ఆ పనులే..ఇప్పుడెందుకు నచ్చుతున్నాయి??

పువ్వులు మాలలు కట్టడం..
వడియాలు పెట్టడం…
మామిడి కాయలు ఆవకాయ కోసం ముక్కలుగా కొయ్యడం…
గంటల తరబడి కూర్చుని పిండి వంటలు వండటం…

చిన్నపుడు మా ఊర్లో ఉన్నపుడు-అమ్మ దగ్గర చేసిన పనులే చాలా మటుకు!కాని అప్పుడు ఈ పనులు చేయడం లో ఏ మాత్రం కుతుహులం ఉండేది కాదు.చాల సేపు ఒకే చర్య అలా మరల మరల చెయ్యడం ఎంత విసుగు అనిపించేది.అంటే ఒక పువ్వును దారంతో కట్టాకా,రెండో పువ్వును కూడా అలాగే కట్టాలి,ఒక వడియం పెట్టాక-ఇంక ఎన్ని వడియాలు ఐనా అచ్చు అలాగే పెట్టాలి…ఇలా అనిపించేది.

ఆ తర్వాత ఒక 6-7 ఏళ్ళు పుస్తకాలు,చదువు అంటూ బిజీ.అదయ్యాక ఒక 3-4 ఏళ్ళు ఉద్యోగం-స్నేహితులు,సినిమాలు,షికార్లు అంటూ బిజీ.

అలా ఒక 10 ఏళ్ళు తర్వాత- పైన చెప్పిన పనులే ఇప్పుడు చేయాల్సి వస్తుంటే…మా అత్తగారి పుణ్యమా అని ఎప్పుడో పక్కన పడేసి,దాదాపు మరిచిపోయిన పనులు ఇప్పుడు చేయాల్సి వస్తే…అప్పటి భావాలు ఇప్పుడు కలగకపోవడం అశ్చర్యంగా ఉంది.ఎందుకా అని ఆలొచిస్తే…

ఇప్పుడు ఉన్న జీవన విధానం లో అంతా ఉరుకులు,పరుగులు.ఉదయం టిఫిన్ తినడానికి,తిన్నాక నీళ్ళూ తాగడానికి కూడా సమయం దొరకనంత హడావిడి.ఆఫీస్ లో డెడ్ లైన్స్(ఏదో బ్లాగ్ లో అన్నట్టు మరణ రేఖలు!),పని వత్తిడి,సమస్యలు-పరిష్కారాలు.ఎక్కడా ఒక పని కుదురుగా చేసే సమయం-వీలు లేని పరిస్థితి.వేసవి కాలం వచ్చిందంటే మా అత్తయ్య ప్రోజెక్ట్ జాబితా తీస్తారు.ఎండా,వేడి ని ఇంత ప్రొడక్టివ్ గా వాడొచ్చా అనిపిస్తూ ఉంటుంది.వడియాలు,చల్ల మిరపకాయలు,ఆవకాయలు,ఒరుగులు…ఇలా ఆ లిస్ట్ కొనసాగుతూనే ఉంటుంది.వారంతంలో ఆవిడకి తోడుగా నేను వీటిలో పాలు పంచుకుంటూ ఉంటాను.

ఈ అన్ని పనులలోను ప్రకృతి తో మమేకం అయి,మన చుట్టూ పరిసరాలతో పాటు లీనం అయి సమయం గడపడం ఉంటుంది.కోమలమయిన పువ్వులను రోజు వచ్చే ఫార్వార్డ్ మైల్స్ లో చూసి ఆనందిచడమో-ఎప్పుడో బయటకి వెళ్ళినపుడు మూర పూలు కొని వాటి మొహం అయినా చూడకుండా హడావిడిగా తలలో తురుముకుని-ఇంటికి చేరగానె తీసి పక్కన పడెయ్యడమొ…ఎన్నళ్ళయిందీ సుకుమారంగా వాటిని తాకి,ప్రతి పువ్వును వేళ్ళ సందుల్లోంచి వెళ్ళనిచ్చి-మృదువైన అనుభూతిని పొంది!! అందుకే నాకు పువ్వుల మాల కడుతుంటే ఇప్పుడూ చాల మధురమైన అనుభూతి కలిగింది.అప్పుడు తిట్టి మరీ మాలలు కట్టడం నేర్పిన మా నానమ్మ గుర్తొచ్చి ఆ కాలానికి ఒకసారి మనసు వెళ్ళి తిరిగి వచ్చింది.

పొద్దున్నే మా బాబు ని లేపాలంటే తాతలు దిగి వస్తారు. అలాంటిది ఈ మధ్య మేడ మీదికి వెళ్ళి వడియాలు పెడదాం వస్తావా అంటే-చప్పున లేచి కుర్చుంటున్నాడు.ఫ్లాట్స్ జీవితంలో ఎవరి ఇల్లలో వాళ్ళు తలుపులేసుకుని ఏ టీ.వి చూస్తూనో గడిపేయడం అలవాటు పడిపోయాక,ఇలా ఏమైనా ఎండబెట్టడానికి పైకి వెలితే ఏదో కొత్త బంగారు లోకం కనపడినట్టు ఉంది.మాములుగా అయితే పని గట్టుకుని పైకి వచ్చే వీలే ఉండదు.ఏసి వాతావరణాలకి అలవాటైపోయిన బతుకులకి-వెచ్చటి సూరీడుని చూస్తే,ఆ వేసవి అనుభూతి తగులుతూ ఉంటే,వడియాలు తినడానికి వస్తున్న పక్షులను తరుముతూ,వాటిని పదిలంగా చూసుకుంటు-గాలి దుమారాల బారిన పడకుండా,జాగర్తగా ఎండబెట్టి తిరిగి జాడీల్లో పోసే మొత్తం ప్రక్రియలో ప్రకృతి తో బోలేడు సావాసం.బిజీ జీవితాలకి ఇది నిజంగానే ఒక ఆట విడుపు.

ఇక మావిడి కాయల పని-బహుసా కుటుంబ సభ్యులందరు కలిసి చేసే  పని ఇది ఒక్కటే ఏమో. మాములుగా మాటలు చాల తక్కువ అయిన మా ఇంట్లో,కాయ తేవడానికి మావ గారు,గట్టిగా ఉండే కాయలను ముక్కలు చేయడానికి మా వారు,నీలళ్ళొ వేసిన కాయలు ఒకోటి తెచ్చి హాల్లో పెడుతూ ఉడత సాయంలా మా బాబు…ఇలా నేను,మా అత్తయ్య మాత్రమే కాక ఇంట్లో అందరు కలిసి చేసే ఈ పని ఇపుడు చాల ఇంపుగా,అహ్లాదంగా అనిపించింది.ప్రతి ఒక్కరికి ఆవకాయ అపురూపమే,బాగ కుదురుతుందో లేదో అని.మాములుగా వంటింటి పనులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వని మగ వాళ్ళు కూడా ఈ మామిడి కాయ పనిలో లీనం అయిపొతారు.అందుకే రోజంతా అదే పనిలో గడిపినా బోర్ కొట్టలేదు.

మనం తిండి పదార్ధాలు తయారు చేసుకోడానికి చాల సమయమే వెచ్చిస్తాం.అసలు మన ఆహర అలవాట్లే అలాంటివి.మన సాంప్రదాయ పిండి వంటలు ఏమి చెయ్యాలన్న కనీసం ఇద్దరు కలవాలి.బొబ్బట్లు,కజ్జి కాయలు ఇలాటివి చేసిన ప్రతి సారి అనిపిస్తుంది-ఇవి తినడం ద్వారా వచ్చే రుచి కంటే కూడా,చేయడం ద్వారా వచ్చే తృప్తి,అది మిగిల్చిన అనుభూతి చాల విలువైంది అని.

వారంతంలో ఏ సినిమాకో,రెస్టారెంట్ కో, పార్క్ కో వెళ్ళి డబ్బులు పోసి సమయం గడిపేకంటే, కచ్చితంగా ఇలాంటి పనులలో తృప్తి ఉండి తీరుతుంది.అదీ కాక వారంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా జన సంధ్రం.ఆ కాసేపు టైం ఐతే గడిచిపోతుంది కాని,తీరా నెమరు వేసుకోడానికి ఒక్క మంచి అనుభూతి మిగలదు.

మన సాంప్రదాయం,సన్స్కృతి కి దగ్గరగా ప్రకృతి తో మనలని లీనం చేసే పైన చెప్పిన పనులు లాంటివి చేస్తే ఒక రకమైన తృప్తి.ముఖ్యంగా మనుషులను దగ్గర చేస్తుంది.పైకి చూడటానికి వారంతంలో కూడా పనేనా అనిపిస్తుంది-కాని నిజంగా అందులో ఆనందం తెలుసుకుంటే-మన గజి బిజి-బిజీ బ్రతుకుల్లో ఇవి ఎంతొ కొంత ఆట విడుపుగా అనిపిస్తాయి,పాత అనుభూతులను గుర్తు తెస్తాయి.ప్రియా పచళ్ళు,రెడీ మేడ్ ఫుడ్స్,స్వగృహా లంటి షాప్ లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తూ,డబ్బులు పడేయండి చాలు-ఏదయినా తయారు చేసి ఇస్తాం అనిపించేలా ఉన్నా సరే,షాపింగ్ కి వెచ్చించే సమయం,ఈ
త్రాఫిక్ జాం ల లో వెళ్ళి రావడం,వచ్చాకా నీరసం…ఇవన్నిటితో పోల్చి చూస్తే చాదస్తం గా అనిపించే మన ఆహార తయారీ పద్దతి ఖచ్చితంగా ఏ రకంగా చూసినా అర్ధవంతమైందే!

అందుకే చిన్నపుడు ఇలాటి పనుల ప్రాధాన్యత తెలీక-ఎందుకబ్బా తిండి కోసం ఇన్ని పాట్లు,ఇంత సమయం వృధా అనిపించేది.ఇప్పుడు యాంత్రిక జీవనంలో ఇవే కాస్తో కూస్తొ ఇంధనంగా పని చేస్తాయేమో అనిపిస్తోంది.

