకే వస్తువు అది వాడే విధానాన్ని బట్టీ విలువ మారిపోతుంది అని విలువైన పాఠం తెలిసేది.

ఆఖరికి ఇంకెందుకూ పనికి రావు అని పక్కన పడేసిన పాత పౌడర్ డబ్బాలు, చిత్తు కాగితాలు, రేకు డబ్బాలు..మాకు సెలవు రోజుల్లో చిరు తిండి తెచ్చి పెట్టే నిధులుగా కనపడేవి. అవి పాత సామాన్లు కొనే అమ్మాయి తట్టలో చేరి – మిఠాయి రూపంలో మా చేతుల్లో తాయిలంగా మారేది.

అన్నయ్య వాడి ఇచ్చిన టెక్స్ట్  పుస్తకాలు, పాత నోటు పుస్తకాల లో మిగిలిన తెల్ల కాగితాలను సేకరించి కుట్టిన నోటు పుస్తకాలు – పాత పేపర్లు అమ్మే షాప్ నుండి తెచ్చిన సోవియట్ కాగితాలను అట్టలుగా వేసి, అమ్మ కుట్టి ఇచ్చిన చేతి సంచిలో పుస్తకాలు పెట్టుకుని, అక్కకి పొట్టి అయిపోయిన పరికిణీ వేసుకుని స్కూల్ కి వెల్లిన నా లాంటి పిల్లలకి ఆనాటి స్కూల్స్ లో ‘ఏక్టివిటీ’ అని పేరు పెట్టి వ్యర్ధాలను వాడుకోవడం ఎలాగో నేర్పించే పని ఏముంది?

వ్యర్ధాలు మా బాల్యంలో భాగాలు. మేము వాడే వస్తువులుగా, ఆట బొమ్మలుగా, పొదుపుకు పట్టుకొమ్మల్లా, అవసరానికి ఆదుకునే ఆప్తులులా మా దైనందిన జీవనంలో కలగలిసి ఉండేవి.

ఇప్పుడు మనకి దేనికీ కొరత లేదు – పిల్లలకు ఏమి అవసరం ఉన్నా కొనే స్థోమత ఉంది. ఇంక ఇలా వాడిన వస్తువులు వాడాల్సిన కర్మ వాల్లకి ఎందుకు? సౌకర్యవంతమైన వాడకం మాత్రమే తెలిసిన ఇప్పటి పిల్లలకి పనిగట్టుకుని ఒక కాన్సెప్ట్ లా నేర్పించాల్సి వస్తోంది..ఇప్పుడు వ్యర్ధాల విలువ చెప్పాలంటే స్కూల్ లో ఇలాంటి వారోత్సవాలు చెయ్యాలి. పోటీలు పెట్టాలి. కొత్త కొబ్బరి కాయ కొని కొబ్బరి వేరు చేసిన చిప్పలు, స్ట్రాలు, ఫెవికాల్ లాంటి వస్తువులు బజార్లో కొని – వాటితో క్రియేటివ్ గా వస్తువులు ఎలా చెయాలో గూగుల్ లో వెతికి పిల్లలకి నేర్పించి వాళ్ళ  చేత స్కూల్ లో చేయించిడం ద్వారా…స్కూల్ లు వారి సిలబస్ ని – మనం మన భాద్యతని పూర్తి చేసుకుందాం.

ఆశావాదం – నిరాశావాదం

నవంబర్ 26, 2014

ప్రొద్దున్నే 6 గంటలకి అలారం మోగడంతోనే నాలో నిరాశావాది -‘శీతాకాలపు చలిలో హాయిగా వెచ్చటి దుప్పటి కప్పుకుని పడుకోకుండా ఈ మోర్నింగ్ వాకింగ్ అవసరమా అంటూ మేలుకుంటుంది. అప్పుడు నాలోని ఆశావాది – అప్పుడే ఉదయించే సూర్యుని చూపించి నారింజ రంగులో ఉండే ఆకాశాన్ని చూసే అవకాశం నీకు కలుగుతుంది – లే అని ప్రేరేపిస్తుంది.

ఇంట్లో అందరికంటే రోజూ నేనే మొదట లేవాలా.. అనుకొంటూనే బయటకి వచ్చిన నాకు – పాల ప్యాకెట్ , పేపర్ కనపడగానే – నా కంటే ముందు ఈ ప్రపంచంలో ఎంత మంది లేస్తారో అర్ధం అవుతుంది.
అయినా నిరాశావాది ఆగుతుందా? అలా ముందు లేచేవాళ్ళంతా నా లాగా రాత్రి 11.30 కి పడుకుంటారా అంటుంది. వెంటనే ఆశావాది నైట్ వాచ్ మేన్ ని చూపించి – ఇతనిలాగా కాకుండా నువ్వు రాత్రంతా మెత్తటి పరుపు పైన, వెచ్చటి రగ్గులో దోమలు, చలి లేని గదిలో సుఖంగా నిద్రపోయిననుందుకు సంతోషించు అని ప్రోత్సహిస్తుంది..

ఇలా మొదలైన నిరాశ – ఆశా వాదుల సంభాషణ మరలా రాత్రి పడుకునే వరకు కొనసాగుతూనే ఉంటుంది.

నిరాశా వాది: రోజూ రొటీన్ ఇంటి పని, పిల్లలని రెడీ చెయ్యడం, తినిపించడం, ఈ హైరానా..ఎంటో ఈ జీవితం.
ఆశావాది: నేను ఒక్క రోజు కూడా బద్దకించకుండా పిల్లలకి కావలసినవన్నీ చూసుకోవడం వల్లనే ఇంత ప్రశాంతంగా పిల్లలు స్కూల్ కి వెళ్ళగలుగుతున్నారు. నాకు ఇంత నిబద్దత ఉందా? అయినా ఇంటి పని రొటీన్ ఎంటి? అసలు ఈ పనులు చేస్తున్నావు అనే అలోచనే లేకుండా జరిగిపోవాలి గానీ…మనం రోజు బ్రష్ చేసుకోవాల్సి వస్తోంది, స్నానం చెయ్యాల్సి వస్తోంది అని ఎప్పుడైనా ఆరోపిస్తున్నామా? అవి అవసరం కాబట్టి చేసేస్తాం..అంతే కదా!

నిరాశావాది: ఎప్పుడూ పిల్లలు, బాధ్యతలతోనే సరిపోతోంది..నాకంటూ టైం ఏది?
ఆశావాది: రోజు వాకింగ్ చేసుకుంటూనో, వంటిల్లు శుభ్రం చేస్తూనో, ఇల్లు తుడుస్తున్నపుడో ఎంత ఏకాంతం.ఎన్నెన్ని అలోచనలు చేసుకోవచ్చో. నేను చేసే ప్రతి పని నాకు నచ్చుతున్నపుడు అసలు నాకంటు ప్రత్యేకించి టైం ఎంటీ?

నిరాశావాది:ఒక సినిమా చూడటానికీ, ఒక మంచి పుస్తకం చదవటానికి వీలు కుదరట్లేదు.
ఆశావాది: ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివాను – విషయాలు తెలుసుకున్నాను. పోనీ ఇప్పుడు వాటిని అమలు చెయ్యడానికి వాడుకోవచ్చు కదా. పుస్తకాలు చదవడానికి టైం ప్రత్యేకంగా కావాలి కాని- అందులొ విషయాలు జీవితంలో అమలు చేయడానికి టైం అంటూ అక్కర్లేదు-నిబద్దత చాలు. ఇక సినిమాలు అంటావా, చాలానే చూసాను కదా..అయినా సినిమాలు మా పిల్లల చిలిపి తగువులు, ఆశ్చర్యంగా చెప్పే ముచ్చట్లు, అలవోకగా మారిపోయే అలకలు-నవ్వులు-మురిపాల కంటే ఆశక్తిగా, సజీవంగా ఉంటాయా ఏంటి?

