సంభాషణల సౌరభాలు..

ఎప్పుడూ ఏ పేపర్ లోనో తల దూర్చేసి గంభీరంగా ఉండే మా మావ గారు – మౌనంగా ఇంటి పనులు చేసుకునే మా అత్తగారు…ఇవాళ హాల్లో కూర్చుని కులాసాగ కబుర్లు చెప్పుకుంటుంటే చూడటానికి చాల హాయిగా ఉంది.

చెరో పక్కా పిల్లలని కూర్చోబెట్టుకుని కధలో, చిన్న నాటి విశేషాలో చెబుతుంటే కళ్ళింతలు చేసుకుని వింటున్న వారి ముఖాలు చూడటం మురిపెంగా ఉంటుంది.

సీతాకోక చిలుకల్లా ఎగిరే ఊహలను ఒక్కోటి పేర్చుకుటూ – ఆ రోజు స్కూల్ లో జరిగిన ముచ్చట్లు చెబుతున్న చిన్నోడు….ఈ లోపు, వాడు సాధించిన ఎ చిన్న విజయమో నాతో పంచేసుకోవాలని ఉబలాట పడుతున్న పెద్దోడి ఉత్సాహం…మాటల దొంతరలు కాస్తా తూటాల లా మారి వాగ్యుద్ధాలు అయిపొతున్నా సరే…మొత్తానికి సంభాషణలు బాగుంటాయి.

ఓడిన క్రికెట్ మేచ్ ని విశ్లేషించుకునే తాత- మనవడు, పచ్చడి పాడైపోకుండా ఎలా పెట్టాలో నైపుణ్యాన్ని పంచుకునే తోటి కోడళ్ళు, పెరుగుతున్న ఎండలు – నీటి కొరతలు, చుట్టాల మీద చెప్పుకునే చాడీలు…ఎవరు ఏం మాట్లాడుకున్నా.. సోది, వాగుడు అని వాటికి ఏ పేరు పెట్టినా…ఏదో రూపంలో ఇంట్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎంత బాగుంటుంది!

అలసి పోయి ఇంటికి చేరితే…కొత్త పెన్సిల్ రెండో రోజునే మరలా ఎందుకు కొనాలొ వివరించి చెప్పే చిన్నాడి మాటలు- పన్నీరు అత్తరు చల్లినట్టు ఉంటుంది. ఆఫీస్ లొ అరగంట ఆగకుండా స్పీచ్ ఇచ్చినా…పెద్దాడి ఆరో తరగతి ఆల్జిబ్రా ప్రోబ్లం అర్దం అయేలా చెప్పమంటే శక్తి కి మించిన పని అనిపిస్తుంది. వంట చేస్తూ అత్తయ్యగారు నెమరేసుకునే నలభయ్యేళ్ళ నాటి ముచ్చట్లు మనుసును పాత కాలానికి పరుగులు తీయిస్తుంది.ఏ ఏడాదికో వచ్చే అమ్మ చెప్పే కబుర్లు..టికెట్ లేకుండానే మా ఊరంతా చుట్టేసి వచ్చినట్టు అనిపిస్తాయి.తను తెచ్చే పిండి వంటల కంటే, అవి ఎలా చేసానో చెప్పే కబుర్లే ఎక్కువ రుచిగా ఉంటాయి.

ఏకాంతంలో మౌనం బాగుంటుందెమో కానీ, బంధాలకు నెలవైన ఇంట్లో సంభాషణల సవ్వడి లేకపోతే ఏం బాగుంటుంది. ఎ సంభాషణ అయినా “మేము మాట్లడుకున్నాం” అనే భావం తో ముగిస్తే దానికి విలువ ఉన్నట్టే. ఏం మాట్లాడుకున్నాం అనేది పెద్ద అవసరం కాదు.ఇంకా ఆలొచిస్తే…కొన్ని వందల, వేల సంభాషణల సమాహారమే అనుబంధాలు అనిపిస్తుంది. అందుకే ఎవరైనా మా ఇంటికి వస్తే బుల్లి తెర (టీ.వి) ఆపేసి సంభాషణల ప్రవాహానికి తెర తీస్తాను. మన ఇంటికి వచ్చిన వ్యక్తుల హావ భావాలు, ఊత పదాలు, దొర్లే కొత్త మాటలు, వాడే స్వరం, యాస…అన్నీ కలిసి ఒక జ్ఞాపకాల మాళికగా…ఫలాన తాత, పిన్ని, మావయ్య ఇలా ఉంటారు అని పసి మనసుల్లో నాటుకుంటుంది.

కొత్త సినిమా చూసొచ్చాకా భోజనాల దగ్గర చర్చించుకోనప్పుడు, ఊరెళ్ళడానికి బట్టలు సద్దుతూ చేసే మాటల హడావిడి లేనపుడు, కూరలో ఉప్పు ఎక్కువైందన్న చిర్రు బుర్రులు లేనపుడు, సంభాషణలలో నవ్వులు పూయనపుడూ..ఏ ఇళ్ళైనా అసలు ఏం బాగుంటుంది?
అందుకే…మన ఇళ్ళల్లో సంభాషణల సౌరభాలు అద్దుదాం. గుమ్మాలకి మాటల తోరణాలు కడదాం. గోడలను సంభాషణల జోరుతో హోరెక్కిద్దాం.

 

3 వ్యాఖ్యలు to “సంభాషణల సౌరభాలు..”

 1. వీవెన్ Says:

  కొసరు విషయం: గత కొన్ని టపాల నుండి అచ్చుతప్పులు దొర్లట్లేదు. దానికేం చేసారో కూడా ఓ టపా వ్రాయండి. 🙂

 2. yndvijaya Says:

  సాధనమున పనులు సమకూరు ధరలోన (వేమన ఉవాచ). ఇది వరకు ఎప్పుడో ఏడాది కి ఒకటి, అర సార్లు రాసేదాన్నీ…ఈ మధ్య ఎక్కువ సార్లు రాయడంతో లేఖిని అలవాటైంది. ప్రూఫ్ రీడింగ్ కూడా కొంచెం బాగా చేస్తున్నాను. అదీ సంగతి.. 🙂

 3. Srinivasa Ravitheja (SRT) Says:

  “ఏదో రూపంలో ఇంట్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎంత బాగుంటుంది!” _/\_ నిజంగా అంతే.నిజంగా అంతే.

  నవ్వుతూ కళ్ళు చమర్చాయంటే! చమర్చాయంతే ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: