బాగా అలిసిపోయి ఇంటికి చేరిన వేళ ..డైనింగ్ టేబుల్ మీద మూతలు పెట్టిన గిన్నెలలో – ఏ కంద-బచ్చలి కూరో, ఆవ పులుసో, పాల తాళికలో లేక పులిహారో కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అమాంతం అలసట ఆమడ దూరం పారిపోతుంది. ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ లలో హుషారుగా సాగుతున్న మూడ్.. వర్కింగ్ లంచ్ పేరుతో ఏ సగం చచ్చిన పిజ్జా ముక్కలో ప్లేట్లో కనిపిస్తే – ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసినట్లు అనిపిస్తుంది. ఆహారం అంటే శక్తి నిచ్చే పదార్ధం మాత్రమే కాదు. మన మూడ్ ని మార్చేయగల మంత్ర దండం. అందునా ఇంటి వంట అంటే ఆ తీరే వేరు.
ఆ రోజు ఏమి వండుకోవాలో, తినాలో వెనుక – వారం, వర్జ్యం నుండి..మనకున్న టైం, మూడ్ వరకు..ఎవరేమి తింటారో బేరీజులు, ఆరోగ్యాన్ని అనుసరించి వడపోతలు, చిన్నా- పెద్దాని బట్టి రుచిలో మార్పులు…ఇలా ఎంత కధ ఉంటుంది? వంట చేసుకుంటూ సాగే సంభాషణలు, నెమరేసుకునే జ్ఞాపకాలు, ఎక్కువ- తక్కువల మదింపులు..అన్నీ కలిసి ఇంటి వంటకు ఇంపును తెస్తాయి.
ఋతువులు, కాలాన్ని అనుసరించి చేసుకునే కొన్ని ప్రత్యేక పదార్ధాలు ఉంటాయి. పండుగలు, పర్వ దినాల ఆనవాళ్ళు ఉంటాయి.
శ్రావణ మాసం అంతా శనగలు వంటలలో సందడి చేస్తాయి. భాద్రపదం లో బియ్యం పిండి తన బిగి చూపిస్తుంది. ఆషాడంలో అణవులు, మునగాకు..మాఘ మాసంలో మొలకలు చిక్కుల్లు లాంటివి సహజంగా వంటతో సాహచర్యం చేసి పోతుంటాయి.
వంట చేసే ఓపిక లేకపోతే వేసవిలో శ్రమ చేసి దాచుకున్న నిక్షేపాలు..ఒరుగులో, ఒడియాలో వెంటనే ఆదుకుంటాయి.
జలుబు చేసిన రోజు మిరియాల చారు, కడుపు బాలేకపోతే వాము అన్నం, శొంటి పొడెం లాంటివి చాలా సుఖంగా ఉంటాయి.
ఇంటి వంటతో పిల్లలకి రుచులతో పాటు సంస్కారాలు కూడా సరఫరా అవుతాయి.
సద్దుకోవడం, పంచుకోవడం, తృప్తిగా తినడం, కావల్సినంత మాత్రమే తినడం..ఆహారానికి వన్నె తెచ్చే అంశాలు. ఇంటి వంట ద్వారా ఇవి అలవాటు చేయడం తేలిక.
వంట చేయడం ఒక పని అయితే – కుటుంబం కోసం చేసేప్పుడు అది ఒక కళ గా మారిపోతుంది.
పిజ్జా డెలివరీ 20 నిమిషాల్లో..చాలెంజ్ కంటే..అరగంటలో అందరికి నచ్చే వంట చెయ్యటం – చాలా క్రియేటివ్ గా ఉంటుంది.
బిర్యాని తో- ఐస్ క్రీం ఫ్రీ లాంటి ఎక్స్ ట్రా ఆఫర్ ల కంటే- కొన్ని వస్తువులు లేకున్నా సరే కావల్సిన వంటకం చేయడం లో కిక్ ఉంటుంది.
వండడం లో శ్రమ తెలుస్తుంది కాబట్టి ఆహరం అంటే గౌరవమూ కలుగుతుంది.
మనం తినే ఆహారం లో ఆరో వంతు మన ఆలోచన అవుతుందట. ఎంత రుచికరమైనది తింటున్నామన్నది కాదు – ఎంత తృప్తి గా తింటున్నాం అన్నది ముఖ్యం.
అందుకే రెస్టారెంట్ రుచికి రేటింగ్ లు ఉంటాయి కాని – ఇంటి వంటకి మెచ్చుకోలు నక్షత్రాలు ఉండవు.. ఏ ఇంటి వంట ఆ ఇంటికి ప్రత్యేకం, సొంతం!
అందుకే ఇంటి వంట ని మనసారా ఆస్వాదిద్దాం – ఆ తృప్తి ని మన పిల్లలకీ అందిద్దాం.
స్పందించండి