మన రోజుని, మన చుట్టూ ఉన్న వ్యక్తులని, సంఘటలని పెద్దగా మార్చలేకపోవచ్చు. కాని ప్రతి విషయాన్ని సానుకూలంగా చూస్తూ ఒక రోజుని ‘మన’ రోజుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆశావాదం మనలో కొత్త ఊపిరులు ఊదుతూ ఉంటుంది. జీవితాన్ని కొత్త కోణం లో చూపిస్తూ ఉంటుంది. నిరాశావాది, వారాన్ని – రెండు వీకెండ్ ల మద్య ఉన్న కాలంగా చూస్తే..ఆశావాది -రెండు వారాల మద్య వచ్చే వీకెండ్ గా చూస్తాడు. ఇలా చూడటం మొదలు పెడితే ‘థాంక్ గాడ్ ఇట్స్ ఫ్రై డే’ అనుకోవాల్సిన అవసరం ఉండదు.

విదేశీయాణం

మే 13, 2014

మిధునం” సినిమా లోని – ‘ఆవకాయ మన అందరిదీ, గోంగూర పచ్చడి మనదేలే..’ అనే పాటని మా మూడేళ్ళ బాబు ఆడుకుంటూ పాడుకోవడం విని మురిపెంగా అనిపించింది.వెనువెంటనే, వచ్చే వారమే నా అమెరికా ప్రయాణం అని గుర్తొచ్చి కొంచెం బెంగగా అనిపించింది. మొదటిసారి నా మాతృ దేశం వదిలి, సుదూర దేశ ప్రయాణం – ఆఫీస్ పని మీద వెళ్ళాల్సి వస్తోంది. వెళ్ళే రోజు దగ్గర పడే కొద్దీ, నా అంతరంగం లో ఆలొచనలు అదే పనిగా తిరుగుతున్నాయి. ఏదో చెప్పలేని భావం (‘బెంగ ‘ కు దగ్గరగా అనిపించే భావం అయినా, ఇది వేరే!). పుట్టింటిని వదిలి అత్తవారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలే  అనుకుంటా…

అమెరికా వెళుతున్నా అని చెబితే ఒక స్నేహితురాలు ‘ఏంటి? నీ గొంతులో ఆ ఉత్సాహం ఏమీ కనపడట్లేదు?’ అని ఆడిగింది. ఎంతో కొంత నా వర్క్ అస్సైన్మెంట్ గురించి కాస్త ఉత్సాహం గా ఉంది కాని, విదేశీయాణం గురించి ఏమీ లేదు. అక్కడ ఆకాశ హర్మ్యాలు, అధ్బుత నిర్మాణాలు, ఎన్నో విలాస వస్తువులు ఉన్నాయట. ఉండొచ్చు గాక! అవేమి నేను 10 రోజులు నా పిల్లలకు, అందునా వేసవి సెలవల్లో ఆ సొగసును దూరం చేసుకుని ‘నాదే’ అయిన సొంత వాతావరణాన్ని మిస్ చేసుకుని వెళ్ళేంతగా ఏముంటుందిలే అనిపిస్తోంది. ‘అధ్బుతం’ , ‘ఆనందం’ – బహుశా ఈ రెండు భావాలు కలగడం కోసమే కదా అమెరికా లాంటి దేశాలకి వెళ్ళడానికి ఉర్రూతలూగుతారు.ఈ రెండు భావాలు చాల రెలెటివ్..న్యూయార్క్ లో బ్రాడ్వే షో చూస్తే అనందం కలుగుతుందేమో, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడగానే అధ్బుతం అనిపిస్తుందేమో తెలీదు. కాని, నాకు సంభందించిన ఎన్నో అధ్బుతాలు, ఆనందాలు కోల్పోతాను ఈ విదేశీయాణం లో అనేదే బహుశా నా బెంగకు కారణం ఏమో!

నిద్ర నుండి లేవగానే అమ్మ కోసం వెతికి, నేను కనబడగానే నా చిన్నారి – ఎత్తుకోమంటూ గోముగా పెట్టే ఆ నవ్వు ముఖం కంటే అధ్బుతం నాకు ఇప్పటి వరకు ఏదీ అనిపించలేదు.10 రోజులు ఈ అధ్బుతాన్ని కోల్పోవాలి. తెల్లారుతూనే మా ఇంటి దగ్గరలో ఉండే గుడి నుండి వినపడే సుప్రభాతం, మండు వేసవిలో సాయంత్రం ఆరుబయట నిలబడినపుడు చల్లగా వీచే గాలి మల్లెపూల పరిమళాన్ని మోసుకొచ్చినపుడు కలిగే ఆహ్లాదం, బాగా పండిన రసం మామిడి పండు తనివి తీరా చీక్కుని తినే అనుభవం, కొత్తావకాయతో అన్నం కలుపుకుని తినడంలో ఉన్న రుచి..వీటిలో ఉండే అనందం..ఇలాంటి అనుభూతులని 10 రోజులు కోల్పోవాల్సి రావడం, అన్నిటికి మించి – ప్రతి రోజూ ఇలాంటి అనుభవాలు కలిగిన ప్రతిసారి నా మనసులో పొంగే ఆనందాతిశయంతో నేను పరమాత్మతో మనసారా…’ఎంత మంచి భూమి పై పుట్టించావు స్వామీ, ఎన్నెన్ని మధురానుభూతులు నాకోసం ప్రతి క్షణం అందిస్తావు తండ్రీ!’ అని తృప్తిగా అనుకోవడం…ఇవన్నీ కోల్పోతానన్న బెంగ!
10 రోజులే కదా నేను కోల్పోయేది…కాదు,కాదు – నా మనసుకు నిజమైన తృప్తిని కలిగించే కొన్ని వందల క్షణాలు! ఇలాంటి క్షణాలు ఆ పరాయి దేశంలో నాకు కొన్నైనా దొరుకుతాయా? ఏమో వేచి చూడాలి…

నేను తెలుసుకుంటున్న జ్ఞానం

ఫిబ్రవరి 28, 2013

నాకు ఫిలాసఫీ కి, స్పిరిట్యులాటీకి పెద్ద తేడా తెలీదు కాని, ఈ మధ్య కాలంలో చదివిన కొన్ని పుస్తకాలు, విన్నవి, తెలుసుకున్నవి – ఈ రెండిటిలో ఏదో ఒక దానికి చెందుతాయి.అసలు దేనికి చెందితే ఏమి కాని, ఫిలాసఫి చదువుతున్నా అంటుంటే మాత్రం కొందరు స్నేహితులు – నీకు ఈ వయసులో ఈ వైరాగ్యం ఎందుకు అంటున్నారు. కాని నేను చదివినవి, తెలుసుకుంటున్నవి నేను జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, కాబట్టి నా చుట్టు పక్కల వాళ్ళకి అసలు నేను ఎమి చదువుతున్నానో చెప్పకుండా, ఏమి తెలుసుకుంటున్నానో చెప్పే ప్రయత్నమే ఈ పోస్ట్..
నేను తెలుసుకున్న విషయాలు నాకు ఎలా ఉపయోగ పడుతున్నాయో కొన్ని ఉదాహరణలు, ఆలోచనలు…

ఎక్కువ ఫిలాసఫీ చదివితే దేని మీదా ఇస్టం ఉండదేమో అని   ఇది వరకు అనుకునే దాన్ని, కాని మనిషికి జ్ఞానం రావడం అంటే, అన్నిటి మీద ప్రేమ వదులుకోవడం కాదు – అన్నిటిని, అందరిని ఒకేలా ప్రేమించగలగడం, ఇంకా చెప్పాలంటే అందరి కంటే ఎక్కువగా ఈ ప్రపంచాన్ని ప్రేమించగలగడం (మన కంటే కూడా). ఈ దృక్పధం  తో చూడటం మొదలెడితే రోజు చూసే ప్రపంచం, మనుషులు ఎంత ఇస్టం గా కనిపిస్తారొ…అన్నిటి కంటే అబ్బుర పరిచేది మనిషి మేధస్సు…మనుషులు అందరూ ఒకటే అని చూడటం మొదలెడితే…మొత్తంగా మనుష్యులుగా ‘మనం’ ఎంత ప్రగతి సాధించామో కదా…ఒక మంచి పుస్తకం చదివినపుడు ఆ రచయిత ఊహా శక్తి కి, ఒక మంచి సినిమా నో , డాన్స్ నో చూసినపుడు మనిషిలోని కళాత్మక నైపుణ్యానికి ఇలా ప్రతి చోటా మరో ‘మనిషీ గా అబ్బుర పడుతూ, గర్వ పడుతూ ఉండటం మొదలేడితె అసలు మనకు పక్క వాడిని చూసి అసూయ చెందాల్సిన అవసరమే రాదు, ప్రత్యేకించి మనం బతుకుతున్న ‘నాలెడ్జ్ వర్కర్శ్ ఏరాలో!   ఆఫీస్ లో ఎవరైనా మంచి ఐడియా ఇస్తే మనసారా అభినందించడం, మా అబ్బాయి కంటే మరో బాబు/ పాప మంచి మార్కులు తెచ్చుకుంటేనో/ ఒక మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తేనో అసూయ చెందకుండా ఉండటం అలవాటయింది. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే – స్కూల్ ఫంక్షన్ లో మా బాబు ఇంకో ఇరవై మంది పిల్లలతో పాటుగా డాన్స్ చేస్తే, ఆ 10 నిమిషాలు వాడిని మాత్రమే కాక- మొత్తం డాన్స్  ని చూసి ఆనందించగలిగలగడం నేర్చుకున్నాను.

చాలా సార్లు మనుషుల మద్య గొడవలు ఎందుకు జరుగుతాయి?లేక మనకి బాధ ఎందుకు కలుగుతుంది? ‘నా’ ఆనందాన్ని ఎవరో చెడగొడుతున్నపుడు.   ఇక్కడ ‘ఆనందం’ కంటే ‘సౌకర్యం’ అని పదం వాడితే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సినిమాకి టికెట్స్ దొరకకపోవడం, అనుకున్న ట్రిప్ కి అనుకున్న రకంగా వెళ్ళకపోవడం, నాకు ఏకాంతం లేకపోవడం,కరెంట్ పోయి దోమలు కుట్టడం, పిల్లాడికి ఆ రోజు హోం వర్క్ చెయ్యాలనిపించకపోవడం, చుట్టాలు ఎక్కువ వచ్చి మనకి విశ్రాంతి లేకపోవడం, ఆఫీస్ లో ప్రమోషన్, హైకు రాక అనుకున్న కారు కొనుక్కో లేక పోవడం, ఒక్క పూట పని మనిషి రాకపొటే ఇల్లు ఊడ్చుకోవాల్సి రావడం…మన రోజు వారి జీవితంలో ఎన్నెన్ని లేవు ఇలా మన ‘ఆనందాన్నీ దోచుకుని ‘బాధ ని తెచ్చిపెట్టేవి!

ఇవేమి నా రోజు వారిలో మార్పు రాలెదు, కాని నా ఆలొచనా విధానంలో మార్పు వచ్చింది. అసలు ఇవన్ని నా ఆనందాన్ని పాడు చేస్తున్నాయా? లేక నా ‘సౌకర్యాన్నా?’ అని ఆలొచించడం మొదలెట్టను. చివరికి తేలిందేంటి అంటే, అసలు ఆనందం ఉన్నది నా ఆలొచనా విధనంలో తప్ప ఏ ఒక్క వస్తువు / వ్యక్తి, సంఘటన లో కానే కాదు. కరెంట్ లేదు – తెప్పించడం నా చేతుల్లో లేదు, కాని ఆ కారణంగా అనందం కోల్పొవాలో వద్దో నా చేతుల్లోనే కదా ఉంది. అసలు ఇంకో నిజం ఏంటి అంటె, ఆనందం అనేది తీసుకోవడం లో లేదు – ఇవ్వడం లో ఉంది. ఒక వారంతం లో 2 గంటలు ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తిని బిల్ కట్టి తీసుకునేది ఆనందమా, లేక ఆ రెండు గంటలు ఒక మంచి పిండి వంట చేసి అది కుటుంబంలో  అందరూ తృప్తిగా తింటూ ఉంటే కలిగేది ఆనందమో నాకు బాగా అర్ధం అవడం మొదలయింది. ఇది వరకు శారీరిక / మానసిక శ్రమ అనేది ‘దుఖం ‘ అని భ్రమ పడేదాన్ని. కాని అది దుంఖం కాదు ‘సౌకర్యం’ లేకపోవడం మాత్రమే. సౌకర్యం గా లేకపోవడం వలన దుఖం కలగాల వద్దా అనేది నా చాయిస్ కదా! ఆనందం అనేది ఇవ్వడం లో ఉంది అని తెలుసుకుంటే మన చుట్టు ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. అసలు అప్పుడు మనం అవతల వాళ్ళకి ఏమి ఇవ్వగలం – వారి ఆనంద కారకంగా మనం ఎలా మారగలం? అనే కోణం లో ఆలోచనలు తిరుగుతాయి. అసలు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలిగా. ఒకరికి మనం చేసే పని ద్వారా, మరొకరికి సాయం ద్వారా, వేరొకరికి ప్రశంస ద్వారా ఇలా మనకి తోచిన రకాలుగా, వీలైనంత మందికి ఆనంద కారకాలుగా మారగలం. మనం ఇచ్చే వాళ్ళ లిస్ట్ లో ఉంటే – మనని ఇస్ట పడే వాళ్ళ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు లోకం అంతా అందంగా – ఆనందంగా కనిపిస్తుంది.

ఇలాంటి జ్ఞానం నేర్చుకునే కొద్దీ మన ఆలొచనా విధానం మెరుగు పడుతుంది. జీవితం మరింత సౌందర్యం గా కనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానం  60 ల వయసులో చదివి ఏం లాభం?  30 ల లో చదివితే జీవితానికి ఊతంగా ఉంటుంది కాని. ఈ జ్ఞానం మన భారతీయ సంస్కృతి లో ఉంది. ఈ మూలాల ఆధారం గా ఈ కాలం లో బోలెడన్ని మేనేజ్మెంట్ ప్రోగ్రాంస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ వస్తున్నాయి. ఎవరో ఫారిన్ ఆదర్ రాస్తే కొత్తగా తెలుసుకుంటునట్టు ఉంటుంది కానీ, మన భారతీయ ఆత్మ తో చూస్తే ఇవన్నీ మన తత్వ, ఆధ్యాత్మిక గ్రంధాల్లో దొరికేవే! మనం మూలాలను వదిలేసి, ఏవో కొమ్మలను, ఆకులను పట్టుకుంటాం.
ఈ ఉదాహరణ ఈ సందర్భానికి సరిపోతుందో లేదో కాని – మా ఎదురింటి ఫ్లాట్ లో  ఉండే వాళ్ళ ఇంటికి , అమెరికా లో ఉండే చుట్టాల అబ్బాయి మా అబ్బాయి వయసు వాడు వచ్చాడు ఆ మధ్య. వాడు మా వాడితో మాట్లాడుతూ ‘నా’ ఇంటికి వస్తావా? ‘నా’ తమ్ముడు ఇలా అన్నిటికి ‘నా’ అని వాడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి ఇబ్బందే – ఆ ఫీస్ లో ఎవరైనా ‘నా’ కార్, ‘నా కొడుకు అని చెప్పినా కలుగుతుంటుంది నాకు. మన సంస్కృతి లో ‘మా’ అని చెప్పడం అలవాటు కదా. మా ఇల్లు, మా అబ్బాయి, మా కారు అనే పదాలు బాగుంటాయి. అలా మాట్లడుతుంటే నేను అంటే నా కుటుంబం అనే భావన వ్యక్తమవుతుంది. కార్పొరేట్ భాష లో చెప్పలంటే  ‘నేనూ అనుకోవడానికి, ‘మనమూ అనుకోవడానికి తేడా – ఒక ‘మేనేజరు ‘ , ‘లీడరు ‘ కి ఉన్నంత!

ఈ రోజు చాలా బాగుంది…

సెప్టెంబర్ 15, 2011

ఎందుకంటే..

కాస్త నలతగా ఉంది అని మా అబ్బాయి ఇవాళ స్కూల్ కి వెళ్ళనమ్మా అని అడగటం – దగ్గరలో పరీక్షలు,ఎప్పుడొస్తాయో తెలియని తెలంగాణ బంద్ లు,వీటన్నిటి మధ్యా సరిగా జరగని క్లాసులు.. ఇవన్నీ పక్కన పెట్టేసి – ఒక్క రోజు స్కూల్ మానేస్తానని అడిగే హక్కు వాడికి ఉందని ఎరిగి, సంతోషం గా అంగీకరించేసాను కాబట్టి!