 

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “ఆ పనులే..ఇప్పుడెందుకు నచ్చుతున్నాయి??”

 1. sandeep Says:

  చాలా బాగా చెప్పారండీ… మీరన్నట్టు పువ్వులని, పున్నమివెన్నెలని ఫార్వార్డ్ మెయిల్స్ లోనే చూస్తున్నాం.

 2. దుర్గ Says:

  చాలా బాగా చెప్పారు.నేను కూడా నిన్న ఈ విషయం ఆలొచిస్తు వున్నాను.డిగ్రీ అవ్వేక జాబ్ లొ చేరే లొపు సమయం వేస్ట్ అవుతొంది అని తెగ బాధ పడుతూనే అమ్మ కి సాయం చేస్తూ అన్నీ నేర్చు కున్నాను. ఇప్పుడు ఇవన్నీ చాలా మందికి అస్సలు ఇంట్లొ చెస్తారని కుడా తెలియదు .పొద్దున్నించి రాత్రి వరకు ఒకటే పరుగులు .ఏమి మిస్స్ అవుతున్నమో కుదా తెలియదు .

 3. Sujatha Says:

  బాగా చెప్పారండి! చిన్నప్పుడు ఆ పనులన్నీ అమ్మ చెప్పినప్పుడు అదో పెద్ద బర్డెన్ లాగా అనిపించేది కదూ! ఉరుకుల పరుగుల జీవితాల్లో మళ్ళీ అటువంటి పనులు తొంగి చూస్తే, మర్చిపోయిన మనల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్లవుతుంది. పిల్లల విషయంలో మీరు చెప్పింది 100% నిజం. మా పాప కూడా అమ్మా వాళ్ళింటికి వెళితే నా దగ్గరకు లంచం ఇచ్చినా రాదు. అమ్మమ్మ వెంట తిరుగుతూ తోట పని చేయడం, కూరలు కోయడం, మడి బట్టలు ఆరేయడం, వడియాలు పెట్టడం…ఇవన్నీ దానికెంతో నచ్చుతాయి.

  ‘మనం’ తయారు చేసుకున్నాం అనే త్రుప్తి మాత్రమే కాదు, నెమరేసుకోవడానికి అనుభూతి కూడా మిగులుతుంది వీటి వల్ల! ‘కలిసి పని చేయడం’ అంటే ఏమిటో పెద్ద ఉదాహరణల్లేకుండా ఆవకాయ వల్లే తెల్సుకోవచ్చు.
  మన చిన్నప్పుడు లైఫ్ ఇంత గజిబిజిగా, హడావిడిగా ఉండేది కాదు. అందువల్ల పూలు మాల కట్టడం, మొదలైన పనులు మనకు బోరు కొట్టేవి. వాటి విలువ అప్పుడు మనకు తెలియదు. ఎప్పుడైతే మన జీవితంలోంచి అవి నిష్క్రమించాయో, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం! మనం అద్రుష్టవంతులం…వాటి విలువ ఇప్పుడైనా తెలుసుకున్నాం!

  తాజా కలం: ఆవకాయ పెట్టే రోజు పెద్ద హడావిడిగా ఉండే మా వంటిల్లుని బాగా గుర్తు చేసారు. థాంక్స్.

 4. విహారి(kbl) Says:

  చాలా బాగుంది మీ జ్ఞాపకాల దొంతర.చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికి మధురమే.

 5. కొల్లూరి సోమ శంకర్ Says:

  మీ ఆర్టికల్ బాగుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ గారింట్లో అవకాయ పెట్టే సన్నివేశాలు గుర్తొచ్చాయి. మా అమ్మమ్మ గారు పిల్లలో సహ అందరినీ ఇన్‌వాల్వ్ చేసేవారు. ఆవకాయ అన్నం తిన్నప్పుడల్లా ఆ రోజులు గుర్తొచ్చేవి. మావయ్యలు, అత్తయ్యలను తలుచుకుని ఆనందించేవాళ్ళం.

 6. జ్యోతి Says:

  చాలా బాగుంది మీ టపా. కాని ఇవి ప్రతి వేసవిలో నాకు మామూలే. మామిడికాయలు తేవడం దగ్గరనుండి ఆవకాయ గిన్నెలు కడగడం వరకు ఓ ప్రహసనం. పిల్లలపై అరుస్తూ పని చేయించడం. ఎండలు ముదిరేదాకా చూసి రాత్రి వడియాల పిండి ఉడికించి.పొద్దున్నే ఆరుగంటలకు పిల్లలను పట్టుకుని డాబా పైకి ఎక్కి వాళ్ళకు ఏదో లంచం ఆశ చూపించి ఎండ ఎక్కువ కాకముందే పూర్తి చేసుకుని క్రిందకు దిగడం. చేసేటప్పుడు ఆపసోపాలు పడ్డా. అవి ఏడాదంతా ఉపయోగపడతాయి.ఎన్నని కొనుక్కుంటాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: