బాగా కాలిన పెనం పైన సుర్రుమనే శభ్ధం..
ప్లేట్ లో ఉన్న అట్టు ఖాళీ అయిపోవడంతో, తన వంతు కోసం ఎదురు చూస్తూ – పచ్చడి వేల్లను నాకుతూ ఇంటిల్లిపాదీ ఎదురు చూపులు…
మా అత్తగారి సారెలో తెచ్చుకున్న యాభయ్యేలనాటి పెనం పైన – కర కరలాడే ఈ నాటి ‘క్రిస్పీ దోశ ‘ ను వేయడంలో నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ..నేను..
ఇలా ఓ ఆదివారం ఉదయం..
పిండికి – అట్టుకి మధ్య ఉండే వెయిటింగ్ టైంలో, నాలో దొర్లిన ఆలోచనా దొంతరలు..ఈ ‘అట్ల పెనం ముచ్చట్లు ‘
ఏ ఇడ్లీ వాయో దించేసో, గిన్నెలో ఉప్మా తిప్పేసో టిఫిన్ కానిచ్చేయడానికీ – ఇంటిల్లిపాదికీ అట్లు పోయడానికి చాలా తేడా ఉంటుంది -ప్రయాసలో, అనుభవంలో, నిరీక్షణలో, తృప్తిలో..
పాకిపోయే లక్షణమున్న పిండిని – కుదురుగా నిలబెట్టి, ఆరబెట్టి, అట్ల కాడ అనే బెత్తంతో బుద్ధి చెప్పి, కర కరలాడే అట్టుగా మార్చడానికి కఠినంగా వ్యవహరించే స్కూల్ మాస్టారు లాంటిది ఈ పెనం!
నాకు చాలా సహనం ఉంది అని గొప్పలు చెప్పుకునే వారంతా హాజరు కావాల్సిన పరీక్ష ఈ అట్లు వేయడం అనే ప్రహసనం….
అట్ల పెనం ఎగ్జాం పేడ్ అయితే, వేసే ప్రతి అట్టూ ఒక పరీక్షా పత్రం.
సన్న సెగ పై పెట్టి కాల్చాలి, వంతులు వారీగా వడ్డించాలి, తీరా నా వంతు వచ్చే సరికి అడుగంటిన పిండి చూసి నిరుత్సాహ పడకుండా, బుల్లి అట్టు రూపంలో వేసుకుని, చప్పగా చల్లారి పోయినా తిని ఆస్వాదించాలి.
ఒకో సారి తొందరపడి, పొయ్యి కాస్త ‘హై’ లో పెట్టి అటు వెళ్ళి వచ్చేసరికి, మాడిపోయిన మొహంతో ఓ అట్టు వెక్కిరిస్తూ ఉంటుంది. అప్పుడు – పెనం పెద్దన్న ‘నిదానమే ప్రధానం’ అని తెలియదామ్మా అని ఒక మొట్టికాయ వేసినట్లుంటుంది.
పిండిలో పాళ్ళు సరిగ్గా కలపకపోతే, ఒక్కో అట్టు పెనానికి అతుక్కుపోయి ఊడి రావడానికి ముప్పు తిప్పలు పెడుతుంది. మరో అట్టు మందం ఎక్కువ అయి దిబ్బ రొట్టిని తలపిస్తుంది. సరిగ్గా ప్రిపేర్ కాకపోతే ఏ పనైనా ఇలా అబాసు పాలవుతుందమ్మాయీ.. అని పెనం నాకు చెవి మెలిపెట్టి మరీ చెప్పినట్లుంటుంది.
ఒకో సారి చెప్పా పెట్టకుండా వచ్చే చుట్టాలకు ఏం పెట్టాలో తెలియక చిన్నబుచ్చుకుంటుంటే- ఏ మైదా పిండో, గోదుమ పిండో కాస్త నీళ్ళల్లో కలిపి పెనానికి అప్పచెబితే – అట్టు రూపంలో తేల్చి ఆదుకుంటుంది.
చనివిడి మిగిలిపోతే తీపి అట్టు రూపంలో వేసి చిత్రం చెయ్యొచ్చు. ఇడ్లీ తినను అని మొరాయిస్తున్న పిల్లలను – అట్ల పెనం ఊతంతో ఊతప్పం చేసేసి ఉఫ్ మని ఊదించేయొచ్చు.
అన్నీ గొప్పలే కాదులే కొన్ని చాడీలూ ఉన్నాయి.
పెసరట్టు ఎంత గొప్పగా కాల్చినా, ఉప్మా, అల్లం పచ్చడి తోడు లేకపోతే హిట్ కావల్సిన సినిమా ఫట్ అయినట్టు ఉంటుంది (అట్ల పెనమా, అంతా నీ గొప్పే కాదోయీ!)
వెన్న తిప్పిన మజ్జిగలో పిండి కలిపి చేస్తే చల్లట్లు, బియ్యం- మజ్జిగలో నానబెట్టి చేసినవీ చల్లట్లు..పేర్లు ఒకటే అయినా రుచిలో ఎంత తేడా (ఓ పెనం పెద్దాయనా – గమనించావా?)
అవునూ ఒకోసారి నా చేతికెందుకూ చురకలు పెట్టేస్తావు? అట్టు కి – అట్టు కి మధ్య కాస్త నీళ్ళు జల్లి నిన్ను చల్లబరుస్తూనే ఉంటా కదా?
సరే, ఇవాల్టికి అట్ల వడ్డన పూర్తయ్యింది.
ఓ పెనమా – పాపం అట్ల కాడతో ఎన్ని పోట్లు పొడిపించుకున్నావో?
మాకు కమ్మని అట్లని అందించి నువ్వెంత జిడ్డెక్కి పోయావో?
ఈ ఉల్లిపాయ బొడ్డుతో మాలిష్ చేసుకుని కాస్త సేద దీరు..మరో సారి మాట్లాడుకుందాం.
స్పందించండి