ఈ నగర ట్రాఫిక్,బోలెడు దూరం, దొరకని టైము.. ఇవన్నీ పక్కన పెట్టి,వీలు చిక్కించుకుని చివరి రోజుల్లొ ఉన్న ఒక బంధువులాయన్ని చూడటానికి వెళ్ళి, ఆయన నన్ను గుర్తు పట్టలేకపోయినా,ఆ కళ్ళల్లో ఒక చెప్పలేని తృప్తిని చూసాను కాబట్టి!

హడావిడిగా ఆఫీస్ కి పరిగెత్తుతున్న నేను, ఒక క్షణం ఆగి ఎంతో ఉత్సాహంగా టా టా చెబుతున్న 3 ఏళ్ళ మా వాచ్ మాన్ కొడుకుకి నేను కూడా అంతే ఉత్సాహం తో చెయ్యి ఊపి చెప్పగలిగాను కాబట్టి!

గొడుగు మర్చిపోయి బయటకి వెళ్ళిన నేను, చాలా ఏళ్ళ తరువాత హాయిగా వర్షం లో తడిచాను కాబట్టి!

వర్షానికి చిత్తడిగా ఉన్న మట్టి నేలలో కదులుతున్న వాన పాముని, మొక్కల్లోంచి గెంతుకుంటూ వస్తున్న కప్ప పిల్లని మ అబ్బాయికి ఈ నగర వాతవరణం లో సైతం చూపించగలిగాను కాబట్టి!

టీ వీలో వస్తున్న న్యూస్ ఐటెంస్ వినకుండా, అదే పనిగా మోగుతున్న సెల్ ఫోనుని ఖాతరు చేయకుండా, తర్వాత చెయ్యాల్సిన పనులని పట్టించుకోకుండా….పెరుగు అన్నంలోకి నంజుకొంటున్న మాగాయ టెంకని ఒక పావు గంట సేపు చీకుతూ కుర్చోగలిగాను కాబట్టి!

ఇక, చివరిగా….ఎన్నో సార్లు రాయాలనిపించి, ఇప్పుడేం రాస్తాములే అని ఆపేసే నేను – ఇన్నాళ్ళకి బ్లాగ్ లొ ఒక కొత్త పోస్ట్ రాయగలిగాను కాబట్టి!

మధురమైన పుట్టిల్లు…

నవంబర్ 17, 2009

ఏముంది మీ ఊరిలో దోమలు-ఉక్కపోత తప్ప!….

మీది గొప్ప ఊరని-ఏముంది అక్కడ చూడటానికి..

మొన్నేగా మీ అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు-మరలా ఎందుకు మీ ఇంటికి వెళ్ళడం…

నేనెప్పుడు మా ఊరు-మా ఇంటికి వెళతాను అన్నా మా వారికి రెడీ గా దొరికే సాకులు.

నేను పుట్టి-పెరిగిన ఊరు, నా మనుగడకి కారణం అయిన ఊరు,నా వాళ్ళందరూ ఉన్న ఊరు…ఈ భూ ప్రపంచం లో ఎంత అందమైన విహార స్థలానికి వెళ్ళినా మ పుట్టింటికి వెళ్ళి వచ్చినపుడంత ఆనందం కలుగదు. మా ఊరు వెళదాం అనగానే నా కళ్ళల్లో మెరుపు…. 40 ఏళ్ళుగా కాపురం చేస్తున్నా-వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఏదో ఫంక్షన్ కి వెళ్ళడానికి వారం రోజుల ముందు నుండే బట్టలు సద్దేసుకుంటున్న మా అత్తగారి కళ్ళల్లోనూ సరిగ్గా అదే మెరుపు-పుట్టింటికి వెళ్ళమంటే అదే మురిపం. ఎందుకు పుట్టింటికి వెళ్ళాలంటే అంత సంబరం?

అక్కడికి వెళితే ఒక్కసారిగా చిన్న పిల్లలా మారిపొయినట్టే..

పెళ్ళి అయాక భర్త-పిల్లల అభిరుచుల ప్రకారం వండి పెట్టడమే కాని-మనకీ కొన్ని ఇష్టాలు ఉన్నాయని గుర్తు వచ్చేది అక్కడే!ఇష్టమైన కూరలు, పిండి వంటలు రుచి చూడటం…అదీ మనం తింటుండగా ఇంకొకరు వడ్డించడం! వినడానికి చిన్నవే అయినా అక్కడ మాత్రమే తీరె బుల్లి కోరికలు- ఎవరైనా అట్లు వేసి పెడుతుంటే కదలకుండా కూర్చుని వేడి వేడిగా లాగించడం,లేవగానే తీరిగ్గ కూర్చుని వేడి-వేడి కాఫీ (మనకి మనం కలుపుకోకుండా) తాగడం..ఇవి కాక తిన్న కంచం తియ్యకూడదు,ఇల్లు ఊడవకూడదు లాంటి పుట్టింటి ఆడ పిల్లగా దొరికే మినహాయింపులు.

అమ్ములు, బుజ్జి, బంగారు తల్లి…లాంటి పేర్లు మనవి అని,మనల్ని ఇంత ఆప్యాయంగా పిలిచే మనుషులు ఉన్నారని అక్కడికి వెలితేనే గుర్తొస్తుంది.చిన్నపుడు సూర్యోదయాన్ని చూడటం కోసం పొద్దునే లేవాలంటే కస్టపడాలిసి వచ్చేది-ఇప్పుడు ఉన్న భాద్యతలతో బారెడు పొద్దెక్కే దాక పడుకోవాలంటే కస్టపడాలి.లోకాన్ని,భాద్యతలని మర్చిపోయి హాయిగా ఆదమరిచి నిద్రపోవడం కోసం అయినా పుట్టింటికి వెళ్ళాల్సిందే.

మనసారా అమ్మ మీద అరిచేయొచ్చు-తనివి తీర చెల్లి తొ పోట్లాడొచ్చు,జనాల మీద కావల్సినంత చిరాకు పడొచ్చు.

 బజార్లొ ఏమయినా కొనడానికో, గుడికో వెలితే ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించే చిన్నప్పటి నేస్తాలు- మా ఇంటికి ఒకసారి కూడా రావేం అని నిస్టూరాలాడే దూరపు చుట్టాలు…2-3 రోజుల్లోనే దొరికే ఇన్ని పలకరింపులు ఇంత మహా నగరంలొ 5 ఏళ్ళుగా ఉంటున్నా దొరకవేమో అనిపిస్తుంది.

నేను వాడిన వస్తువులు,వేసుకున్న బట్టలు,ఆడుకున్న బొమ్మలు,ఎంత పాతవి అయిపోయినా సరికొత్త మొహంతో పలకరిస్తున్నట్టు అనిపించే అపురూప నిధులు.

రొజువారి టీవీలో రాజకీయమో/ప్రమాదమో/మరణమో తప్ప లేని వార్తలు విని విని…మ ఊర్లో వినపడె స్థానిక వార్తలు, ఫలానా వాళ్ళ కోడలు ఘనంగా సారి తెచ్చుకుందట, ఫలానా అబ్బాయి పెళ్ళి లొ ఇలా జరిగిందట,కొత్తగా పెట్టిన తోటలోని కొట్టులో బట్టలు కారు చౌక అట, ఏదో ఊర్లో ఆవుకి-మగ పిల్లాడు పుట్టాడట-అందుకని దీపం వెలిగించి గడప దగ్గర పెట్టాలట…లాంటి పుకార్లు, సరదా కబుర్లు చెవిన పడితే..చాలా హాయిగా అనిపిస్తుంది.

 సీట్లు,సౌండ్ సిష్టం సరిగా లేకపోయినా సరే మా ఊరు సినిమా హాల్లో సినిమా చూసి తీరాలనిపిస్తుంది.హైదరాబాద్ మహా నగరంలో రక రకాల మోడల్స్ దొరుకుతాయని తెలిసినా మా ఊరు షాప్స్ లో బట్టలు గట్రా కొనుక్కోవాలనిపిస్తుంది.అధునాతన నగరం లొ రక రకాల విడ్డూరాలు ఉన్నా-మ ఊరు కాలువ గట్టు పైన ఒకసారి నడిచి రావాలనిపిస్తుంది.

‘మా పుట్టిల్లూ అంటే- అక్కడి మనుషులా?బంధువులు-స్నేహితులా?వస్తువులా?రహదారులా?ప్రదేశాలా?నా బాల్యపు జ్ఞాపకాలా? లేక ఇవన్నీ కలిసి మిగిలిచిన అనుభవాల దొంతరలా? ఇదేమీ తేల్చుకోలేని అయోమయంలో,హడావిడిలో,సంతోషంలో అక్కడి సమయం గడిచిపోతుంది.

అక్కడ ఉన్న 4 రోజులు 4 క్షణాలుగా దొర్లిపోయి- ఇంకా చెప్పుకోవలసిన కబుర్లు బోలెడన్ని మిగిలిపోగా, అప్పుడే వెల్లిపోతావామ్మా అనే మ నాన్న కళ్ళల్లో నీరు నిలిచిపోగా…నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది,బలవంతంగా మా వాళ్ళకు దూరం చేసేస్తుంది.

అప్పుడే ట్రైన్ దిగి పరుగెత్తి వెనక్కి వెళ్ళిపోవడానికి చిన్న పిల్లని కాదు- కాబట్టే ఏం చేయగలను- ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, మరలా మా ఇంటికి ఎపుడు వెళ్తానా అని ఎదురు చూడటం తప్ప!!

పిల్లలు దేవుల్లే కాదు-గురువులు కూడా!!

నవంబర్ 21, 2008

“పిల్లలు దేవుడితో సమానం” ఈ మాట కల్మషం లేని వాళ్ళ నవ్వులని చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది.నాకు మా బాబు కి ఉన్న సహవాసం ద్వారా పిల్లల లో ఇంకో కొత్త కోణం కనిపిస్తోంది.ఉండటానికి వేలెడంతే ఉంటారు కాని వాళ్ళ ద్వారా మనం నేర్చుకునే విషయాలు కొండంత.పిల్లలకు మనం చాలా విషయాలు నేర్పిస్తాం అనుకుంటాం.కాని పిల్లలని పెంచే క్రమంలో మనం కూడా చాల పాఠాలు నేర్చుకుంటాము.నాకు అలా అనిపించిన కొన్ని విషయాలు…

మా వాడు నాకు నేర్పిన పెద్ద పాఠం “సమయ పాలన”.ఒక గంట కాలం లో ఎన్ని పనులు చేయొచ్చో ప్రతి రోజు ఉదయం 7-8 మద్య
నా దిన చర్య చూస్తే తెలుస్తుంది.పెళ్ళి అవకముందు ఆ టైం కి కనీసం లేచేదాన్నో లేదో కూడా తెలీదు.ఇప్పుడు మాత్రం, 7 లోపు లేవకపోతే-వాడిని స్కూల్ కి పంపడం కస్టం.7 కి వాడు లేచే సరికి చాలా పనులు చెక్కబెట్టుకుని రెడీ గా ఉండాలి-మరి వాడిని లేపడం, తయారు చెయ్యడం అన్నీ పెద్ద ప్రహసనం కదా. పిల్లలు విసుగు తెప్పిస్తారు అని మనం తరచుగా అనుకొంటూ ఉంటాం. కాని, అది నిజం కాదు-మనకి వాళ్ళతో ఆ క్షణం
గడిపే సమయం,వీలు దొరక్క వాల్ల ప్రశ్నలు-చేతలు విసుగ్గా ఉంటాయి.ఉదాహరణకి మనం ఆఫీస్ నుండి రాగానే పిల్లలంతా కలిసి గోల గోల గా అరుస్తుంటే చిర్రెత్తుతుంది. అదే ఏ ఆదివారం సాయంత్రమో-సరిగ్గా అలాంటి దృశ్యంలో మనం కూడా భాగస్వాములుగా చేరిపోతాం-ఆనందంగా!! కాబట్టి పిల్లల వలన మనకి విసుగు రాకూడదు అంటే-మనసారా వాళ్ళతో సమయం గడపాలి.అవతల కూర మాడిపోతొందన్న టెన్షన్ ఉంటే-ఇక్కడ పిల్లాడు ఈ డ్రెస్ బాలేదు-వేరేది కావాలి అంటే,వాడిని ఒప్పించేంత సహనం మనలో కనపడదు.ఈ విషయం అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను పొద్దున్న,సాయంత్రం వాడితో గడిపే టైం-ఖచ్చితంగా వాడికోసమే గడపాలి అనుకుంటా.అందువలన మిగిలిన ఏ పనులు అయినా “వాడి” టైం కి అవరోధం కాకుండా చేసుకోవాలి అంటే మనకి చాల ప్రణాళిక కావాలి.మనకి నిజానికి అంత ఓపికా ఉంటుంది,కాని దాన్ని పిల్లల మీద విసుక్కుంటు వృదా చేస్తాం అంతే. వాడిని తొందరగా లేపాలి అంటే-ముందు నేను లేవాలి.సాయంత్రం కధలు చెప్పి,జోకొట్టెంత తీరిక కావాలంటే-ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా చేరుకోవాలి.ఆఫీస్ త్వరగా ముగించాలంటే ఆఫీస్ లో వర్క్ ప్రణాలికాబద్దంగా చేయాలి,అనవసరపు చర్యలను తొలిగించాలి.ఇలా మా వాడు నాకు బోలెడంత టైం మేనేజ్మెంట్ నేర్పుతున్నాడు.

ఇక మా వాడు నేర్పే మరో అంశం-సృజనాత్మకత. చేతిలో కనపడిన ఏదో వస్తువు ఇచ్చి-దీని కధ చెప్పు అంటాడు.అప్పటికప్పుడు కధ ఊహించి చెప్పాలి,మరలా ఏ మాత్రం కుతుహులంగా లేకపొయినా నచ్చదు.కాబట్టి నిజంగానే బుర్ర పెట్టాలి-ఇక అదే అదనుగా వాడికి కాస్త విజ్ఞానం కూడా ఆ
కధల్లొ జోడించే ప్రయత్నం జత చేస్తే,మన బుర్రకి ఇంకా పదును.పిల్లల చాల పేచీలు కొట్టడం ద్వార కాకుండా,వాల్లని ఆ వస్తువు/పరిస్థితి నుండీ మరల్చడం ద్వార పోగొట్టగలం.కొట్టడం చాల్ చాల ఈజి-కాని వాల్లని డైవర్ట్ చెయ్యడానికి చాలా ఆలోచన చెయ్యాలి.ఉదాహరణకి-పొద్దునే టిఫ్ఫిన్ తినిపిస్తూ ఉంటే కార్టూన్ చానల్ పెట్టమంటాడు.ఇక అది చూస్తూ ఉంటే స్కూల్ కి వెల్లడానికి కదలడు.అందుకని వాడు టీవి
పెట్టు అని అడగకుండా చెయ్యడానికి, వాడికి అంత కంటే కుతుహులాన్ని కలిగించే ఆటొ, పాటొ వాడి చేత చేయించడమో,మనం
చెయ్యడమో చెయ్యాలి.మొన్నొక రోజు కింద పారెసిన పోలిథిన్ కవర్ తీసి,దాన్ని వాడి బొమ్మకి చుట్టి-నీకు పుట్టిన రోజంట,ఇదిగో
గిఫ్ట్ అని మొదలెడితే ఆ ఆట తెగ నచ్చి ఆ రోజుకి టీవి మాట ఎత్తలేదు.ఇదే ఆట మరలా తర్వాత రోజు నచ్చకపోవచ్చు వాడికి.మర్నాడు మరలా బుర్రకి పదును పెట్టల్సిందే.వాడు దేనికైనా మారం చేస్తున్న ప్రతి సారి,అది నాకు ఒక చాలెంజ్ లా అనిపిస్తుంది.వాడిని పాజిటివ్ గా ఒప్పించి మన దారికి తెచ్చుకోడం నా గెలుపు-వాడిని కొట్టి నేను చెప్పింది చేయించడం నా ఓటమి.ఎంత సహనం ఉన్నా ఈ ఓటములు (అంటే వాడిని కొట్టడం)
ఒకోసారి తప్పవు. కాని ఓడిన ప్రతీసారి,పట్టుదల పెరుగుతుంది.కొట్టడం అనేది మన చేతకాని తనానికి ప్రతీక మాత్రమే అని బలంగా నమ్ముతాను.ఎందుకంటే ఇప్పటి వరకు వేరే ఏ ఇతర మార్గం కాకుండా కేవలం కొట్టడం ద్వారా మాత్రమే దీన్ని సాదించవచ్చు అనిపించిన సంధర్బాలు లేవు.కొట్టిన ప్రతి సారి ఇక నా సహనం,క్రియేటివిటీ చేత కాక చేతులు ఎత్తెసి చేసిందే కాని-దానికి అది మాత్రమే పరిష్కారం కాదు.ఇక వాడికి చెప్పే కధల్లో బోలెడు డౌట్స్ వస్తాయి.కుందేలు తెలివిగా సిమ్హా న్ని బావిలో పడేసిన కధలో,అంతా సుఖం అన్నట్టు ముగించబోయను. ‘మరి సిమ్హం పోతే పులి ఉంటుంది కదా అడవిలో’ అని అడిగాడు.పావురాలు అన్నీ ఒకేసారి వలతో ఎగిరిపోయి ఎలుక దగ్గరకి వెల్లే కధ చెబితే,’పావురాలకి ముక్కు ఉంది కదా-అవే వలని పొడుచుకోవచ్చు కదా’ అని అడిగాడు. వీటికి సమాధానలు మాట అటు ఉంచి-ఒక విషయాన్ని ఒకే దృస్టితో చూడటం దాదాపు అలవాటు అయిపోయిన నాకు,వేరే కొత్త కోణం లో ఆలొచించొచ్చు అనిపిస్తూ ఉంటుంది.ఇలా మా వాడు నా బుర్రకి పదును పెట్టే ఒక పజిల్!!

ఇక నా మనసుకి పట్టిన మలినాన్ని ఎప్పటికి అప్పుడు ప్రక్షాళనం చేస్తూ ఉండటం మూడో అంశం.మొన్న ఒక రోజు రోడ్ మీద వెళుతూ ఉంటే ఒక భిక్షగాడు చెయ్యి చాపాడు. నేను ఏగంగా నడుస్తూ ఆ అబ్బాయిని చూసి చూడనట్టు వెల్లిపోతున్నను.పక్కనే ఉన్న మా బాబు-‘అమ్మా, డబ్బులు లేవా?’ అని అడిగాడు.వాడు అడిగింది చాలా చిన్న ప్రశ్న,కాని నాలో చాలా ఆలోచనలు రేపింది.సహాయం చెయ్యడానికి డబ్బులు ఉంటే చాలు కదా…టైం లేకుండా వెల్లిపోవడం,గమనిచకపోవడం ఇలాంటివన్నీ నిజంగా కారణాలు కాదు కదా….బాల్యం అంటే దేవుడికి దగ్గరతనం.కల్మషం తెలీని పసితనం కాబట్టి-వాడికి అదొక్కటే రీజన్ తట్టింది.నా దగ్గర డబ్బులు ఉండీ వెయ్యకపోవడానికి వేరే ఏ కారణం అక్కర్లేదు అని అలా వాడు
నాకు నేర్పాడు. మరో రోజు తేనె పట్టు కధ చెబుతూ,హనీ ఎలా వస్తుందో అంతా చెప్పాను-తేనె టీగలు పువ్వల నుండీ తెచ్చుకుని
పట్టులో పెట్టుకుంటాయి-అప్పుడు మనం తీసి ఇలా బోటిల్ లో పోస్తాం అని చెప్పాను.అక్కడితో నా కధ అయిపోఇంది-కాని వాడు ఇంకా
ఉంది అన్నట్టుగా-‘అప్పుడు??…’ అని అడిగాడు,ఇంకేముంది-అంతే అన్నాను. మరి వాటికి థాంక్స్ చెప్పవా అమ్మా అని అడిగాడు. నిజమే కదా,వాటి కష్టం దోచుకోవడం ఏదో మన హక్కులా అనుకుని-అవి మన కోసం పుట్టాయి అన్న భావన్ని ఏర్పరుచుకున్నం.కాని,పసి వాడు కదా,వాడికి ప్రకృతి లో అన్ని ప్రాణులు సమానమే.మా ఇంటి పక్క ఉన్న కుక్క పిల్లలకి పాత బిస్కట్లు వేసి,వాడికి మాత్రం కొత్తగ కొన్నవి ఎందుకు పెడతామొ, మా వాచ్ మేన్ వాళ్ళ బాబుకి వాడికి ఉన్నట్టుగా సైకిల్ ఎందుకు లేదో,చలి వేస్తుంటే కుక్క పిల్లలు దుప్పటి ఎందుకు కప్పుకోవో…ఇవన్నీ వాడి చిన్ని బుర్రకి అందని ఆలోచనలు.మనం పెద్ద అవుతున్న కొద్దీ-అంటే దేవుడి కి,సహజత్వానికి దూరంగా జరుగుతూ ఉంటాం.యాంత్రిక జీవితంలో,మ బాబు మాటలు నన్ను చాల ఆలొచింప చేసి-రోజు రోజు కి మలినం అయిపోతున్న బుర్రని ప్రక్షాళనం చేస్తాయి.

ఇలా పిల్లలతో మన సహవాసం ద్వార ఎన్నెన్నొ నేర్చుకోవచ్చు.మా వాడు కడుపులో ఉన్నపుడు వాడి కోసం అని ఎంచి ఎంచి ఆరోగ్యానికి మంచి ఆహారం మాత్రమే తినేదాన్ని. అలా 9 నెలలు చెయ్యడం ద్వార-వాడి వలన నా ఆరొగ్యానికి కూడా మేలు జరిగింది.ఆ తర్వాత వాడు ఎదుగుతూ నాకు సహనాన్ని,ఓపిక ని, పునరాలొచనని,నిజమైన నవ్వు ని-అలసట లేని జీవితాన్ని నేర్పిస్తున్నాడు. అందుకే మా బాబు నాకు “బాల గురువు”

ఆ బ్రాండ్ పేరే ఆ వస్తువు కి పర్యాయం!

ఏప్రిల్ 28, 2008

కొన్ని బ్రాండ్ పేర్లు ఆ వస్తువు కి పర్యాయ పదంగా మన వాడుకలో వాడేస్తూ ఉంటాం.బహుశా మొట్ట మొదట మనకి ఆ వస్తువును పరిచయం చేసిన బ్రాండ్ నే ఇంక ఆ వస్తువుకు ఖరారు చేసేస్తామనుకుంట.నేను గమనించినవి-నాకు తెలిసిన అన్ని ఇళ్ళల్లో వీటిని ఇలాగే పదాలు గానే వాడుతూ ఉంటారు.
సర్ఫ్” -ఒక గృహిణి పని మనిషితో:నీళ్ళల్లో ఇంత సర్ఫ్ వేసి నానబెట్టా,ఇంకా ఎందుకు అంత సబ్బు రుద్దేస్తున్నావ్?ఇక్కడ ఆ గృహిణి ఉద్దేశ్యం బాగ వాషింగ్ పౌడర్ వేసాను అని.ఇప్పుడు వాషింగ్ పౌడర్లో ఎన్ని రకాల బ్రాండ్స్ వచ్చినా సరే,సర్ఫ్ అనేది వాషింగ్ పౌడర్ కి పర్యాయ పదం అయిపోయింది.ఏరియల్/వీల్/రిన్ ఇలా ఏ వాషింగ్ పౌడర్ వాడుతున్నా సరే దాన్ని సర్ఫ్ అనే సంబోదిస్తారు చాలా మంది.

“టార్టాయిస్”:అబ్బా దోమలు చంపేస్తున్నాయి, ఒక టార్టాయిస్ వెలిగించరా బాబు-అంటే మస్కిటో కోయిల్ కి పర్యాయంగా అన్న మాట! (మార్టిన్ లాంటి చాల రకాల కాయిల్స్ ని కూడా కొత్త టార్టాయిస్ అనే పిలిచేస్తూ ఉంటారు)

“ఒడామస్”:దోమలు కుట్టకుండా రాసుకునే పై పూత.అసలు ఈ వస్తువు పేరు ఏంటో నాకు కూడా తెలీదు.వళ్ళంతా ఒడోమస్ రాసేసుకో-దోమలు కుట్టవ్ అనడమే తెలుసు.ఈ ప్రొడక్ట్ లో వేరే బ్రాండ్ వి ఉన్నాయొ లేవో కూడా తెలీదు.

“ఫ్యారెక్స్”:5 వ నెల వచ్చింది కదా మీ బాబు కి-ఫ్యారెక్స్ పెట్టడం మొదలెట్టారా లేదా? అంటే సెరల్స్ తో చేసిన రెడీ మేడ్ ఆహార పధార్ధం అన్న మాట. పాత కాలపు తల్లులు ఖచ్చితంగా ఈ మాటే వాడతారు.ఇప్పటి వారు మాత్రం ‘సెరెలాక్’ ఇలా ఆయా బ్రాండ్ ని చెప్తారు కాని.

“టినోపాల్”:తెల్ల బట్టలు ఉతికాక కాస్త టినోపాల్ పెడితే మిల మిల మెరుస్తాయి.ఇక్కడ టినొపాల్ అంటే వైటెనింగ్ ఏజంట్.కాని బ్రాండ్ పేరు నే వాడుకలో ఆ వస్తువు పేరులా వాడేస్తారు.

మిల్క్ మైడ్“:దీన్నే గొల్ల బామ డబ్బా అని కూడా అంటారు.స్వీట్స్ చేయడానికి వాడతారు.స్కిం చేసిన చిక్కటి తియ్యటి పాలు.ఇది కూడా బ్రాండ్ పేరుని ఆ వస్తువు పేరుగా వాడేసేదే.

“బ్రూ”: నాకు ఫిల్టర్ కాఫీ వద్దు-బ్రూ కావాలి అంటూ ఉంటాం. అంటే ఇన్స్టంట్ కాఫీ కి బ్రూ అనేది పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం.

మీకూ ఇలాంటివేమైనా స్పురణకు వస్తే జత చేయండి…

ఆ పనులే..ఇప్పుడెందుకు నచ్చుతున్నాయి??

ఏప్రిల్ 22, 2008

పువ్వులు మాలలు కట్టడం..
వడియాలు పెట్టడం…
మామిడి కాయలు ఆవకాయ కోసం ముక్కలుగా కొయ్యడం…
గంటల తరబడి కూర్చుని పిండి వంటలు వండటం…

చిన్నపుడు మా ఊర్లో ఉన్నపుడు-అమ్మ దగ్గర చేసిన పనులే చాలా మటుకు!కాని అప్పుడు ఈ పనులు చేయడం లో ఏ మాత్రం కుతుహులం ఉండేది కాదు.చాల సేపు ఒకే చర్య అలా మరల మరల చెయ్యడం ఎంత విసుగు అనిపించేది.అంటే ఒక పువ్వును దారంతో కట్టాకా,రెండో పువ్వును కూడా అలాగే కట్టాలి,ఒక వడియం పెట్టాక-ఇంక ఎన్ని వడియాలు ఐనా అచ్చు అలాగే పెట్టాలి…ఇలా అనిపించేది.

ఆ తర్వాత ఒక 6-7 ఏళ్ళు పుస్తకాలు,చదువు అంటూ బిజీ.అదయ్యాక ఒక 3-4 ఏళ్ళు ఉద్యోగం-స్నేహితులు,సినిమాలు,షికార్లు అంటూ బిజీ.

అలా ఒక 10 ఏళ్ళు తర్వాత- పైన చెప్పిన పనులే ఇప్పుడు చేయాల్సి వస్తుంటే…మా అత్తగారి పుణ్యమా అని ఎప్పుడో పక్కన పడేసి,దాదాపు మరిచిపోయిన పనులు ఇప్పుడు చేయాల్సి వస్తే…అప్పటి భావాలు ఇప్పుడు కలగకపోవడం అశ్చర్యంగా ఉంది.ఎందుకా అని ఆలొచిస్తే…

ఇప్పుడు ఉన్న జీవన విధానం లో అంతా ఉరుకులు,పరుగులు.ఉదయం టిఫిన్ తినడానికి,తిన్నాక నీళ్ళూ తాగడానికి కూడా సమయం దొరకనంత హడావిడి.ఆఫీస్ లో డెడ్ లైన్స్(ఏదో బ్లాగ్ లో అన్నట్టు మరణ రేఖలు!),పని వత్తిడి,సమస్యలు-పరిష్కారాలు.ఎక్కడా ఒక పని కుదురుగా చేసే సమయం-వీలు లేని పరిస్థితి.వేసవి కాలం వచ్చిందంటే మా అత్తయ్య ప్రోజెక్ట్ జాబితా తీస్తారు.ఎండా,వేడి ని ఇంత ప్రొడక్టివ్ గా వాడొచ్చా అనిపిస్తూ ఉంటుంది.వడియాలు,చల్ల మిరపకాయలు,ఆవకాయలు,ఒరుగులు…ఇలా ఆ లిస్ట్ కొనసాగుతూనే ఉంటుంది.వారంతంలో ఆవిడకి తోడుగా నేను వీటిలో పాలు పంచుకుంటూ ఉంటాను.

ఈ అన్ని పనులలోను ప్రకృతి తో మమేకం అయి,మన చుట్టూ పరిసరాలతో పాటు లీనం అయి సమయం గడపడం ఉంటుంది.కోమలమయిన పువ్వులను రోజు వచ్చే ఫార్వార్డ్ మైల్స్ లో చూసి ఆనందిచడమో-ఎప్పుడో బయటకి వెళ్ళినపుడు మూర పూలు కొని వాటి మొహం అయినా చూడకుండా హడావిడిగా తలలో తురుముకుని-ఇంటికి చేరగానె తీసి పక్కన పడెయ్యడమొ…ఎన్నళ్ళయిందీ సుకుమారంగా వాటిని తాకి,ప్రతి పువ్వును వేళ్ళ సందుల్లోంచి వెళ్ళనిచ్చి-మృదువైన అనుభూతిని పొంది!! అందుకే నాకు పువ్వుల మాల కడుతుంటే ఇప్పుడూ చాల మధురమైన అనుభూతి కలిగింది.అప్పుడు తిట్టి మరీ మాలలు కట్టడం నేర్పిన మా నానమ్మ గుర్తొచ్చి ఆ కాలానికి ఒకసారి మనసు వెళ్ళి తిరిగి వచ్చింది.

పొద్దున్నే మా బాబు ని లేపాలంటే తాతలు దిగి వస్తారు. అలాంటిది ఈ మధ్య మేడ మీదికి వెళ్ళి వడియాలు పెడదాం వస్తావా అంటే-చప్పున లేచి కుర్చుంటున్నాడు.ఫ్లాట్స్ జీవితంలో ఎవరి ఇల్లలో వాళ్ళు తలుపులేసుకుని ఏ టీ.వి చూస్తూనో గడిపేయడం అలవాటు పడిపోయాక,ఇలా ఏమైనా ఎండబెట్టడానికి పైకి వెలితే ఏదో కొత్త బంగారు లోకం కనపడినట్టు ఉంది.మాములుగా అయితే పని గట్టుకుని పైకి వచ్చే వీలే ఉండదు.ఏసి వాతావరణాలకి అలవాటైపోయిన బతుకులకి-వెచ్చటి సూరీడుని చూస్తే,ఆ వేసవి అనుభూతి తగులుతూ ఉంటే,వడియాలు తినడానికి వస్తున్న పక్షులను తరుముతూ,వాటిని పదిలంగా చూసుకుంటు-గాలి దుమారాల బారిన పడకుండా,జాగర్తగా ఎండబెట్టి తిరిగి జాడీల్లో పోసే మొత్తం ప్రక్రియలో ప్రకృతి తో బోలేడు సావాసం.బిజీ జీవితాలకి ఇది నిజంగానే ఒక ఆట విడుపు.

