ఆనంద్ ఫేస్ బుక్ లో పెట్టిన కొత్త ఫొటో కి 100 పైనే లైక్ లు వచ్చాయి. అది చూసుకుంటున్న ఆనంద్ కి ఆనందం పదింతలు అయిపోతోంది.
ఆ ఫోటో అతని విహార యాత్రలో ఒక అందమైన కొండ దగ్గర తీసుకున్నది. మరి ఇన్ని లైకు లు అతనికా, లేక ఆ అందమైన కొండ ఉన్న దృశ్యానికా?
అంత అందమైన ప్రదేశంలో ఆనంద్ కాకుండా, అప్పారావు ఫొటో దిగినా ఇలాగే లైకులు వస్తాయేమో! అసలు ఆ లైకులన్నీ అనంద్ కి కాక ఆ కొండకేనేమో? మరి అతనికెందుకూ ఆనందం?
తనకి ఏదో రకంగా ‘గుర్తింపు ‘ దొరికిందని!
‘గుర్తింపు ‘ – ఈ తరానికి అంటిన ఓ నిషా..
కాల చక్రంలో తిరుగుతూ, రొటీన్ జీవితంలో పడి కొట్టుకుంటున్న మనకి …చేసిన పనిని పది మందీ మెచ్చుకోవాలనే ఓ తపన
అసలు ఎవరైనా మనని, మన పనిని ఎందుకు మెచ్చుకోవాలి?
పని చేయడం మన భాద్యత, ఇంకా బాగా చేయాలనుకోవడం మన ధర్మం..
ఎవరు ఏమి చేసినా ఎందుకు చేస్తాం? మన కోసం, మనల్ని మనం సంతృప్తి పరుచుకోవడం కోసం!
మంచి డ్రెస్స్, ఇల్లు లేదా కారు కొన్నా, మంచి ప్రదేశానికి వెళ్ళినా, ఓ కొత్త పని చేసినా, ఓ మంచి ఆలోచన వచ్చినా…అన్నీ మన కోసమే కదా. మన ఇస్టం, సుఖం కోసం చేసిన పనికి వేరే వాళ్ళ గుర్తింపు ఎందుకు?
ఎందుకంటే ‘గుర్తింపు ‘ కి మనమంతా గులాం లము కాబట్టి.
అవతలి వారి నుండి అభిప్రాయాం, సద్విమర్శ ఎప్పుడు అవసరం. అపుడే కదా మనం చేసేది సరిగా ఉందో లేదో తెలిసేది. కానీ మన పనికి మెచ్చుకోలు ఎందుకు?
ఫేస్ బుక్ లో ఇన్నిన్ని పోస్ట్లు , వాట్సప్ లో లెక్క లేనన్ని ఫార్వార్డ్ లు..ఏదో రూపంలో ఈ మెచ్చుకోలు కోసమేనా? మెచ్చుకోలు మనకి అలవాటైన మత్తు మందా?
ప్రత్యేకమైన దుస్తులు, నగలు, ఘనమైన పెళ్ళి వేడుకలు, విందు భోజనాలు, విహార యాత్రలు…మనకి నచ్చి చేసుకుంటే పర్లేదు. కాని అవతలి వారికి నచ్చేలా చేయాలనుకోవడంలోనే చిక్కంతా..
‘అమ్మ ‘ వంట చేసింది-
పది మందీ తిని ఏమీ మాట్లడకపోతే తన పని పూర్తి అయిందనుకుంటుంది
ఒక వేళ చాలా బాగుంది అంటే పోన్లే తృప్తిగా తిన్నారనుకుంటుంది
బాలేదు అంటే – అయ్యో పాపం సరిగా తినలేదు కాబోలు అని బాధ పడుతుంది.
అదే ‘అమ్మాయి ‘ వంట చేస్తే – తన వంట నచ్చి తీరాలని తపన పడుతుంది.
ఎవరూ మాట్లడకపోతే నిరుత్సాహ పడుతుంది – బాగుంది అంటే పొంగి పోతుంది
ఏ ఉప్పు తక్కువైందో అంటే ఉక్రోషం తో ఊగిపోతుంది…మొత్తానికి తను కోరుకొనేది పొగడ్త మాత్రమే!
‘అమ్మ ‘ ఎదురు చూసేది ఫీడ్ బ్యాక్, ‘అమ్మాయి ‘ ఆశించేది గుర్తింపు..
ఇలా గుర్తింపు కోసం పాకులాడకపోతే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
పని చేసేటపుడు ఎంజాయ్ చేస్తూ, బాగా చేయాలని ప్రయత్నిస్తూ, అవతలి వారి అభిప్రాయాలతో పనిని మెరుగు పర్చుకుంటూ, బాగా చేయగలిగిన రోజు సంతోషిస్తూ సాగిపోవడమే మన ధర్మం..
ఉదయించే భానుడు – ఏ మూల నుండో వినిపిస్తున్న ఆదిత్య హృదయం స్తోత్రాలని విన్నపుడో, సూర్య నమస్కారాలను చేస్తున్న ఏ సంస్కారినో చూసినపుడో – మహా అయితే ఓ చిరు నవ్వు చిందిస్తాడెమో..ఆ స్తోత్రాలకై ఎదురు చూడడు, వాటిని వింటూ ఉండిపోడు. మబ్బుల్లో దాగి ఉండిపోవడమో, ప్రఛండంగా మండిపోవడమో విధి ధర్మంలో భాగంగా చేస్తాడే కానీ లోకుల పొగడ్తల కోసం కానే కాదు.
తప్పో-ఒప్పో తెలియని వయసులో పిల్లలు ఒక పని చేసి అది కరెక్టో కాదో పెద్ద వాళ్ళ మెచ్చుకోలు ద్వారా నిర్ధారించుకుంటారు.
కాన్నీ పెద్దయ్యాకా కూడా ఆ అలవాటు ఎందుకు?
మనం చేసే పని కరెక్ట్ అని తెలుసు, అది చెయ్యాలనీ తెలుసు..కాబట్టే చేసాం. మరి అవతలి వారి మెచ్చుకోలు కోసం ఎదురు చూపులు ఎందుకు?
అభిప్రాయాలు ఆవశ్యకం. కాని మెచ్చుకోళ్ళు ముఖ్యం కాదు.
‘పని చిత్త శుద్దితో చెయ్యి – కాని ఫలితాన్ని ఆశించకు ‘ అనే జ్ఞాన నిధికి వారసులం మనం.
నేను రాసిన పోస్ట్ కి లైకు లు రాలేదనే బెంగ, రోజూ ఇంత కస్టపడుతున్నా ఎవరూ గుర్తించరు అన్న గుబులు, కొత్త కారుని చూసి స్నేహితులు పెద్దగా స్పందించలేదనే స్పర్ధ, ఇంత మేధావినైన నన్ను ఆఫీస్ లో మెచ్చుకోరేమీ అనే మీమాంస, నా పిల్లలకి పది మందిలో చప్పట్లు రాలాలన్న తపన, ఏమి చేసినా ఎవరు మెచ్చుకుంటారో అన్న ఎదురు చూపులు…ఇవి లేని రోజులు ఎంత ప్రశాంతంగా ఉంటాయి??
అందుకే
నిఖ్ఖచ్చైన అభిప్రాయాలను నిస్సందేహంగా ఆహ్వానిద్దాం – కాని గుర్తింపు విషయం లో మాత్రం కాస్త గుంబనం గా వ్యవహరిద్దాం. గుర్తింపు వెంపర్లాట తగ్గించుకుంటే ప్రశాంతతకు వెసులుబాటు పెరుగుతూ ఉంటుంది.
10:30 ఉద. వద్ద అక్టోబర్ 10, 2017 |
నమస్కారమండీ! చాలా బాగా రాసారు. మీpost నచ్చి facebook లో ఒక గ్రూప్ లో share చేశాను. Mention
చేద్దామంటే మీ వివరాలు తెలీలేదు.
12:27 సా. వద్ద అక్టోబర్ 10, 2017 |
థాంక్యూ శ్రీదేవి గారు..you can find my profile yndvijaya in FB.
1:10 సా. వద్ద అక్టోబర్ 10, 2017 |
ఇదిగోనండీ లింక్
https://www.facebook.com/groups/542646195772540/permalink/1504295326274284/
3:31 సా. వద్ద అక్టోబర్ 10, 2017 |
I sent join request to this group…seems to be interesting 🙂
3:35 ఉద. వద్ద అక్టోబర్ 11, 2017 |
మీలాంటి వారికి సరి అయిన వేదిక అండీ..! Reach చాలా వుంటుంది.Glad you found it interesting too.