పూల మొక్కలతో కాసేపు…

మన నిత్య జీవితంలో చేసే ఎన్నెన్నో పనులు మనకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. కాని మనం ఆ పనులను ఆస్వాదిస్తూ చెయ్యాలి..అంతే!
మన బిజీ లైఫ్ నుండి రిలాక్స్ అవ్వాలంటే ఫేస్ బుక్, వాట్స్ ప్ లాంటివే అక్కర్లేదు. అంతకంటే ఎన్నెన్నో ఉత్తమ మార్గాలు ఉన్నాయి.
అలా నేను రోజూ చేసే పనుల్లో నాకు అహ్లాదం ఇచ్చే ఒక పని పూజ కోసం పువ్వులు కొయ్యడం.

మా మవయ్య – అత్తయ్య గారు రోజు పూజ చేస్తారు. నేను కూడా ‘కొంచెం’ పూజ చేస్తాను. మా పూజ కోసం రోజు పువ్వులు కావాలి. బజార్లో పువ్వులు కొని తెచ్చినా అవి అలంకరణకు బాగుంటాయి కాని అష్టోత్తరానికి పనికిరానట్టు ఉంటాయి. కాబట్టి ఇంట్లో పెంచే చెట్లే అలాంటి చిన్న పువ్వులకి పెన్నిధి. అలా రోజూ పూలని సేకరించడం అనే పని నా రొటీన్ లో చేరిపోయింది. కాని ఇలాంటి పనులని రొటీన్ గా చెయ్యలేము, చెయ్యకూడదు.

మా అపార్ట్ మెంట్ లో నాటి పెంచుకున్న మొక్కలు ఒకోటి పెరిగి పూలనిస్తుంటే పిల్ల రైతు లాగా తృప్తి కలుగుతుంది.
నేల రాలిన పారిజాతాలు ఏరుకున్నా, గుప్పెడు గొబ్బి పూలను ముల్లు గుచ్చుకోకుండా కొయ్యగలిగినా..నా సజ్జ నిండాలంటే ఏ నంది వర్ధనాలనో, కరివేరు పువ్వులనో, పక్కింటి గోడ పై నుండి వాలిన కొమ్మకున్న గన్నేరు పువ్వులనో ఆశ్రయించాల్సిందే!
ఒకో కాలంలో ఈ మొక్కలన్నీ ముసుగు తన్నేసి పడుకున్నట్లు పూయడం మానేస్తాయి.ఏం చెయాలా అని ఆలోచిస్తుంటే, ఏ గుబురులో దాగిన గుత్తు పువ్వులో, మంద్రంగా నవ్వే మందారాలో ఆదుకుంటాయి. చలి కాలంలో దాదాపు అన్ని చెట్లూ మొరాయిస్తే..కృష్ణ బంతి పూలు విరగ బూసి కరుణ చూపాయి. తీరా సజ్జ నింపుకుని తీసుకొస్తే..మా మావగారు వాటిని పూజకి పనికి రాని పువ్వుల జాబితాలో చేర్చేయ బోయారు (ఇది వరకు ఇలాగే బిళ్ళ గన్నేరాలను, శంఖం పూలని, ఇంకొన్ని పూలని పూజకి కనికరించలేదు). కృష్ణ బంతి పూలు విష్ణు మూర్తికి పనికిరావేమో గాని, శివుడి కి పర్లేదని ఒప్పించడం తో కాస్త కాలం గడిచింది. ఒకోసారి మరీ దొరక్కపోతే తులసి దళాలు శ్రీనివాసుడికి ప్రత్యేకమనో, జిల్లేడు పూలు సోమవారం నాడు శివుడికి ప్రీతి అనో చెప్పి ప్రత్యమ్నాయాలుగా మార్చేస్తాను.

