వెకేషన్ అంటే – ఒక హడావిడి నుండి ఇంకో సందడికి పరుగులు పెట్టడం కాదు మన మూలాలను గుర్తు చేసే అనుభవాలను చవి చూసి – మన లోతుల్లోకి వెళ్లే అవకాశాలను కల్పించుకోవడం – మన వారితో గడిపి రావడం. అందుకే నాకెపుడూ మా ఊరులో గడపడం కంటే మంచి వెకేషన్ ఇంకేదీ లేదనిపిస్తుంది! పెరట్లో వాల్చిన మడత మంచం, అరుగుల మీద అమ్మలక్కల కబుర్లు, అలుపెరగకుండా ఆడుకొంటున్న పిల్లలు అల్లుకున్న పాదులు, వంగ పువ్వులు, విరిసిన ముద్ద బంతులు స్వచ్ఛమైన ఈ పరిసరాల ముందు సోషల్ మీడియా చిన్న బోక ఏం చేస్తుంది ? ధనుర్మాసాన్ని దర్పణం లో చూపించే రంగవల్లులు చలికి ముసుగేసిన దుప్పట్లోంచి బద్ధకం వదిలించుకుని లేచేసరికే సిద్ధంగా ఉన్న తిరుప్పావై ప్రసాదాలు అర్ధ రాత్రి వినోదాల కంటే ఉషోదయపు సొగసులు ఎంత బాగుంటాయో హరిదాసు ఎలుగెత్తి మరీ చెప్పినట్లు అనిపిస్తుంది అరిసెల పాకం తీయడం లోని నేర్పు, తిరగలితో పిండి విసరండాలోని ఓర్పు ఎన్ని పనులైనా అలవోకగా చేసుకోవడంలోని కూర్పు అమ్మల కమిట్మెంట్ కావాల్సినంత స్ఫూర్తి ని ఇచ్చి తీరుతుంది రాముల వారి గుడిలో ముద్ద మందారాల మాల వేసుకున్న సీతమ్మ దుర్గమ్మ గుడిలోని కుంకుమ అన్నవరం ఆకు ప్రసాదం లోని మధురిమ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంత తను నింపుతుంది అన్నయ్య – వదిన ల ఆప్యాయత ల తీరు ఆదరణతో నిండిన అక్క బంగారు అర్ధ రాత్రి దాకా చెల్లితో చెప్పుకున్న కబుర్లు మనసున మోసే భారాలన్నీ దించేసి తీరుతుంది పిన్ని బోళాతనం బాల్యాన్ని గుర్తు చేస్తే – బాబయ్య మాటలు భవితను ఆలోచింప చేస్తాయి వండి ఆప్యాయంగా పెట్టడం లోనే తృప్తిని వెతుకున్నే అక్క కొత్త వంటలతో పిల్లలని – కొత్త ఆలోచనలతో నన్ను ఆశ్చర్య పరిచే చెల్లి మన వాళ్ళు మనకెపుడు బలాన్ని ఇస్తూనే ఉంటారు అనిపిస్తుంది రోటి పచ్చళ్ళు , పొడులు, పులుసులు, గుత్తి వంకాయ లాంటి కూరలు.. అమ్మ వండి వడ్డించాలనుకున్న పదార్ధాల లిస్ట్ కి ఎన్ని పూటలైతే సరిపోతుంది?నా ఉనికి కి కారణం అయిన పరిసరాలు – నా ఆత్మీయులతో గడిపే అనుభవాలు ఎన్ని రోజులు ఉంటే తనివి తీరుతుంది? |
స్పందించండి