ఇక మావిడి కాయల పని-బహుసా కుటుంబ సభ్యులందరు కలిసి చేసే  పని ఇది ఒక్కటే ఏమో. మాములుగా మాటలు చాల తక్కువ అయిన మా ఇంట్లో,కాయ తేవడానికి మావ గారు,గట్టిగా ఉండే కాయలను ముక్కలు చేయడానికి మా వారు,నీలళ్ళొ వేసిన కాయలు ఒకోటి తెచ్చి హాల్లో పెడుతూ ఉడత సాయంలా మా బాబు…ఇలా నేను,మా అత్తయ్య మాత్రమే కాక ఇంట్లో అందరు కలిసి చేసే ఈ పని ఇపుడు చాల ఇంపుగా,అహ్లాదంగా అనిపించింది.ప్రతి ఒక్కరికి ఆవకాయ అపురూపమే,బాగ కుదురుతుందో లేదో అని.మాములుగా వంటింటి పనులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వని మగ వాళ్ళు కూడా ఈ మామిడి కాయ పనిలో లీనం అయిపొతారు.అందుకే రోజంతా అదే పనిలో గడిపినా బోర్ కొట్టలేదు.

మనం తిండి పదార్ధాలు తయారు చేసుకోడానికి చాల సమయమే వెచ్చిస్తాం.అసలు మన ఆహర అలవాట్లే అలాంటివి.మన సాంప్రదాయ పిండి వంటలు ఏమి చెయ్యాలన్న కనీసం ఇద్దరు కలవాలి.బొబ్బట్లు,కజ్జి కాయలు ఇలాటివి చేసిన ప్రతి సారి అనిపిస్తుంది-ఇవి తినడం ద్వారా వచ్చే రుచి కంటే కూడా,చేయడం ద్వారా వచ్చే తృప్తి,అది మిగిల్చిన అనుభూతి చాల విలువైంది అని.

వారంతంలో ఏ సినిమాకో,రెస్టారెంట్ కో, పార్క్ కో వెళ్ళి డబ్బులు పోసి సమయం గడిపేకంటే, కచ్చితంగా ఇలాంటి పనులలో తృప్తి ఉండి తీరుతుంది.అదీ కాక వారంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా జన సంధ్రం.ఆ కాసేపు టైం ఐతే గడిచిపోతుంది కాని,తీరా నెమరు వేసుకోడానికి ఒక్క మంచి అనుభూతి మిగలదు.

మన సాంప్రదాయం,సన్స్కృతి కి దగ్గరగా ప్రకృతి తో మనలని లీనం చేసే పైన చెప్పిన పనులు లాంటివి చేస్తే ఒక రకమైన తృప్తి.ముఖ్యంగా మనుషులను దగ్గర చేస్తుంది.పైకి చూడటానికి వారంతంలో కూడా పనేనా అనిపిస్తుంది-కాని నిజంగా అందులో ఆనందం తెలుసుకుంటే-మన గజి బిజి-బిజీ బ్రతుకుల్లో ఇవి ఎంతొ కొంత ఆట విడుపుగా అనిపిస్తాయి,పాత అనుభూతులను గుర్తు తెస్తాయి.ప్రియా పచళ్ళు,రెడీ మేడ్ ఫుడ్స్,స్వగృహా లంటి షాప్ లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూ,డబ్బులు పడేయండి చాలు-ఏదయినా తయారు చేసి ఇస్తాం అనిపించేలా ఉన్నా సరే,షాపింగ్ కి వెచ్చించే సమయం,ఈ
త్రాఫిక్ జాం ల లో వెళ్ళి రావడం,వచ్చాకా నీరసం…ఇవన్నిటితో పోల్చి చూస్తే చాదస్తం గా అనిపించే మన ఆహార తయారీ పద్దతి ఖచ్చితంగా ఏ రకంగా చూసినా అర్ధవంతమైందే!

అందుకే చిన్నపుడు ఇలాటి పనుల ప్రాధాన్యత తెలీక-ఎందుకబ్బా తిండి కోసం ఇన్ని పాట్లు,ఇంత సమయం వృధా అనిపించేది.ఇప్పుడు యాంత్రిక జీవనంలో ఇవే కాస్తో కూస్తొ ఇంధనంగా పని చేస్తాయేమో అనిపిస్తోంది.

 

వాటికే మనసుంటే…

ఏప్రిల్ 21, 2008

ముందు వెనక చూసుకోకుండా ఏది పెడితే అది నోట్లోకి తోసేస్తు ఉంటాం…కుదురుగా కుర్చుని ఆలొచిస్తే అనిపిస్తుంది-మనం కానీ తినడానికే పుట్టలేదు కదా అని!ఆహారాన్ని తీసుకోడంలో బాగం అయిన మన శరీర భాగాలకే కనుక మనసు ఉంటే (అంటే మన శరీరం అంతటికి ఒకటే కాకుండా-ఒక్కో భాగానికి ఒక్కో మనసు ఉంటే)…అవి ఎలా ఆలొచిస్తాయొ తెలుసా…బహుశా ఇలా ఏమో….

చేతులు:అదేంటిరా…ఎప్పుడు ఏమి తినాలన్నా నాకు పని చెప్తావు,తనివితీరా నన్ను నాకి నాకి పెడతావు,ఇవాళ స్పూన్ గాడితో ఆ పని చేయిస్తున్నవు? ఓహ్..నువ్వు పార్టీలో ఉన్నావా?? చూడలేదురా…సరే కానీ,ఇవాల్టికి వెచ్చగా (అంటే పొడిగా) విశ్రాంతి తీసుకుంటా…

నాలుక:ఇందాక వేడి వేడి కాఫీ పోసి నన్ను కాల్చేసి,ఇప్పుడు ఈ కొత్త ఆవకాయ ఎలా ఉందో రుచి చూసి పెట్టమంటే నేనెలారా చేసేది? సరే-ఏదొ ఒకటి తగలెయ్యి నాకు తోచింది చెప్తాను…

గొంతు:ఆహా…మండుటెండలో తడారిపోతున్న నాకు చల్లని కొబ్బరి నీళ్ళు పోసి ప్రాణం పోసావు…థాంక్సోయ్…అయ్యో..నేనింకా తేరుకోలేదురా బాబు,అప్పుడే మిరపకాయ బజ్జీలతో దాడి చేసేస్తున్నావు,నీ తిండి పాడు గాను…కాసేపు వదలరా నాయనా!

జీర్ణాశయం:జున్ను,జిలేబి,పనస తొనలు,బిర్యాని,అదేదొ పానీయం(కూల్ అంతా ఆ నాలుక,గొంతు తీసెసుకుని తోసేసింది),కోవ,చాక్లేట్,బర్గర్…వామ్మొ ఎంటిరా బాబు ఇన్ని తోసేస్తున్నవ్ ఇవాళ?కొంప దీసి హాలిడేనా ఎంటి?అయితే నా పని ఔటే ఇవాళ.. ఇక్కడ చస్తున్నారా మర ఆడలేక,యంత్రం తిరగట్లేదు, కనీసం కొన్ని నీళ్ళైనా పొయ్యరా బాబు…

క్లోమము,జీర్ణ గ్రందులు:గారెలు-అరటి పండు,దద్దోజనం-టీ,బటాణీలు-బిస్కట్లు….ఒరేయ్,ఎంట్రా బాబు ఈ కాంబినేషన్ లు, వీటిలో ఏది అరిగించాలి-ఏది కరిగించాలి?అసలు నేను ఏ రసం అని స్రవించాలి?నీరసం వచ్చేస్తోంది

పళ్ళు:ఇదేంటిరా ఇవాళ జీడి ఇచ్చి ముక్కలు చెయ్యమంటున్నావ్?నేను గట్టిగా పని చేసి ఎన్నాళ్ళు అయిందో నీకు తెలీదా ఏంటి?నువ్వు అన్నీ గబుక్కుమని మింగేసేవే తింటూ,కనీసం వేటిని నా కింద కాసేపు కూడా ఉంచమని అడగకపోతే-ఇంక నాతో పనేం ఉందిలే అని హాయిగా పడుకున్నా…ఇప్పుడూ ఇలా హఠాత్తుగా వచ్చి చెరుకు
గడలు చీల్చమని,జీడి నమలమని చెప్పకురా బబూ-దాదాపు రిటైర్ ఐపొతున్న బపాతు గాన్ని!!

ఈసారి ఏది పెడితే అది లోపలకి తోసేసే ముందు మన శరీరంలో భాగాలు ఎమనుకుంటున్నాయో పాపం.. అని ఒకసారి ఆలొచించండేం!!