ఇలా రోజూ పూలు కోసుకోవడం కోసం అన్ని చెట్లను జాగ్రత్తగా పరిశీలించడం అలవాటయింది. ఏ కాలంలో ఏ చెట్టు ఎన్ని పూలని పూస్తుందో, ఏ చెట్టుకి ఎలాంటి చీడ, పీడలు వస్తాయొ, ఏ మొక్కకి ఎన్ని సార్లు నీళ్ళు పోయాలో లాంటి విషయాలు అవగాహనకి వచ్చాయి. సజ్జలో చేరిన పూలు ఎన్నిసార్లు చూసినా, తాకినా..వాటి రంగులతో, లావణ్యంతో నన్ను విస్మయపరుస్తూనే ఉంటాయి. పూజ చెయ్యడం కంటే ముందే, వీటిని సృజన చేసిన పరమాత్మకి ప్రణామాలు అర్పించేస్తాను.

ఇక పూల మొక్కలకి, బాల్యానికి మధ్య అనుబంధం చెప్పేదేముంది? కాగితం పూల మధ్యలో నక్షత్రం లాంటి కాడను ముక్కు పుడకలుగా పెట్టుకుని మురిసిపోవడం, గులాబీ పూసిందంటే మా టీచర్ కి ఇస్తానంటే, మా టీచర్ కి అని కొట్టుకోవడం, డాబా పై వరకు ఎగ బాకిన సన్నజాజులని సాహసం చేసి మరీ కోసుకోవడం, మందార రేకుల పొరలను విడదీస్తూ ఆడుకోవడం, స్నేహితురాలింట్లో ‘సీతమ్మగారి జడగంట్లు ‘ పూలు ఉన్నాయని అమ్మకి చెప్పకుండా వెళ్ళి చూసి రావడం, మా వీధి లో ఉన్న నైట్ క్వీన్ వాసన మరోసారి పీల్చడం కోసం పదే పదే అటు వైపు వెళ్ళడం, మొగలి ‘రేకులు ‘ పువ్వులు ఎలా అయ్యయో తెలియక తికమక పడటం, ఇంతకూ సంపెంగ చెట్టు మొదట్లో పాములు తచ్చాడతాయో లేదో ఇప్పటికీ తేల్చుకోలేకపోవటం, కుండీ నిండా విరబూసిన చిట్టి చామంతులని చూసి కేరింతలు కొట్టడం…ఇలా పూల మొక్కలతో పెన వేసుకున్న ఏదో ఒక బాల్య జ్ఞాపకం గుర్తొచ్చి మనసులో మల్లె పూల అత్తరు చిలకరించినట్లుంటుంది.

చిన్నపుడు మా అమ్మ 108 రకాల పువ్వులతో పూజ చేస్తానని (సినిమాల్లో శ్రీలక్ష్మి లాగా) శపధం చేసింది. నేనేమో రోజుకో రకం పువ్వులు తెచ్చి ఇచ్చే భాద్యత తీసుకున్నాను. అప్పట్లొ పారిజాతాపహరణం లాంటి కధలు, ‘హిమ గిరి సొగసులు ‘ వంటి పాటలు చూసి బాగా ప్రభావితం అయినట్టున్నాను. 40-50 రకాలు అయిపోయాకా అసలు కష్టం తెలిసి వచ్చింది. గోడలెక్కితే గీసుకుపోయిన మోకాళ్ళూ, కుక్కలు తరమగా పడిన కష్టాలే మిగిలాయి కానీ, పాపం మా అమ్మ శపధం 75 రకాల తర్వాత ఆగిపోయింది.

రోజు పూలు కోసుకోవడానికి వెళ్ళినపుడల్లా..ఇలా చిన్నప్పటి ఏ స్మృతో తళుక్కుమంటుంది. ప్రతి పువ్వు తన కోమలత్వం ఎంతో కొంత నాలో నింపుతున్నట్లనిపిస్తుంది. ప్రకృతితో గడిపే ఆ కాసేపు ఎంతో చైతన్యాన్ని మనసుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. అలా రోజూ సజ్జని పూలతోనూ, నా మనసుని రోజుకి సరిపడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపుకుని ఇంటికి చేరతాను.

ఇలా పూల మొక్కలని రోజు కాసేపు చుట్టి రావడం – ఫేస్ బుక్ లో పోస్ట్ లను స్క్రోల్ చేయడం కంటే ఖచ్చితంగా తృప్తినిస్తుంది కదా!

flowers

                                                నా పూల సజ్జ 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: