మా కాలనీలో గుడి కట్టిస్తున్న పెద్దాయన 10 రోజుల తర్వాత కనిపించి పలకరించగానే – హమ్మయ్య ఈయన క్షేమంగానే ఉన్నారు కదా అన్న ఫీలింగ్ హాయిగా అనిపించింది. 3 నెలల క్రితం వరకు ఆయన ఎవరో కూడా తెలియని నాకు నా ఎమోషన్స్ ను ప్రభావితం చేసే ఒక కారకంగా అయ్యారా? ఏమి చిత్రమో కదా!
15 ఏళ్ల క్రితం లేని పిల్లలు ఇపుడు నా జీవితంలో ప్రధానాంశం అయి కూర్చోవడం, నాన్న లేకుండా ఒక్క రోజు కూడా గడవని కాలం- ఆయన కాలం చేసాక 10 ఏళ్ళు ఇట్టే తిరిగిపోవడం..బంధాల మాయాజాలం కాక ఏమిటి?
ఈ ప్రపంచ పటంలో ఉన్నారని కూడా తెలియని ఓ కొత్త జంట మా పక్కింట్లో చేరగానే వారి పోకడలు మా టీ టైం టాపిక్స్ గా మారడం, ఎవరో కూడా తెలియని వేలు విడిచిన చుట్టాల పెళ్ళికి ఏమి చీర కట్టుకోవాలో అని ఆతృత పడటం, తాటికాయంత ర్యాన్క్ ల పోస్టర్ పై విజయ చిహ్నం మాటున దాగిన ఓ బాల మేధావితో – మా అబ్బాయిని పోల్చుకుని ఆందోళన చెందడం..
ఏంటి ఇవన్నీ? ఎవరు వీళ్లంతా? నా భావాల పై వీళ్ళ ప్రమేయం ఏమిటి?
ఓ మనసా..నీకు మరీ బొత్తిగా పని లేదా? మైనం ముద్దకి నల్ల పూసలు అతుక్కున్నట్టు- ఎంత మందికి నీ భావాల పరిధిలో చోటిచ్చేస్తావ్ ?
డిటాచ్మెంట్ అంటే మనసుకి సంబంధం పెట్టుకోకపోవడం.
మనిషికి లక్ష రకాల లింక్స్ ఉండొచ్చు. కానీ అవి మనసులో అతుక్కోనంత వరకు పర్లేదు.లేదంటే బంధాలు- భావాలకు పరిధి ఎక్కడ ఉంటుంది?
కాలనీ పెద్దాయనకు ఓ ఏడాది క్రితం ఏదైనా అయి ఉంటే నాకు తెలిసేది కూడా కాదు. ఇపుడు తెలుసు కాబట్టి ఈ ఆందోళన. ఇది సహజమే..యాంత్రిక జీవితంలో ఓ అపరిచితుడు పైన ఈ మాత్రం సహానుభూతి ఉండటం ఒక రకంగా రిలీఫ్ కూడా. కానీ వచ్చే స్టేషన్ లో దిగి పోయే ఓ అమ్మాయి పొట్టి నిక్కరు నాకు చికాకు పెడుతున్నా, బస్సులో ఈ కిటికీ దగ్గర కాక వేరే చోట కూర్చుంటే అసలు తారస పడే అవకాశమే లేని ఓ దృశ్యం నాకు ఆందోళన కలిగిస్తున్నా —-ఏంటిరా మనిషీ నీకు ఈ విడవని బంధాలు, భావాల బరువులు? అని నిలదీయాల్సిందే కదా!
పుణ్యక్షేత్రానికి వెళ్లి ఓ గంట ఎక్కువగా క్యూ లో నిలబడాల్సి వస్తే వచ్చే లెక్కలేనన్ని ‘ప్చ్ ‘ లు మనకి సౌకర్యాల పైన ఉన్న బంధాలకు గుర్తులు.
పరీక్షలు రాసేది పిల్లాడైతే- మన చేతుల్లో పట్టే ముచ్చెమటలు ‘మమకారం’ అనే బంధానికి గుర్తులు
పెళ్లి జరిగేది చూట్టానికి ఐతే- మనం తీసుకుని మురిసిపోయే సెల్ఫీ లు ‘నేను’ అనే బంధానికి గుర్తులు
వసుధైక కుటుంబం అంటే అందరూ నా లాంటి వాళ్ళే అనుకోవడం..అంతే కానీ అన్ని గోలలు నాకే అనుకోవడం కాదు. వ్యక్తిగా మన పరిధిని పెంచుకుంటూ పోవాలి. కానీ మనసుకి మాత్రం ఎలాంటి భావాల ధూళినీ చేరనీయని నైజం అలవాటు చేసుకోవడమే దైనందిన డిటాచ్మెంట్ అంటే!
స్పందించండి