ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేదు అని బాధ పడుతూ కూర్చున్న అమ్మాయి ని చూసి – పోతే పోయిందిలే దాని గురించి వదిలేయమ్మా… అని నాన్న నచ్చ చెప్పారు. రెండు రోజులు చింతిస్తూ కూర్చున్న అమ్మాయి మాములుగా తిరగడం మొదలెట్టింది. అలా ఒక నెల పైనే గడిచాక …అమ్మాయికి ఉద్యోగం రావట్లేదు అన్న చింత నాన్న కి మొదలైంది.
అపుడు నాన్నకి తట్టిన ఆలోచన.. అమ్మాయిని ఉద్యోగం రాలేదు అని చింత పడకమ్మా అన్నానే కానీ – దాని గురించి చింతన చేయొద్దని కాదు కదా అని.
రేపటి రోజు పరీక్షో లేక ఇంటర్వ్యూ నో లేక మీటింగో, …ఏదైనా సరే..
ఎలా జరుగుతుందో అని ఆందోళన చెందడం చింత
ఎలా జరగాలో సావధానం గా ఆలోచించడం చింతన
రేపటి గురించి ఆలోచించొద్దు- ఈ రోజు, ఈ క్షణం మీద మనసు లగ్నం చెయ్యి అన్నది బాగా ఎరిగిన ఫిలాసఫీ వాక్యం. ఈ క్షణాలు కరిగి పోయి – రేపటి క్షణాలు ‘ఇప్పుడు’ గా మారడం ఎంత సేపు? మన ‘ఇప్పుడు’ బాగుండాలి అంటే – ఎప్పుడూ గాఢం గా ఆలోచించాల్సిందే కదా..
ఉదాహరణకి – వారం తర్వాత రాబోతున్న ఒక ముఖ్యమైన మీటింగ్ ఎలా నిర్వహించాలి అని లోతుగా ఆలోచించాల్సిందే. నెల తర్వాత వెళ్లాల్సిన టూర్ గురించి విస్తారంగా అలోచించి ప్రణాళిక వెయ్యాల్సిందే. సంవత్సరం తర్వాత పిల్లాడిని ఏ కాలేజీలో చేర్చాలో చక్కగా విచారణ చేయవల్సిందే. ఇలాంటి ఆలోచనలు చెయ్యడానికే కదా భగవంతుండు మనకి బుర్ర ఇచ్చింది. కానీ, అదే బుర్ర.. వైరస్ చేరిన సాఫ్ట్ వేర్ లాగా ఒక రకమైన ఆలోచన చేయాల్సింది పోయి వేరే రకమైన ఆలోచనలతో మస్తిష్కాన్ని నింపేస్తుంది. అలాంటప్పుడే మనం – చింతాకంత కారణాలకి కూడా చింతాక్రాంతులమయ్యేది.
అమ్మో రేపటి మీటింగ్ ఎలా అవుతుందో ఏంటో? కావాల్సిన ఫ్లయిట్ కి టికెట్స్ దొరుకుతాయో లేదో, టూర్ కి వెళ్లి బీచ్ దగ్గర సేద దీరే రోజు రావడానికి ఇంకా 29 రోజులే ఉన్నాయి, మా అబ్బాయికి నేను అనుకుంటున్న కాలేజీ లో సీట్ వస్తుందా – రాకపోతే వాడి భవిష్యత్తు ఏమిటి?….ఇక ఈ ఆలోచనల ప్రవాహానికి అడ్డు ఏమి ఉంది. అడ్డ దారులు తొక్కిన ఈ ఆలోచనల అంతిమ లక్ష్యం ఆందోళన, అయోమయం …ఇదే చింత!
చింతన ఒక చక్కటి విన్యాసం. ప్రణాళిక, జిజ్ఞాస, ఆశ, విశ్వాసం దాని లక్షణాలు. రేపటి రోజు కి మనల్ని చక్కగా ప్రిపేర్ చేసే ఒక పని ముట్టు. సరైన విషయాల గురించి ఎంత లోతుగా అయినా ఆలోచించాల్సిందే…అసలు ఆలోచించక పోవడం ఒక బద్దకపు లక్షణం. ఉవ్వెత్తున దూకే ఉత్తుంగ ప్రవాహం లా సాగే ఆలోచనలు ఎన్నో సమస్యల కి పరిష్కారాలను చూపుతాయి. మన మస్తిష్కానికి ఉన్న శక్తి ని మనకి పరిచయం చేస్తాయి.
ఇంత చిన్న బుర్రలో బ్రహ్మాండాలని ప్రభావం చేసే ఆలోచనలు చేయొచ్చు. స్టుపిడిటీ సునామీలనూ సృష్టించవచ్చు.
చింత – మనల్ని దహించివేసే కార్చిచ్చు అయితే
చింతన- మనల్ని ఏదైనా సాధింప చేయ గలిగే ఒక చిత్రం
చింతించడానికి పెద్ద కారణం ఏమి కావాలి? నల్లని కురులలోంచి తొంగి చూస్తున్న ఒక చిన్న
తెల్ల వెంట్రుక చాలు. ఆడుకుని వచ్చిన చంటాడి చొక్కా పైన మరక చాలు, సగం కోసిన వంకాయ లో బయట పడిన పుచ్చు చాలు.
కానీ.. తలలు బోడులైనా ఆగిపోని జ్ఞాన పరంపర కి మాత్రం చింతన కావాలి. ప్రపంచాన్ని మార్చగలిగిన సౌకర్యాలైన, గ్రహాంతరాలకి వెళ్లగలిగిన సాధనాలైనా, పరమాత్మ ని చేర్చగలిగే సాధకాలైనా…ఎందరో మనలాంటి మనుషులు చింతన ద్వారా సాకారం చేసినవే కదా!
చింత అనేది – చంద మామ కధలో చదివిన చింత చెట్టు మీద దయ్యం లాంటిది అయితే
చింతన అనేది – బోధి వృక్షము కింద జ్ఞాన ముద్ర లో ఉన్న గౌతముడి లాంటిది
అందుకే…మన చింతలకు చెల్లు చీటీ పాడేసి – చింతన తో చైతన్యం పొందుదాం
స్పందించండి