పని ..అది అనివార్యం

పొద్దున్నే అలారం అలవాటుగా మోగుతోంది. 3 రోజులు వరసగా శెలవలు ఉన్నా ఈ అలారం గోలేంటిరా బాబూ అనుకుంటూ..దాని నోరు నొక్కేసాను. కాసేపటికి మరలా మోగింది. ఈ సారి నా అంతరాత్మ కూడా ప్రభోదం మొదలెట్టింది. ఇవాళ శివ రాత్రి…కొంచెం త్వరగా లేస్తే బాగుంటుందేమో అని. ఈ సారికి దాని మాట విని…లేచి స్నానం చేసి, శివుడికి పూజ, అభిషేకం చేసి, శివ స్తోత్రాలు బిగ్గరగా చదువుతుంటే…ఇంట్లో వాతావరణం క్రమంగా మారిపోవడం మొదలెట్టింది. బద్దకపు బాహువుల్లో చిక్కుకున్న ఒక్కొక్కరు లేవడం, స్నానాలు చేసెయ్యడం, పిల్లలు కూడా పూజ చేసుకోవడం..ఒక్కసారిగా పోజిటివ్ వైబ్స్ పరిగెత్తుకు వచ్చేసాయి. 3 రోజులుగా ఒంట్లో బాగోక బాధ పడుతున్న అత్తయ్య గారు కూడా ఉత్సాహంగా లేచి స్నానం చేసి వచ్చారు..కోడలు తన సక్సెసర్ గా భాద్యతలు తీసుకున్నందుకు మురిసిపోతూ…

బద్దకానికి, భాద్యతకి మద్య తేడా ఇంత చిన్నదా?
నేనొక్కదాన్నే ఒక గంట ముందు నిద్ర లేవడంతో – శివ రాత్రి సంబరం మా ఇంటికీ చేరింది. 60 ఏళ్ళుగా క్రమం తప్పక మా అమ్మ, అత్తమ్మ ఇలాగే పొద్దున్నే లేచారు, ఏ ఆచారాలు, విధులు మిస్ కాకుండా చేసారు. కొన్ని వేల సార్లు వంటలు చేసి ఉంటారు, లెక్కలేనన్ని త్యాగాలు చేసి ఉంటారు (3 గంటల పాటు శ్రమించి కమ్మటి కోవా బిళ్ళలు చేసి, మచ్చుకి ఒక్కటీ రుచి చూడకుండా మనవడు ఇంకో 2 ఎక్కువ రోజులు తింటాడని దాచి పెట్టడం లాంటివి). వీటన్నింటికీ ప్రేరణ ఎంటి? ‘

‘కర్మ సిద్ధాంతం’ ప్రకృతి లోని ప్రతి జీవి ఏదో ఒక కర్మ (పని) చేయడానికే పుట్టింది. పని పరమాత్మకు ప్రతి రూపం. ఇంట్లో ఇల్లాలిగా, ఆఫిస్ లో ఎంగేజ్ద్ ఎంప్లాయీ గా భాద్యతలు అనివార్యం. కాని ఒక మనిషిగా అసలు పని (కర్మ) అంటూ చేయడమే నా భాద్యత!

పని చేయడం భాద్యతగా ఎరిగి, ఆ పనిని మనసు పెట్టి పరిపూర్ణంగా చేసి, పని నుండి వచ్చే ఫలితాన్ని ఆశించకుండా ఉండటమే – మనిషిగా మన ధర్మం. అరే! ఇంత కిందా మీదా పడి పని చేసి ఫలితాన్ని ఆశించకుండా ఎలా ఉండటం? ఉండొచ్చు – పని చేయడానికి అసలు కిందా మీడా పడకుండా ఉంటే!

అమ్మగా పిల్లల రోజువారీ పనులు చేయడం, బుద్ధులు చెప్పడం, పెంచి పోషించడం నా భాద్యత. దాని కోసం లెక్క లేనన్ని పనులు చేయాలి. కానీ ఇవి చేసేటపుడు నాకు చేతనైనంత శ్రద్ధగా, మనసు పెట్టి చేస్తే ప్రతి క్షణం ఆ పనిలో ఆనందం వస్తుంది. అలా వచ్చే ఆనందమే నాకొచ్చే ప్రతి ఫలం. పిల్లలు పెరిగి పెద్దయ్యాకా వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళు నాకేం చేస్తారో అని ఆశించడం – అక్కర్లేని చింతన. ఇదే ఫలితాన్ని ఆశించకపోవడం అంటే. శ్రద్ధగా చేసిన ఏ పనీ వృధాగా పోదు.. ఫలితాల మీద ఆశ లేనపుడు నిరాశలు, పశ్చాత్తాపాలు ఉండవు.

‘అమ్మ ‘ అంటే ఏంటి? అంటే ఎవరైనా వంద రకాల పోజిటివ్ నిర్వచనాలు చెబుతారు. మదర్స్ డే లాంటివి చేసి నీరాజనాలూ పడతారు. ఈ ఆరాధనకు కారణం..అందరు అమ్మలు అవిశ్రాంతంగా తమ కర్మను- ఫలితం ఆశించకుండా చేసుకు పోవడం. ఈ అందరి అమ్మల కర్మల ఫలం – మనం ‘అమ్మ ‘ మాటకు చూపే ఆరాధన.వాళ్ళ పిల్లలు ఏమయ్యారు, ఏం చేసారు అనేది ఇక్కడ అప్రస్తుతం.

నేనూ ఒక అమ్మని. కాల చక్రంలో ఒక ఇరుసుని.
కాబట్టి కర్మని చేయడం నా కర్తవ్యం…అనివార్యం.

ఇదే..అన్ని ఆదివారాలూ అందరి కంటే ముందే నేనే ఎందుకు లేవాలి? అన్న ప్రశ్న కు నాకు దొరికే సమాధానం. అమ్మ, అత్తమ్మల అవిశ్రాంత శ్రమను నేను తీసుకునే వారసత్వం.

karma

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: