Archive for జూన్, 2017

మూడు మంచి సంభాషణలు!

జూన్ 18, 2017

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ‘ పాత వీడియోస్ మూడు ఈ మధ్య యూట్యూబ్ లో చూసాను. గొల్లపూడి మారుతీ రావు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి. చాలా మంచి అనుభూతి కలిగింది. వారాంతాల్లో – టీ వీ లో ఏ పదో సారో వేస్తున్న హిట్ సినిమాను ఏమి తోచక చూసే కంటే…ఇలాంటి సంభాషణలు వినడం వెయ్యి రెట్లు తృప్తి కలిగిస్తుంది. కాబట్టి – ఈ పోస్ట్ చదువుతున్న వారంతా ఈ మూడు వీడియోలు చూసి తీరాలని నా సలహా.

ఎందుకంటే-
మండుటెండల తర్వాత తొలకరి జల్లులు పడినపుడు ఎంత హాయిగా ఉంటుందో, ఇలాంటి సంభాషణలను విన్నపుడు అలాంటి అనుభూతి కలుగుతుంది.
ఎంతో మంది సెలెబ్రిటీలు ఉండొచ్చు గాక , విజేతలూ ఉండొచ్చు గాక..
జీవిత చరమాంకంలో సంభాషించినపుడు, నిండైన జీవితం గడిపిన తృప్తి, విలువలకు కట్టుబడిన నిబద్ధత, శ్రమలో ఆనందాన్ని చూసిన వైనం, ఎదిగినా ఒదిగి ఉండే తత్వం…ఈ సుగంధాలు వీరి మాటల్లో పరిమళిస్తాయి.ఇలాంటి సంభాషణలు నిజంగా స్ఫూర్తి కలిగిస్తాయి.
వీరి జీవిత స్మృతుల నుండి నేను నేర్చుకునేది ఏమిటి?

జ్ఞాన సముపార్జన పైన వీడని మక్కువ
పని చేయడం అనేది తన ప్రధమ కర్తవ్యం గా భావించడం
చేసే పనిని విపరీతమైన ఇస్టంగా చేయడం
కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వడం
తను ఏమి సాధించినా అది ఎవరో పెద్దల సాయమో, ఆశీర్వాదమో అని బలంగా నమ్మడం
తను అంటే ‘నేను ‘ కాదు ‘మేము ‘ అనుకోవడం…అది కుటుంబం కావొచ్చు, సమాజం కావొచ్చు, దేశం కావొచ్చు, తనతో విడదీయలేని సంస్కృతి కావొచ్చు.
ఏం సంపాదించాం, ఏం సాధించాం అనే విషయం పై దృస్టితో కాకుండా ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయం పై శ్రద్ధ పెట్టడం..
ఇలాంటి వారు జయాపజయాలకు అతీతులు.
మన సంస్కృతిలో గొప్పతనాన్ని మనకు వారసత్వంగా ఇవ్వగలిగిన వారధులు
జీవితం అనే నాటకంలో తమ పాత్రలను శ్రద్ధగా పోషించిన ధన్య జీవులు.

ECIL ను స్థాపించిన A.S.Rao గారు అనన్య సామాన్యమైన విజయాల తర్వాత, రిటైర్ అయిన రోజు – అతి సామాన్యంగా రోజూ వెళ్ళినట్టే ఇంటికి మాములుగా వెళ్ళిపోయారట. ఒక మాములు వ్యక్తిలాగ సిటీ బస్ లో A.S.రావు నగర్ కి టికెట్ అడుగుతున్న ఆయనను ఒక కండక్టర్ గుర్తు పట్టి ఆయన నిరాడంబరతకు చేతులెత్తి నమస్కారం చేసాడట!

గణితం లో అఖండ మేధావి అయిన శ్రీనివాస రామనుజం విదేశాలలో ఉన్నపుడు తను నమ్మిన ఆహార నియమాలకు కట్టుబడి, ఆరోగ్యం దెబ్బ తింటున్న ఏ మాత్రం లెక్క చేయక – చివరికి ప్రాణాల దాకా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇది చదివిన వారికి, ఆయనకి తిండి దగ్గర అంత చాదస్తం ఏంటి అనిపిస్తుంది. కాని ఆయన నిబద్ధతను చూసి అబ్బురం అనిపిస్తుంది.

విలువలకు, జ్ఞానానికి, కార్య దక్షతకు, స్థిత ప్రజ్ఞతకు పట్టం కట్టిన సంస్కృతి మనది. పనే పరమాత్మ అని నమ్మిన దేశం మనది.

ఇలాంటి మహనీయులు ఏమై పోతున్నారు ఇప్పుడు?
సైకిల్ మీద వెళ్ళినా, 2 జతల బట్టలు మాత్రమే వాడినా, 3 గదుల ఇంట్లోనే ఉన్నా…వారి జ్ఞాన సంపద వెలిగిపోయేది.
ఇపుడు అద్దాల మేడల్లో ఉన్నా, బెంజి కార్లలో తిరిగినా, ఖరీదైన సూట్లు వేసినా…విలువలు లేని జీవితాలు మనవి

నిబద్ధత, విలువలు, జ్ఞానం, సంస్కృతి ఆనవాళ్ళు కనుమరుగవుతున్న జీవితాలు ఒట్టి బూటకాలు, పటాటోపాలు.

ఇలాంటి వారి మాటలతో కొంతైన స్పూర్తి కలుగుతుంది. వారి జీవితాల నిండుతనం చూసి మనకీ ఒక మార్గం గోచరిస్తుంది.

ప్రకటనలు